మన ఆట...మన దగ్గర.... మనమే గెలవాలి

14 Mar, 2016 00:45 IST|Sakshi
మన ఆట...మన దగ్గర.... మనమే గెలవాలి

రేపటి నుంచి టి20 ప్రపంచకప్
బరిలో 10 జట్లు
తొలి మ్యాచ్‌లోన్యూజిలాండ్‌తో భారత్ ఢీ

 
 పొట్టి క్రికెట్ పుట్టింది ఇంగ్లండ్‌లో కావచ్చు... కానీ దానికి పరుగు నేర్పింది మనమే. తొలి ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడం వల్ల ఈ ఫార్మాట్‌కు ఊహించని స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు. ఫలితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుట్టింది. ఆట రాత మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్రికెటర్ ఈ లీగ్‌లో ఆడాలని తహతహలాడుతున్నాడు. భారత్‌లో ఆడాలని కలలుగంటున్నాడు. కానీ వాళ్లలో అందరికీ అవకాశం లేదు. ఎంతోమంది విదేశీ క్రికెటర్లు తమ దేశాల్లో స్టార్లే అయినా భారత్‌లో వారి ప్రదర్శన చూపించే అవకాశం రాలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ విదేశీ స్టార్స్ అంతా భారత గడ్డపై సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు.

ధనాధన్ క్రికెట్‌ను దత్తత తీసుకున్న భారత గడ్డ మీద తొలిసారి విశ్వ సంరంభం జరగబోతోంది. ఐపీఎల్ వల్ల ఈ ఫార్మాట్ మనకే సొంతంలా మారిపోయింది. ఐదు కప్‌ల నిరీక్షణ తర్వాత... తొలిసారి మనం ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది. ఐపీఎల్ ద్వారా ఎంత వినోదం లభించినా... భారత అభిమానులు కోరుకునేది మాత్రం మువ్వన్నెల రెపరెపలే. సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిస్తే ఆ కిక్కే వేరు. అలాంటి మజాను అందించే అవకాశం ధోని సేనకు లభించింది. ఐపీఎల్‌ను ఆదరించి క్రికెటర్ల జేబుల్లో కోట్లు నిండటానికి కారణమైన అభిమానుల రుణం తీర్చుకునే అవకాశం లభించింది. అందుకే... భారత్ గెలవాలి... గెలిచి తీరాలి.
 
 
 
నాగ్‌పూర్ నుంచి సాక్షి క్రీడాప్రతినిధి  భారతదేశంలో ఐపీఎల్ రూపంలో కొన్ని వందల మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కేవలం 15 మాత్రమే. అందుకే భారత అభిమానుల్లో ఏదో ఓ చిన్న వెలితి. ఆ కరువు తీరుస్తూ అసలైన ధనాధన్ క్రికెట్ పండుగ మన దేశానికి వచ్చేసింది. ఆరో టి20 ప్రపంచకప్‌కు రేపు (మంగళవారం) తెరలేవనుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల రూపంలో ఇప్పటికే కొంత వినోదం లభించినా... అసలు సిసలు పోరు ఇప్పుడు ప్రారంభం కాబోతోంది.

భారత్, న్యూజిలాండ్‌ల మధ్య నాగ్‌పూర్‌లో జరిగే మ్యాచ్‌తో ఆరంభమయ్యే ఈ టోర్నీ... ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో  మొత్తం ఏడు వేదికల్లో 23 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీతో సమాంతరంగా మహిళలకు కూడా టి20 ప్రపంచకప్ జరుగుతుంది. పురుషుల విభాగంలో ఎనిమిది ప్రధాన జట్లు నేరుగా టోర్నీలో బరిలోకి దిగుతుండగా... క్వాలిఫయింగ్ మ్యాచ్ ల ద్వారా బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ అర్హత సాధించాయి. మొత్తం పది జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడతాయి. రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి.
  
 
ఎవరూ తక్కువ కాదు
ప్రపంచకప్‌లో పోటీ పడుతున్న మిగతా జట్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల లేదా మంచి స్పిన్నర్లు ఉన్న జట్టే ముందుకు వెళ్లవచ్చు. వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్లు ఉన్నా వారు ఇక్కడ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఇక వివిధ జట్ల బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూస్తే మరోసారి ఐపీఎల్ ప్రదర్శనే కీలకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఉన్న జట్లది కాస్త పైచేయిగా కనిపించవచ్చు. వ్యక్తిగతంగా కూడా ఆయా క్రికెటర్ల సత్తాను బట్టే టీమ్‌ను ఏవైనా సంచలనాలు ఆశించవచ్చు.
 
