ఫ్రాన్స్ తొలిసారి...

6 Jan, 2014 00:46 IST|Sakshi
ట్రోఫీతో కార్నెట్, సోంగా

 పెర్త్: హాప్‌మన్ కప్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఈ మిక్స్‌డ్ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను ఫ్రాన్స్ సాధించడం ఇదే తొలిసారి. ఇక్కడి పెర్త్ ఎరెనాలో జరిగిన టైటిల్ పోరులో ఫ్రాన్స్ 2-1తో పోలండ్‌పై విజయం సాధించింది. జో విల్‌ఫ్రెడ్ సోంగా తొలుత సింగిల్స్, తర్వాత కార్నెట్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో గెలుపొందడంతో జట్టు నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ సోంగా 6-3, 3-6, 6-3తో గ్రెగొర్జ్ ప్యాన్‌ఫిల్‌పై నెగ్గడంతో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తర్వాత మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-3, 6-7 (9/7), 6-2తో అలైజ్ కార్నెట్‌పై గెలిచి 1-1తో స్కోరును సమం చేసింది. ఈ దశలో మిక్స్‌డ్ డబుల్స్‌లో కార్నెట్‌తో కలిసి బరిలోకి దిగిన సోంగా 6-0, 6-2తో రద్వాన్‌స్కా-ప్యాన్‌ఫిల్ జోడిని కంగుతినిపించాడు. కేవలం 47 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. సోంగా చక్కని ఆటతీరుతో త్వరలో ఆరంభమయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు.
 

మరిన్ని వార్తలు