టీవీ ధృతరాష్ట్రుడు.. స్వర్ణ పతక విజేత!

1 Dec, 2015 18:37 IST|Sakshi
టీవీ ధృతరాష్ట్రుడు.. స్వర్ణ పతక విజేత!

బ్యాంకాక్:థాకూర్ అనూప్ సింగ్..  ఇప్పటి వరకూ భారత దేశంలో కొంత మందికి మాత్రమే సుపరిచితమైన అతను తాజాగా ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించాడు. గత శనివారం బ్యాంకాక్ లో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ మీట్ లో స్వర్ణ పతకాన్ని సాధించి మువ్వన్నెల పతకాన్ని మరోసారి అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించాడు. 47 దేశాల నుంచి వచ్చిన యోధుల్ని పక్కకు నెట్టి పసిడిని దక్కించుకున్నాడు.  ఈ సరికొత్త ఫీట్ ను నమోదు చేసిన అనూప్ సింగ్ జీవన ప్రస్థానం అనేక మలుపుల నడుమ ముందుకు సాగుతోంది.

2008 లో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఆర్థికమాంధ్యం సెగ భారత ఎయిర్ లైన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆ సమయంలోనే పైలట్ గా లైసెన్స్ తీసుకుని తన జీవితాన్ని స్వాగతించిన అనూప్ అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఆపై కొంతకాలానికి మోడలింగ్ కు శ్రీకారం చుట్టాడు. దానిలో భాగంగా భారత్ లో నిర్వహించిన ప్రముఖ మోడలింగ్ పోటీలో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. ఆరుడగులపైగా ఎత్తుగల అనూప్ కు శరీర దారుఢ్యం కూడా బాగుండటంతో మహాభారత్ టెలివిజన్ సీరియల్ లో ధృతరాష్ట్రునిగా చేసే అవకాశం వచ్చింది. 2011 లో స్టార్ ప్లస్ లో ప్రసారమైన మహాభారత్ సీరియల్ లో ధృతరాష్ట్రుని పాత్రలో చక్కగా ఒదిగిపోయిన అనూప్ కు  ఆశించిన దానికంటే ఎక్కువ పేరే వచ్చింది. 

 

కాగా, బాడీ బిల్డింగ్ అంటే అమితాసక్తి ఉన్న అనూప్ ఆవైపు అడుగులు వేశాడు. ఇటీవల థాయ్ లాండ్ లో జరిగిన డబ్యూబీపీఎఫ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో 'మిస్టర్ ఆసియా' గా నిలిచాడు అనూప్. ఆ పోటీల్లో భారత్ 11 పతకాల్ని కైవసం చేసుకున్న సంగతిని కాసేపు పక్కన పెడితే.. గత రెండు రోజుల క్రితం బ్యాంకాక్ లో జరిగిన వరల్డ్ బాడీ బిల్డింగ్ మీట్ లో అనూప్ చాంపియన్ గా నిలిచాడు. ప్రస్తుతం భారతీయ సినీ వెండి తెరపై తనను నిరూపించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు అనూప్. అటు బాలీవుడ్ తో పాటు తెలుగు, మళయాల చిత్రాల్లో అవకాశాలు వస్తే నటిస్తానని స్పష్టం చేశాడు. మనకు వచ్చిన సమస్యలను చూసి బెదిరిపోకుండా సవాల్ గా స్వీకరించిన వాడే నిజమైన చాంపియన్ అవుతాడని అనూప్ సింగ్ మరోసారి నిరూపించాడు. ఆల్ ద బెస్ట్ టూ అనూప్.

మరిన్ని వార్తలు