 ఆస్ట్రేలియా: లోటు తీరేనా?
ఒక్కసారి కూడా టి20 ప్రపంచకప్ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. వార్నర్, వాట్సన్, మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌తో ఫలితాన్ని మార్చగలరు. స్పిన్‌ను బాగా ఆడగల స్మిత్ కెప్టెన్సీ నైపుణ్యం కూడా ఆ జట్టుకు అనుకూలాంశం. ఆల్‌రౌండర్‌గా ఫాల్క్‌నర్ కీలకం కానున్నాడు. సుదీర్ఘ కాలంగా టి20లను పట్టించుకోకుండా ఎక్కువ మ్యాచ్‌లు ఆడని ఆసీస్‌కు అదే సమస్యగా మారింది. భారత్ చేతిలో సొంతగడ్డపై పరాజయానికి అది కూడా కారణం. తాజాగా దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్ గెలవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
 
 దక్షిణాఫ్రికా: అదృష్టం కలిసొస్తే...
జట్టులో ఏకంగా 11 మందికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. ఇది సఫారీలకు చెప్పుకోదగ్గ అనుకూలత. ఎక్కువ మంది ఆల్‌రౌండర్లతో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఆసీస్ చేతిలో సిరీస్ ఓడినా... అంతకుముందు భారత్‌లోనే 2-0తో గెలవడం ఆ జట్టు సామర్థ్యానికి సూచిక. డివిలియర్స్ దూకుడును ఆపాలంటే బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సిందే. డు ప్లెసిస్, డుమిని, డేవిడ్ మిల్లర్, డి కాక్, డేవిడ్ వీస్... ఇలా ‘డి’ గ్యాంగ్ మొత్తానికి టి20ల్లో మంచి హిట్టర్లుగా గుర్తింపు ఉంది. ఐపీఎల్-2016 కోసం భారీ మొత్తానికి అమ్ముడుపోయిన క్రిస్ మోరిస్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే స్టెయిన్‌లో జోరు తగ్గడం, ఇమ్రాన్ తాహిర్ మినహా నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం.. పెద్ద టోర్నీల్లో కీలక మ్యాచ్‌ల్లో తడబడే నేపథ్యం ఈ జట్టు బలహీనత.
 
 ఇంగ్లండ్: అనుభవజ్ఞులు లేకున్నా...
ఈ మాజీ చాంపియన్ ఇటీవలి కాలంలో బాగా పుంజుకుంది. సాంప్రదాయాన్ని వదిలి ఫార్మాట్‌కు అనుగుణంగా కుర్రాళ్లను, కొత్త తరాన్ని ప్రోత్సహిస్తుండటంతో జట్టు నిలకడగా మంచి ఫలితాలు సాధిస్తోంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు మినహా మరే ఆటగాడికి భారత గడ్డపై ఆడిన కనీస అనుభవం కూడా లేదు. వన్డేల్లో ఏడాది వ్యవధిలో మూడు వేగవంతమైన సెంచరీలు నమోదు చేసిన జోస్ బట్లర్ ప్రభావం చూపగల క్రికెటర్.  స్పిన్ ఆల్‌రౌండర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లపై ఇంగ్లండ్ భారీగా ఆశలు పెట్టుకుంది.
 
 న్యూజిలాండ్: సత్తా చాటేనా?
భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో కచ్చితంగా ముద్ర వేస్తాడనుకున్న బ్రెండన్ మెకల్లమ్ అనూహ్య రిటైర్మెంట్‌తో షాక్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్‌లలో కూడా సత్తా చాటిన కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌పై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. విలియమ్సన్, రాస్ టేలర్ మాత్రం స్పిన్‌ను బాగా ఆడగలరు. మున్రోతో పాటు లోయర్ ఆర్డర్‌లో  అండర్సన్, ఇలియట్ కీలకం కానున్నారు. బౌల్ట్ మినహా గుర్తింపు ఉన్న బౌలర్ జట్టులో లేడు. స్పిన్నర్లు నాథన్ మెకల్లమ్, సాన్ ్టనర్, సోధి ఏ మాత్రం ప్రభావం చూపిస్తారనేది సందేహమే.
 
