తెలుగు టైటాన్స్ మెరుపులు

21 Jul, 2015 00:00 IST|Sakshi
తెలుగు టైటాన్స్ మెరుపులు

- పుణేరి పల్టన్‌పై విజయం
- ప్రొ కబడ్డీ లీగ్-2
ముంబై:
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుని జోరును ప్రదర్శించింది. సోమవారం పుణెరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు 45-24 తేడాతో ఘన విజయం సాధించింది. ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ సమష్టి ఆటతీరుతో విరుచుకుపడడంతో ప్రత్యర్థి బేజారెత్తింది. 24 పాయింట్లు రైడింగ్ ద్వారా రాగా ఆరు సార్లు ఆలౌట్ చేయడం టైటాన్స్ ఆధిపత్యం ఎలా సాగిందో తెలుస్తుంది.

స్టార్ రైడర్ రాహుల్ చౌధరి అత్యధికంగా 10, దీపక్ నివాస్ 6 రైడ్ పాయింట్లు సాధించారు. సందీప్ 5 డిఫెన్స్ పాయింట్లు జట్టుకు అందించాడు. తొలి అర్ధ భాగంలో 14-11తో వెనుకబడినప్పటికీ టైటాన్స్ ఏమాత్రం ఒత్తిడికి లోను కాలేదు. రాహుల్, దీపక్ సూపర్ రైడింగ్‌తో ఏకంగా 30-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఏ దశలోనూ పుణె జట్టు పోటీనివ్వలేకపోయింది.
 
ముంబా హ్యాట్రిక్: పీకేఎల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన యు ముంబా జట్టు హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. పాట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 25-20 తో నెగ్గి టోర్నీ టాపర్‌గా తన హవా కొనసాగిస్తోంది. గత రెండు లీగ్ మ్యాచ్‌ల్లో యు ముంబా జట్టు డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్‌పాంథర్స్‌పై, బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. పాట్నాతో జరిగిన మ్యాచ్‌లో అనూప్ ఏడు పాయింట్లు, షబీర్ ఐదు పాయింట్లు, రిషాంక్ నాలుగు పాయింట్లు స్కోరు చేసి యు ముంబా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం యు ముంబా 15 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... తెలుగు టైటాన్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌తో యు ముంబా తలపడుతుంది.

మరిన్ని వార్తలు