భుజాలపై మోసిన ఆ క్షణం...

12 Jan, 2020 03:10 IST|Sakshi

లారెస్‌ అవార్డుల రేసులో 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ విజయం  

లండన్‌: ఏప్రిల్‌ 2, 2011... భారత క్రికెట్‌ అభిమాని ఎన్నటికీ మరచిపోలేని తేదీ. 28 ఏళ్ల తర్వాత మన టీమ్‌ మళ్లీ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ముఖ్యంగా సీనియర్‌ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌కు అది మరింత ప్రత్యేకం. అంతకుముందు సచిన్‌ ఆడిన ఐదు ప్రపంచకప్‌లు నిరాశను మిగిల్చగా... ఆరో ప్రయత్నంలో అతను విశ్వ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. నాడు జట్టు సహచరులు అతడిని తమ భుజాలపై మోసి వాంఖడే మైదానంలో ఊరేగించారు.

ఇప్పుడు అదే క్షణం ప్రతిష్టాత్మక లారెస్‌ స్పోర్ట్స్‌ అవార్డుల రేసులో నిలిచింది. 2000 నుంచి 2020 మధ్య క్రీడల్లో అత్యుత్తమంగా నిలిచిన 20 ఘటనలను నిర్వాహకులు నామినేట్‌ చేశారు. టీమిండియా గెలిచిన క్షణాన్ని మొత్తం దేశాభిమానుల ఆనందం కోణంలో లారెస్‌ ‘క్యారీడ్‌ ఆన్‌ ద షోల్డర్స్‌ ఆఫ్‌ ఎ నేషన్‌’ అని టైటిల్‌ పెట్టింది. విజేతను తేల్చేందుకు పబ్లిక్‌ ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 17న బెర్లిన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో లారెస్‌ స్పోర్ట్స్‌ అవార్డులను ప్రకటిస్తారు.   

మరిన్ని వార్తలు