శభాష్‌... సాయిప్రణీత్‌

5 Jun, 2017 00:43 IST|Sakshi
శభాష్‌... సాయిప్రణీత్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ టైటిల్‌ సొంతం

బ్యాంకాక్‌: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ యవనికపై మరోసారి భారత్‌ పతాకం రెపరెపలాడింది. ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌లో భారత యువతార భమిడిపాటి సాయిప్రణీత్‌ చాంపియన్‌గా నిలిచాడు. 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ సాయిప్రణీత్‌ 17–21, 21–18, 21–19తో నాలుగో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. ఈ విజయంతో సాయిప్రణీత్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 80 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్‌ పాయిం ట్లు లభించాయి. మరోవైపు భారత బ్యాడ్మింటన్‌ సంఘం రూ. 3 లక్షలు నజరానా ప్రకటించింది.

ఏప్రిల్‌ నెలలో సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన ప్రపంచ 24వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ కెరీర్‌లో ఇది తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిల్‌ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో సాయిప్రణీత్‌ ఫైనల్‌కు చేరుకున్నా తుది పోరులో భారత్‌కే చెందిన సమీర్‌ వర్మ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. తాజా విజయంతో 43 ఏళ్ల చరిత్ర కలిగిన థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో... పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా సాయిప్రణీత్‌ గుర్తింపు పొందాడు. 2013లో హైదరాబాద్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌ తొలిసారి ఈ ఘనత సాధించాడు. 2012లో సైనా నెహ్వాల్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది.
పురుషుల సింగిల్స్‌లో భారత్‌ తరఫున గ్రాండ్‌ప్రి గోల్డ్‌ స్థాయి టోర్నీ గెలిచిన ఐదో ప్లేయర్‌గా సాయిప్రణీత్‌ నిలి చాడు. గతంలో శ్రీకాంత్‌ మూడు సార్లు (2013 థాయ్‌లాండ్‌ ఓపెన్, 2015 స్విస్‌ ఓపెన్, 2016 సయ్యద్‌ మోడీ ఓపెన్‌), కశ్యప్‌ రెండు సార్లు (2012, 2015 సయ్యద్‌ మోడీ ఓపె న్‌), అరవింద్‌ భట్‌ (2014 జర్మన్‌ ఓపెన్‌), సమీర్‌ వర్మ (2017 సయ్యద్‌ మోడీ ఓపెన్‌) ఒక్కోసారి గ్రాండ్‌ప్రి గోల్డ్‌ స్థాయి టోర్నీల్లో టైటిల్స్‌ గెలిచారు.

వెనుకబడి పుంజుకొని...
ఫైనల్‌ చేరుకునే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్‌ కూడా కోల్పోని సాయిప్రణీత్‌కు తుది పోరులో గట్టిపోటీనే లభించింది. ప్రపంచ 27వ ర్యాంకర్‌ జొనాథన్‌ క్రిస్టీతో తొలిసారి ఆడిన ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ మొదటి గేమ్‌లో కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో తన పొరపాట్లను సవరించుకొని సాయిప్రణీత్‌ తేరుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌ ఆరంభంలో సాయిప్రణీత్‌ 3–8తో వెనుకంజ వేశాడు. కానీ సంయమనం కోల్పోకుండా ఆడి నిలకడగా పాయింట్లు సాధించి స్కోరును 9–9తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రతీ పాయింట్‌ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 17–17తో సమంగా ఉన్నపుడు సాయిప్రణీత్‌ రెండు పాయింట్లు నెగ్గి 19–17తో ముందంజ వేశాడు. ఆ వెంటనే రెండు పాయింట్లు కోల్పోవడంతో మళ్లీ స్కోరు 19–19తో సమమైంది. ఈ దశలో సాయిప్రణీత్‌ వెంటవెంటనే రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

కేవలం ర్యాలీలపైనే నా దృష్టిని కేంద్రీకరించాను. ఫైనల్‌ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ముఖ్యంగా సుదీర్ఘ ర్యాలీలు నా సహనాన్ని పరీక్షించాయి. అయితే ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా సంయమనంతో ఆడి ఫలితాన్ని సాధించాను. టైటిల్‌ నెగ్గినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు.
–సాయిప్రణీత్‌

మరిన్ని వార్తలు