 వెస్టిండీస్: మళ్లీ జి‘గేల్’మనాలని...
ఒక్కడున్నను చాలు గేల్‌లాంటి ఆటగాడు. వంద మంది బలగమేల...’ అన్నట్లు వెస్టిండీస్ జట్టు కనిపిస్తోంది. డ్వేన్ బ్రేవో, రసెల్, స్యామీ, శామ్యూల్స్‌లాంటి ఆల్‌రౌండర్లు ఉన్నా... ఈ టోర్నీలో గేల్ చూపించగలిగే ప్రభావమే వేరు. నిజంగా గేల్ తనదైన శైలిలో చెలరేగితే ఇతర ఆటగాళ్లంతా పక్క వాయిద్యగాళ్లే. కాబట్టి విండీస్ విజయమైనా, పరాజయమైనా గేల్‌పైనే అమితంగా ఆధారపడి ఉన్నాయి. గేల్ విఫలమైన చోట 99 శాతం సందర్భాల్లో జట్టు కూడా కుప్పకూలింది. బ్రేవో, రసెల్‌లకు కూడా ఐపీఎల్ అనుభవం బాగుంది.
 
 శ్రీలంక: ఇకనైనా పురోగమించేనా?
ఇక డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. కుమార సంగక్కర, మహేల జయవర్ధనేల రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టులో కనీసం ప్రదర్శన ఇవ్వగల ఆటగాళ్లు కరువయ్యారు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన తీరు లంక తిరోగమనానికి పరాకాష్ట. ఫామ్‌పరంగా చూస్తే చండీమల్, రంగన హెరాత్ మాత్రమే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు టాప్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా కనిపించిన మ్యాథ్యూస్ ఇప్పుడు ఎందులోనూ రాణించలేక నిస్సహాయంగా కనిపిస్తున్నాడు. ఇక మలింగ యార్కర్లపై నమ్మకమున్నా, అతను ఏ మ్యాచ్‌లో ఆడతాడో చెప్పలేని పరిస్థితి. ఓవరాల్‌గా లంక జట్టును మాత్రం ఎవరూ గట్టి ప్రత్యర్థిగా భావించడం లేదు.
బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్
ఇటీవల ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్‌ను ఏ ప్రత్యర్థీ తక్కువ అంచనా వేయడానికి లేదు. పాకిస్తాన్, శ్రీలంకలాంటి జట్లను ఆసియాకప్‌లో ఓడించిన బంగ్లాదేశ్... టి 20 ర్యాంకింగ్స్ కారణంగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. షకీబ్, మొర్తజా, తమీమ్ ఒకే ఓవర్లో ఫలితాన్ని మార్చగల సమర్థులు. ఇటీవల బంగ్లా జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక అఫ్ఘానిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. 2010 నుంచి ప్రతి టి20 ప్రపంచకప్‌లోనూ ఆడుతున్న ఈ జట్టు ఇటీవల జింబాబ్వేపై సిరీస్ గెలిచింది. అలాగే అర్హత మ్యాచ్‌ల్లోనూ ఎదురైన ప్రతి ప్రత్యర్థినీ చిత్తు చేసింది. ఈ రెండు జట్లు సెమీస్‌కు చేరడం కష్టమే అయినా... ఏదో ఒక సంచలనం సృష్టించగల సత్తా ఉంది.
 
 పాకిస్తాన్: అంతంత మాత్రమే...
భారత్‌తో మళ్లీ ఓడతామనే భయంతోనే ఆడేందుకు జంకుతున్నారు... ఇటీవల పరిణామాల సందర్భంలో వినిపించిన జోక్ ఇది. ఇది  జోకే అయినా పాకిస్తాన్ జట్టు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చేతిలోనూ ఓడి, యూఏఈతో అదృష్టవశాత్తూ బయటపడిన ఆ జట్టు సామర్థ్యంపై పెద్దగా నమ్మకం లేదు. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ బాగా బలహీనం. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా గట్టిగా నిలబడి మ్యాచ్‌ను శాసిస్తాడని చెప్పే పరిస్థితే లేదు.

ఆ జట్టు ఎన్నో కొన్ని విజయాలు సాధిస్తోందీ అంటే బౌలింగ్‌ను నమ్ముకునే. ఫామ్‌ను చూస్తే ఆమిర్ మళ్లీ కీలకం కానున్నాడు. ఉపఖండపు జట్టే అయినా నాణ్యమైన స్పిన్నరే లేడు. ఆటగాడిగాకంటే పీసీబీ రాజకీయాలతోనే కెప్టెన్‌గా సాగుతున్న షాహిద్ ఆఫ్రిది అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో దేనికీ పనికి రావడం లేదు. అనుభవం పరంగా చూస్తే ఈ టోర్నీలో పాక్ తరఫున కాస్తయినా పరువు నిలబెట్టగల ఆటగాడిగా ఒక్క షోయబ్ మాలిక్ మాత్రమే కనిపిస్తున్నాడు.

మరిన్ని వార్తలు