యూకీ పరాజయం

24 Feb, 2016 00:19 IST|Sakshi

దుబాయ్: భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ వరుసగా రెండో టోర్నమెంట్‌లోనూ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. గతవారం ఢిల్లీ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన ఈ ఢిల్లీ ఆటగాడు... తాజాగా దుబాయ్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగిన యూకీ మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో 6-2, 6-7 (2/7), 0-6తో ప్రపంచ 51వ ర్యాంకర్ లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ మూడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.

ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు. రెండో సెట్‌ను టైబ్రేక్‌లో చేజార్చుకున్న యూకీ నిర్ణాయక మూడో సెట్‌లో ఒక్క గేమ్ కూడా నెగ్గకపోవడం గమనార్హం.
 
భూపతి జంట ఓటమి: పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో మహేశ్ భూపతి (భారత్)-ఐజామ్ ఉల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్) జంట 4-6, 2-6తో సిమోన్ బొలెలీ-ఆండ్రియా సెప్పి (ఇటలీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భూపతి జంట నాలుగు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు చేజార్చుకుంది. గతవారం ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో యూకీ బాంబ్రీతో కలిసి ఆడి డబుల్స్ టైటిల్ నెగ్గిన భూపతి ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు