ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు

7 Feb, 2016 12:54 IST|Sakshi
ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు

ఈసారి ఐపీఎల్ వేలాన్ని గమనిస్తే... భారత జాతీయ జట్టుకు ఆడే క్రికెటర్లతో పాటు తుది జట్టులో ఎక్కువ అవసరం ఉన్న దేశవాళీ హిట్టర్స్ ప్రాముఖ్యాన్ని ప్రాంఛైజీలు గుర్తించినట్లు కనిపిస్తోంది. వేలానికి వచ్చే ముందే తమ జట్టు కూర్పు ఎలా ఉండాలనే స్పష్టతతోనే అన్ని జట్లూ వచ్చాయి. విదేశీ ఆల్‌రౌండర్లు క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా), మిషెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)లకు భారీ మొత్తాలు ఇచ్చిన ప్రాంఛైజీలు... ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తోన్న మార్టిన్ గప్టిల్  (న్యూజిలాండ్) లాంటి క్రికెటర్‌ను ఏమాత్రం పట్టించుకోలేదు. గత ఎనిమిది సీజన్ల పాటు ఎవరికి పడితే వారికి లెక్కలేకుండా డబ్బులు ఇచ్చిన జట్లు ఈసారి ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాయి. వేలంలో డబ్బు వృథా కాకుండా జాగ్రత్తపడ్డాయి.

 భారీ కసరత్తు తర్వాత...
ఐపీఎల్‌లో దేశవాళీ క్రికెటర్లు జట్టులో ఎక్కువ మం ది అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని మొత్తం అన్ని ఫ్రాంచైజీలు గుర్తించాయి. దీంతో గత ఏడాది దేశవాళీ క్రికెట్‌లో అన్ని మ్యాచ్‌లనూ అన్ని జట్లూ జాగ్రత్తగా పరిశీలించాయి. ముంబై కోచ్ జాన్‌రైట్ దేశవ్యాప్తంగా రెండు నెలల పాటు తిరిగి మ్యాచ్‌లు చూశారు. కొన్ని ఫ్రాంచైజీలు కేవలం ఈ పని కో సమే నిపుణులను తీసుకుని 2 నెలల పాటు దేశంలో అన్ని మ్యాచ్‌లూ చూపించాయి. మొత్తమ్మీద బాగా హోమ్‌వర్క్ చేశారు. ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు అడిగిన కొందరు క్రికెటర్ల ఫొటోలు కూడా ఐపీఎల్ కౌన్సిల్ దగ్గర కూడా లేవు. దీనిని బట్టి ఏ స్థాయిలో కసరత్తు చేశారో అర్థం చేసుకోవచ్చు.

 భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే...
ఈసారి వేలంలో అనూహ్యంగా మనోజ్ తివారీ (బెంగాల్), ప్రజ్ఞాన్ ఓజా (బెంగాల్)లను ఎవరూ కొనకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా ‘దాదా’ గంగూలీ శిష్యుడుగా భావించే మనోజ్ తివారీ కోల్‌కతా క్రికెట్‌లో పెద్ద సంచలనం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఐపీఎల్‌లో ముంబై జట్టులో మొదటి నుంచీ కీలక ఆటగాడిగా ఉన్న హైదరాబాద్ రంజీ జట్టు మాజీ సభ్యుడు ఓజానూ ఏ జట్టూ తీసుకోలేదు. స్పిన్నర్ రాహుల్ శర్మనూ లెక్కలోకి తీసుకోలేదు. భారత జట్టుకు దూరమైన మునాఫ్ పటేల్, పంకజ్ సింగ్, సుదీప్ త్యాగిలనూ ఎవరూ తీసుకోలేదు. అయితే ఆర్పీ సింగ్ ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడంతో పాటు... ధోనికి సన్నిహితుడైనందున అతణ్ని పుణే తీసుకుంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో తన సీనియర్ సహచరుడు ప్రవీణ్ కుమార్ పట్ల గుజరాత్ లయన్స్ కెప్టెన్ రైనా ఆసక్తిచూపడంతో ఆ జట్టు కాస్త భారీ మొత్తమే వెచ్చించి ప్రవీణ్‌ను తీసుకుంది.

 విదేశీయులపై చిన్నచూపు
ప్రతి జట్టులోనూ తుది జట్టులో నలుగురు మాత్రమే విదేశీ క్రికెటర్లు ఉండాలి. ప్రతి జట్టులోనూ గరిష్టంగా తొమ్మిది మందిని తీసుకోవచ్చు. గత ఏడాది వరకు దాదాపు అన్ని జట్లూ తొమ్మిది మందిని తీసుకున్నాయి. కానీ ఈసారి మాత్రం దీనిని పట్టించుకోలేదు. పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే నలుగురు స్టార్ క్రికెటర్లు ఉంటే చాలనుకున్నారు. దాదాపు అన్ని జట్లకూ వేలానికి ముందే విదేశీ స్టార్స్ ఉన్నారు. నిజానికి న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అయినా ఎవరూ తీసుకోలేదు. కనీసం 50 లక్షల రూపాయలు ఇచ్చి రిజర్వ్‌గా అయినా తీసుకోవచ్చు. అయినా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక శ్రీలంక క్రికెటర్లను పూర్తిగా చిన్నచూపు చూశారు. అలాగే వెటరన్స్ మైక్ హస్సీ, జయవర్ధనేల పట్లా ఆసక్తి చూపలేదు. ఏ లీగ్‌లో పడితే ఆ లీగ్‌లో పది వేలు, 20 వేల డాలర్లకు ఆడుతూ ఐపీఎల్‌లో మాత్రం భారీగా సంపాదించుకుంటున్న, సంపాదించాలనుకున్న విదేశీ క్రికెటర్లందరికీ ఈసారి ఐపీఎల్ వేలం షాక్‌ను మిగి ల్చిందనే అనుకోవాలి.        
                                     -సాక్షి క్రీడావిభాగం

>
మరిన్ని వార్తలు