‘భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతం’

13 May, 2020 14:24 IST|Sakshi

చంఢీఘడ్‌ : కరోనా మహమ్మారితో టెస్ట్‌ క్రికెట్ ప్రమాదంలో పడిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్ అన్నాడు. భారత్​వద్దనుకుంటే టెస్ట్‌ ఫార్మాట్​అంతరించిపోయే స్థితికి చేరేలా ఉందని ప్లేవ్రైట్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఫేస్​బుక్​లైవ్‌లో అన్నాడు. ఈ లైవ్లో ప్రముఖ కామెంటేటర్‌ చారు శర్మతోపాటూ ప్లేవ్రైట్‌ వ్యవస్థాపకులు వివేక్ ఆత్రేయ్‌ పాల్గొన్నారు. టెస్ట్‌ క్రికెట్‌ను పునరుద్ధరించడంలో భారత్​కీలకపాత్ర పోషిస్తుందని నమ్ముతున్నానని, భారత్ వద్దనుకుంటే టెస్ట్‌ క్రికెట్ అంతరించిపోయే ప్రమాదముందని చాపెల్ చెప్పాడు.

‘భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాత్రమే టెస్ట్‌ క్రికెట్ ఆడేలా యువకులను ప్రోత్సహిస్తున్నాయి. మిగిలిన దేశాలేవీ అలా చేస్తున్నట్టు కనిపించడం లేదు. టీ20లకు నేను వ్యతిరేకం కాదు. ప్రజలకు ఆ ఫార్మాట్​ ద్వారా చేరువవడం సులభం. కాకపోతే టెస్ట్‌ క్రికెట్‌కు గడ్డు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అయితే టెస్ట్‌ ఫార్మాటే అత్యుత్తమ క్రికెట్​అని టీమ్​ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ చెప్పడంతో టెస్ట్‌ క్రికెట్ బతికే ఉంటుందన్న ఆశ కలిగింది’ అని గ్రెగ్ చాపెల్ అన్నాడు.
 
కాగా, భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియన్ గ్రెగ్ చాపెల్ కోచ్‌గా పనిచేసిన రెండేళ్ల కాలం అత్యంత వివాదాస్పదం. జట్టు ప్రదర్శన సంగతి పక్కన పెడితే...ప్రతీ ఆటగాడు ఆ సమయంలో తీవ్ర అభద్రతా భావానికి లోనయ్యాడనేది నిర్వివాదాంశం. చాపెల్ ఎపిసోడ్‌పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో అనేక అంశాలు వెల్లడించిన విషయం తెలిసిందే. చాపెల్ వ్యవహార శైలిపై ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకంలో ఆయనో రింగ్ మాస్టర్ అని సచిన్‌ విరుచుకు పడ్డాడు.

>
మరిన్ని వార్తలు