ఓటమి ఎవరి ఖాతాలో?

18 Jan, 2018 01:55 IST|Sakshi

సాక్షి క్రీడావిభాగం : ‘అత్యుత్తమమైన 11 మంది అంటే ఎవరు? మీరే చెప్పండి. మీరు ఎంపిక చేసిన 11 మందినే తీసుకుంటాను’... సెంచూరియన్‌ టెస్టులో ఓటమి అనంతరం మీడియా సమావేశంలో తుది జట్టు ఎంపిక గురించి అడిగిన ప్రశ్నకు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒకింత ఆగ్రహంతో ఇచ్చిన సమాధానం ఇది. చాలా కాలంగా పరుగుల వరద పారించడంతో పాటు ప్రశాంతంగా నాయకత్వ బాధ్యతలు కొనసాగిస్తూ వివాదాలకు దూరంగా ఉంటున్న కోహ్లి ఇలా ఒక్కసారిగా అసహనం ప్రదర్శించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

 ఈ టెస్టులో ఇప్పటికే తన దుందుడుకు చర్యతో ఐసీసీ శిక్షకు గురయ్యాక మ్యాచ్‌లో పరాజయం పలకరించడంతో ఒక్కసారిగా పాత కోహ్లి బయటకు వచ్చాడు. అనూహ్య రీతిలో రెండు టెస్టుల్లో పరాభవం ఎదుర్కోవడాన్ని అతను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడనేది వాస్తవం. ఈ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు ఎన్నో అంచనాలు ఉన్నాయి. రెండేళ్లుగా సాగిస్తున్న వరుస విజయాల కిరీటాన్ని నెత్తిన పెట్టుకొని మనోళ్లు సఫారీ గడ్డపై అడుగు పెట్టారు. పేస్‌ బౌలింగ్‌ గొప్పగా ఉందని, గతంలో ఏ జట్టూ సాధించని ఘనతను వీరు చేసి చూపిస్తారని, రాబోయే 18 నెలల తర్వాత అందరు హా..శ్చర్యపోయే తరహాలో టీమిండియా కనిపిస్తుందని కోచ్‌ రవిశాస్త్రి చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చారు. కానీ తుది ఫలితానికి వచ్చేసరికి అంతా తారుమారైంది. ఎప్పటిలాగే విదేశీ గడ్డపై మేమింతే అన్నట్లుగా పాత జట్లనే తలపిస్తూ మనోళ్లు రెండు టెస్టుల్లో ఓటమి మూటగట్టుకున్నారు.  

నిజానికి సెంచూరియన్‌ టెస్టు పిచ్‌ భారత్‌లోలాగానే ఉందని గావస్కర్‌ మొదలు విశ్లేషకులంతా అభిప్రాయపడ్డారు. మోర్నీ మోర్కెల్‌ అయితే 100 శాతం భారత పిచ్‌పైనే బౌలింగ్‌ చేస్తున్నట్లుంది అని వ్యాఖ్యానించాడు. ఇలాంటి చోట కూడా మనోళ్లు ప్రయోజనం పొందలేకపోయారంటే బ్యాటింగ్‌ వైఫల్యమే కారణం. దీనికి తోడు నాసిరకం ఫీల్డింగ్, వికెట్ల మధ్య పేలవమైన పరుగు. ధావన్‌ స్థానంలో వచ్చిన రాహుల్‌ రెండు ఇన్నింగ్స్‌లలోనూ చెత్త షాట్‌లు ఆడి అవుట్‌ కాగా, విజయ్‌ మరోసారి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. మూడో స్థానంలో పుజారాను కూడా నమ్మలేని పరిస్థితి వచ్చింది! పైగా ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లలో రనౌట్‌ అయిన తీరు విచారకరం. 

తొలి ఇన్నింగ్స్‌లో అవసరం లేకపోయినా తొలి బంతికే సింగిల్, రెండో ఇన్నింగ్స్‌లో మూడో పరుగు తీసే ప్రయత్నం చేయడం పెద్ద సాహసమే. సరిగ్గా చెప్పాలంటే భారత ఆటగాళ్లు టెస్టుల్లో రనౌటైన గత ఎనిమిది సందర్భాల్లో ఆరింటిలో పుజారానే భాగంగా ఉన్నాడు!  సోమరితనంతో గాల్లో బ్యాట్‌ ఉంచి పాండ్యా రనౌట్‌ అయిన తీరు అయితే మరీ ఘోరం. వన్డే ఫామ్‌ను, భారత్‌లో ప్రదర్శనను బట్టి రోహిత్‌ శర్మపై గట్టి నమ్మకం ఉంచిన కెప్టెన్‌ పునరాలోచించుకునేలా రెండు టెస్టుల్లోనూ అతని ఆట సాగింది. ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఓటమిలో అతనికీ భాగం ఉంది. కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేయడం అతని స్థాయిని చూపించినా... గెలవాలంటే తానొక్కడే ఆడితే సరిపోదని అతనికీ అర్థమై ఉంటుంది. 

