‘ఆ చాంపియన్‌షిప్‌ గడువు పెంచండి’

11 Apr, 2020 11:32 IST|Sakshi

లాహోర్‌: అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్యూటీసీ) నిర్ణీత షెడ్యూల్‌లో జరపడం సాధ్యం కాకపోతే దాన్ని పొడిగించి పూర్తి స్థాయిలో మ్యాచ్‌లు జరిగేలా చూడాలని పాకిస్తాన్‌ టెస్టు కెప్టెన్‌ అజహర్‌ అలీ పేర్కొన్నాడు.  పాకిస్తాన్‌ క్రికెట్‌ చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌ ఇప్పటికే ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా, దానికి అజహర్‌ అలీ కూడా మద్దతు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌ గురించి ఆలోచించడం సరైనది కాదని, అయితే ఒక్కసారి సాధారణ స్ధితికి వస్తే క్రికెట్‌పై  ఆసక్తి పెరుగుతుందన్నాడు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించినా తమకు సమ్మతమేని అజహర్‌ స్పష్టం చేశాడు. (మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు..!)

‘ప్రస్తుతం ఎటువంటి స్పోర్ట్స్‌ ఈవెంట్‌ టీవీలు రావడం లేదు. మళ్లీ టీవీల్లో క్రీడా ఈవెంట్‌లుప్రసారమైతే ప్రజలు కచ్చితంగా సంతోషంగా ఉంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఐసీసీ నిర్వహించే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ చాలా సుదీర్ఘమైనది. దీనిపై ఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సిన  అవసరం ఉంది. ముందస్తు షెడ్యూల్‌ను పొడిగిస్తేనే మంచిది. ఒక సుదీర్ఘ షెడ్యూల్‌ను పొడిగించడం కష్టమే. కానీ తప్పదు.టెస్టు చాంపియన్‌షిప్‌ను పొడిగించడానికే నా ఓటు’ అని అజహర్‌ అలీ తెలిపాడు. 

గతేడాది ఆగస్టులో వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌ మొదలవుతుంది. ప్రస్తుత్తం టెస్ట్‌ క్రికెట్‌లో టాప్‌–9లో ఉన్న జట్ల మధ్య స్వదేశీ, విదేశీ సిరీస్‌ లతో సాగే ఈ మెగా టోర్నమెంట్‌ 2021 లో ముగుస్తుంది. రెండేళ్లలో 71 మ్యాచు లు, 27 సిరీస్‌లు జరుగుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ ఆడతాయి. ఇంగ్లండ్‌లో 2021, జూన్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించడానికి ఐసీసీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. అయితే కరోనా వైరస్‌ ప్రభావంతో అనుకున్న సమయానికి ఈ చాంపియన్‌షిప్‌ పూర్తి కావడం అసాధ్యం. దాంతోనే ఆ షెడ్యూల్‌ గడువును  పెంచాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది.(బాంబులతో కాదు.. సాఫ్ట్‌బాల్స్‌ ప్రాక్టీస్‌ చేయండి!)

మరిన్ని వార్తలు