అదో గొప్ప ఆలోచన: సచిన్

27 Oct, 2015 18:01 IST|Sakshi
అదో గొప్ప ఆలోచన: సచిన్

లండన్: అంతర్జాతీయ క్రీడ అయిన క్రికెట్ ను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టే ఆలోచనను తాను కూడా స్వాగతిస్తున్నట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. క్రికెట్ ను ఒలింపిక్స్  లో ప్రవేశపెడితే మరింత ఆదరణ లభిస్తుందని పేర్కొన్నాడు. క్రికెట్ లో ట్వంటీ 20  ఫార్మెట్ అనేది ఒలింపిక్స్ కు సరిగ్గా సరిపోతుందని లిటిల్ మాస్టర్ పేర్కొన్నాడు. క్రికెట్ ను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప ఆలోచనగా సచిన్ పేర్కొన్నాడు.

 

సచిన్ తో పాటు ఆస్ట్రేలియన్ మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్నర్ కూడా మద్దతు పలికాడు. సోమవారం బీబీసీతో మాట్లాడిన వార్నర్ .. క్రికెట్ ను ఒలింపిక్ గేమ్ గా చూడాలని తాను కూడా కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ అంశంపై వచ్చే నెలలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)- అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మధ్య చర్చలు జరుగనున్న నేపథ్యంలో సచిన్, వార్నర్ వ్యాఖ్యలు  ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

అమెరికాలో క్రికెట్‌కు ప్రజాదరణ పెంచేందుకు దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌లు ఏర్పాటు చేసిన టి20 టోర్నీ నవంబర్‌లో జరగనుంది. ‘క్రికెట్ ఆల్ స్టార్ సిరీస్-2015’  పేరిట జరగనున్న ఈ టోర్నీలో సచిన్ బాస్లర్స్ టీమ్...వార్న్ వారియర్స్ జట్టుతో తలపడుతుంది. ఈ రెండు జట్లకు సచిన్, వార్న్‌లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. గంగూలీ, లక్ష్మణ్, అగార్కర్, పాంటింగ్, హెడెన్, మెక్‌గ్రాత్, హాడిన్‌లాంటి 24 మంది మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. వచ్చే నెల 7, 11, 14 తేదీల్లో న్యూయార్క్ సిటీ, హూస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి రెండు డే మ్యాచ్‌లు కాగా, ఆఖరిది ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సాగనుంది.

మరిన్ని వార్తలు