ఫెడరర్‌ టైటిల్స్‌ ‘సెంచరీ’ 

3 Mar, 2019 01:15 IST|Sakshi

కెరీర్‌లో 100వ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన స్విస్‌ దిగ్గజం

దుబాయ్‌: స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ శనివారం తన కెరీర్‌లో వందో సింగిల్స్‌ టైటిల్‌ సాధించాడు. దుబాయ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో గ్రీస్‌ యువ కెరటం సిట్సిపాస్‌ను ఓడించడం ద్వారా అతడీ ఘనతను అందుకున్నాడు. ఫైనల్లో ఫెడరర్‌ 6–4, 6–4తో ప్రపంచ పదో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ను అలవోకగా ఓడించి ఈ టైటిల్‌ను ఎనిమిదోసారి సొంతం చేసుకున్నాడు. ఇదే క్రమంలో కెరీర్‌ వందో టైటిల్‌ రికార్డునూ అందుకున్నాడు.

అమెరికా టెన్నిస్‌ గ్రేట్‌ జిమ్మీ కానర్స్‌ (109 టైటిల్స్‌) తర్వాత అరుదైన ‘సెంచరీ క్లబ్‌’లో చేరిన రెండో ఆటగాడు ఫెడరర్‌ మాత్రమే కావడం విశేషం. ప్రస్తుతం ఈ స్విస్‌ వీరుడి ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌... 6 ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్స్‌... 27 ఏటీపీ వరల్డ్‌ టూర్‌ మాస్టర్స్‌–1000 టైటిల్స్‌... 22 ఏటీపీ వరల్డ్‌ టూర్‌–500 టైటిల్స్‌... 25 ఏటీపీ వరల్డ్‌ టూర్‌–250 టైటిల్స్‌ ఉన్నాయి. వీటిలో 25 టైటిల్స్‌ను కెరీర్‌ ఉన్నత స్థితిలో ఉన్న 2003 అక్టోబరు–2005 అక్టోబరు మధ్య కాలంలోనే సాధించడం గమనార్హం.     

మరిన్ని వార్తలు