ఇండో-పాక్ సిరీస్ ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది

4 Nov, 2015 00:36 IST|Sakshi
ఇండో-పాక్ సిరీస్ ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది

సచిన్ టెండూల్కర్ అభిప్రాయం
 

న్యూయార్క్: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ రెండు దేశాల ప్రభుత్వాలపై ఆధారపడి ఉందని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఇరుదేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనడానికి ఇది దోహదపడుతుందని భావిస్తే సిరీస్ కార్యరూపం దాల్చుతుందన్నారు. ‘ఓవరాల్‌గా సిరీస్ జరిగే అంశం రెండు దేశాల ప్రభుత్వాల చేతిలోనే ఉంది. జరగాలా, వద్దా నిర్ణయించేది వాళ్లే. దానికంటే ముందు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. సిరీస్ వల్ల మంచి జరుగుతుందని భావిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇది అవసరం లేదని రెండు ప్రభుత్వాలు భావిస్తే వాళ్లతో పాటే మనమూ వెళ్లాలి. అంతేకానీ మనం ఆడటం లేదనడానికి ఎలాంటి కారణం లేదు’ అని మాస్టర్ వెల్లడించారు. క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్తం చేయాలనే లక్ష్యంతోనే ‘క్రికెట్ ఆల్‌స్టార్స్-2015’ టోర్నీని నిర్వహిస్తున్నామన్నారు. యువకులతో పాటు చాలా మందిని ఆటలోకి తీసుకురావాలన్నదే దీన్ని ఉద్దేశమన్నారు. ‘అమెరికా మహిళా క్రికెట్ జట్టుతో మేం ప్రాక్టీస్ చేస్తున్నాం.

అలాగే చాలా మంది కుర్రాళ్లు మా ఆటను తిలకించేందుకు వస్తున్నారు. చాలా మంది దిగ్గజాలు ఈ టోర్నీకి ఆడుతున్నారు. కాబట్టి కుర్రాళ్లకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం. కలలను నెరవేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎవరైనా కుర్రాడు రేపు అమెరికా తరఫున క్రికెట్ ఆడితే చాలా సంతోషిస్తా. వచ్చే ఏడాది మేం ఇక్కడికి వచ్చేసరికి కుర్రాళ్లు క్రికెట్ బ్యాట్లతో కనిపిస్తారని భావిస్తున్నా’ అని సచిన్ పేర్కొన్నారు. అమెరికాలోని ఇతర క్రీడలకు ఇది పోటీ కాదని మాస్టర్ స్పష్టం చేశారు. ఐసీసీ ప్రపంచకప్‌లో ఎక్కువ దేశాలకు ఆడే అవకాశం కల్పిస్తే క్రికెట్ ప్రపంచ వ్యాప్తమవుతుందని సూచించారు.  
 
 

>
మరిన్ని వార్తలు