ఆర్మీ కొలువు... కష్టాలకు సెలవు

13 Mar, 2017 00:54 IST|Sakshi
ఆర్మీ కొలువు... కష్టాలకు సెలవు

ఇక లక్ష్యాలే మిగిలాయి
జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా


న్యూఢిల్లీ: చిన్నప్పటి నుంచి కష్టాలతోనే సహవాసం. పూటగడవని జీవితం... ఇవన్నీ అనుభవిస్తూనే... ఆనందాన్ని ఆటలో వెతుక్కున్నాడు. అదే అన్నం పెడుతుందని, సరదా ఆటే తనకు సర్వస్వం అవుతుందని, పేరు తెస్తుందని ఆనాడు ఊహించలేదు. కానీ ఆటలో కష్టపడితే... పోటీల్లో ప్రతిభ చాటితే... విజేత అవుతాడని ప్రపంచ రికార్డుతో చాటిచెప్పాడు యువ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా. 19 ఏళ్ల ఈ అథ్లెట్‌ ప్రదర్శన బక్కచిక్కిన రైతు కుటుంబంలో ఎక్కడలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది.

హరియాణా రాష్ట్రం పానిపట్‌కు సమీపంలోని ఖాంద్రా గ్రామంలో నీరజ్‌ తండ్రిది నిరుపేద రైతు కుటుంబం. ఏడాదంతా ఎండల్లో వానల్లో కష్టపడినా... పైరు పండితేనే అతని కుటుంబం గడుస్తుంది. ఇలాంటి కష్టాల నడుమ చదువు సంధ్యలతో పాటు అతడెంచుకున్న జావెలిన్‌ త్రో అతనికి ఇపుడు ప్రొఫెషన్‌ అయింది. పోలాండ్‌లో గతేడాది జరిగిన అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 86.48 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇది రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేతకంటే మెరుగైన ప్రదర్శన కావడం విశేషం. ఈ ఒక్క రికార్డు అతనికి ఎనలేని కీర్తి తెచ్చింది. నీరజ్‌ చోప్రాకు ఆర్మీలో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం లభించింది. అతని కుటుంబ కష్టాలను కడతేర్చింది.

అంతేనా... అంటే!
నిజమే! ఇంకా వుంది మరి... వచ్చిన జాబ్‌తో సరి అనుకోలేదు. సాధించిన ప్రపంచ రికార్డుతో బ్రేకు వేయలేదు. మరింత మెరుగైన ప్రదర్శనతో మరిన్ని పతకాలతో రాణించాలనుకుంటున్నాడు. అతని ఆశయాన్ని గుర్తించిన ఆర్మీ ఉన్నతాధికారులు సెలవు మంజూరు చేస్తూ బెంగళూరులోని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రానికి పంపారు. బంగారు భవిష్యత్తు కోసం బెస్టాఫ్‌ లక్‌ చెప్పారు. వారిచ్చిన ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా శిక్షణలో కష్టపడుతున్నాడు. అలాగని చదువూ మానేయలేదు. దూరవిద్యలో డిగ్రీపై కన్నేశాడు. కెరీర్‌కు బాటలు వేసుకుంటూనే ఉన్నత చదువుకు జైకొడుతున్నాడు.

‘మా కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం లేదు. నాకొచ్చిన ఉద్యోగం వాళ్లను సంతోషంలో ముంచేసింది. మెరుగైన ప్రదర్శన కోసం అత్యుత్తమ శిక్షణ తీసుకుంటున్నా. నా లక్ష్యం వచ్చే ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం. వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడలతోపాటు... 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం నా జీవితాశయం. వర్ధమాన అథ్లెట్లకు నేను చెప్పేదొక్కటే... నిషిద్ధ ఉత్ప్రేరకాల ఉచ్చులో పడి దేశ ప్రతిష్టను దిగజార్చవద్దు.’      
– నీరజ్‌ చోప్రా

మరిన్ని వార్తలు