పుష్కర కాలం నాటి ఇన్నింగ్స్‌.. చిరస్మరణీయం

24 Apr, 2020 11:02 IST|Sakshi

న్న్యూఢిల్లీ: భారత‌ క్రికెట్‌ జట్టు తరఫున 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. టెస్టులు (200 మ్యాచ్‌లు–15,921 పరుగులు), వన్డేల్లో (463 మ్యాచ్‌లు–18,426 పరుగులు) అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగ రాశాడు. 2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తూనే... దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నాడు. దీనికిముందే 1994లో అర్జున అవార్డు, 1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్‌ పురస్కారాలను పొందాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచ కప్‌లలో పాల్గొన్న సచిన్‌... 2011లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడిగా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. (‘సచిన్‌ ఏడుస్తూనే ఉన్నాడు’)

రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన మాస్టర్‌.. తన బ్యాటింగ్‌తో  ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు.  తన రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా సచిన్‌ పేరు మీద చాలా రికార్డులు ఉండిపోయాయి. ప్రధానంగా వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో మోస్ట్‌ సెంచరీల ఘనత కూడా సచిన్‌ పేరు మీద ఇంకా అలానే ఉంది. ఈరోజు (ఏప్రిల్‌ 24) 47వ వసంతాలు పూర్తి చేసుకున్నాడు మాస్టర్‌ బ్లాసర్‌. కాగా,  దేశంలో కరోనా వైరస్‌ కారణంగా పుట్టిన రోజు వేడుకలకు సచిన్‌ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే సచిన్‌కు అటు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)తో పాటు పలువురు విషెస్‌ తెలియజేశారు.

2008లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ చేసిన సెంచరీని బీసీసీఐ ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపింది. పుష్కర కాలం నాటి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ను గుర్తు చేసింది. ఇంగ్లండ్‌పై సచిన్‌ చేసిన సెంచరీల్లో ఇదొక అ‍ద్భుతమైన అని బీసీసీఐ పేర్కొంది. ఆ సెంచరీని 26/11 బాధితులకు సచిన్‌ అంకితం ఇచ్చిన విషయాన్ని బీసీసీఐ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇక రవిశాస్త్రి శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ మీరు క్రికెట్‌లో వదిలిపెట్టిన వారసత్వం ఎ‍ప్పటికీ అజరామరం. గాడ్‌ బ్లెస్‌ చాంప్‌’ అని పేర్కొన్నాడు.  యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, అజిత్‌ అగార్కర్‌, హర్భజన్‌ సింగ్‌, గౌతం గంభీర్‌ తదితరులు సచిన్‌కు విషెష్‌ తెలిపిన వారిలో ఉన్నారు.(తుఫాన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాడు‌)


 

మరిన్ని వార్తలు