రెండు టెస్టుల్లోనూ ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్‌ చేయగలిగిన బౌలర్లను తప్పు పట్టడానికేమీ లేదు. భువనేశ్వర్, షమీ, బుమ్రా, ఇషాంత్‌... నలుగురూ కీలక సందర్భాల్లో జట్టుకు విలువైన వికెట్‌లు అందించి మ్యాచ్‌పై పట్టు చిక్కేలా చేశారు. కానీ బ్యాటింగ్‌ మనల్ని తెల్లబోయేలా చేసింది. ఫీల్డింగ్‌లో ఒక్కొక్కరు వంతుల వారీగా క్యాచ్‌లు వదిలేయడం ఒకవైపు అయితే... కీపర్‌గా పార్థివ్‌ వైఫల్యం మరో పెద్ద దెబ్బ. రెండో ఇన్నింగ్స్‌లో తాను పట్టాల్సిన క్యాచ్‌ను వదిలేసి మొదటి స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ వైపు వేలు చూపడం దీనికి పరాకాష్ట!  

ఈ ఫలితం తర్వాత మూడో టెస్టుకు మార్పులు మాత్రం ఖాయం. ఈ ఓటములను భారత మేనేజ్‌మెంట్‌ నిజంగానే సీరియస్‌గా తీసుకుంటుందా లేక మరో 9 రోజుల్లో జరగబోయే ఐపీఎల్‌ వేలం సమయానికి జనం అంతా మర్చిపోతారని భావిస్తోందా తెలీదు. అయితే తొలి టెస్టులో బాగా ఆడిన భువీని ఇక్కడ తప్పించినట్లు కోహ్లి అనూహ్య నిర్ణయాలు ఏమైనా తీసుకోవచ్చు. ఫలితం ఎలా వచ్చినా తాను కెప్టెన్‌గా ఉన్న 34 టెస్టుల్లోనూ ప్రతీ మ్యాచ్‌కు తుది జట్టును మార్చిన రికార్డు కోహ్లికి ఉంది! కాబట్టి ఎవరు వచ్చి ‘వాండరర్స్‌’లో జట్టు అదృష్టాన్ని మార్చగలరో చూడాలి.  
కొసమెరుపు: భారత్‌ రనౌట్ల బాధ చూస్తుంటే ఇక్కడ కూడా రహానే అవసరం కనిపిస్తోంది. టెస్టు కెరీర్‌లో 149 బ్యాటింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌లలో భాగంగా ఉన్నా... ఒక్కసారి కూడా తాను రనౌట్‌ కాకపోగా, మరో ఎండ్‌లో ఎవరినీ రనౌట్‌ చేయని అరుదైన ఘనత రహానేకు ఉంది.      

ఓదార్చేందుకు లేనిక్కడ... 
నేను ఇక్కడ ఉన్నది మా ఆటగాళ్లను ఓదార్చేందుకు కాదు. మా జట్టు ఇప్పటికీ అత్యుత్తమమని మేం నమ్ముతున్నాం. ఏదో వచ్చామా, వెళ్లామా అన్నట్లు కాదు. సిరీస్‌ గెలుస్తామనే నమ్మకం లేకపోతే ఇక్కడికి రావడం అనవసరం. మాకు రెండు టెస్టుల్లోనూ గెలిచే అవకాశాలు వచ్చాయి. రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చినప్పుడు వారు అసలు ఎప్పుడైనా విజయానికి చేరువగా రాగలిగారా! నేను ప్రతీ టెస్టుకు తుది జట్టును మార్చడానికి, మ్యాచ్‌ ఫలితానికి సంబంధం లేదు. ఓటమి బాధించడం సహజం. కానీ అత్యుత్తమమైన 11 మంది వీరే అంటూ చెబితే దానిని నేను అంగీకరించను. మా దృష్టిలో అందరూ ఒకటే. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. సులభంగా వికెట్లు అప్పగించడమే ఓటమికి కారణం. పరాజయంపై మమ్మల్ని మేం ప్రశ్నించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కాల్సింది. ఓటమి ఎదురైన చోట నా 153 పరుగులకు ఇప్పుడు విలువే లేదు. సరైన సన్నద్ధత లేకుండా ఇక్కడికి వచ్చామనే మాటను కూడా నేను నమ్మను. విదేశాల్లో గెలవాలంటే క్షణక్షణం పోరాడే ఒక రకమైన మొండితనం ఆటగాళ్లకు అవసరం. 
–విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌   

మరిన్ని వార్తలు