ఐపీఎల్, ట్వంటీ20 చరిత్రలోనే తొలిసారిగా..

8 Apr, 2017 08:58 IST|Sakshi
ఐపీఎల్, ట్వంటీ20 చరిత్రలోనే తొలిసారిగా..

రాజ్‌కోట్‌: గత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ లలో ప్రత్యర్థి గుజరాత్ లయన్స్ చేతిలో వారి గడ్డపైనే ఘోరంగా విఫలమైన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)... ఐపీఎల్-10లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ట్వంటీ20 లలో ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్ లో మాత్రమే కాదు ట్వంటీ20 చరిత్రలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా కోల్ కతా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. శుక్రవారం రాత్రి ఇక్కడి ఎస్‌సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్ లో తొలుత నిర్ణీత ఓవర్లలో గుజరాత్‌ 4 వికెట్లకు 183 పరుగులు చేయగా, ఛేదనకు దిగిన కోల్ కతా ఓపెనర్లు క్రిస్‌ లిన్‌, కెప్టెన్ గౌతమ్ గంభీర్ లు అజేయ అర్ధ శతకాలతో చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే విజయం సాధించింది.

ఓ వైపు బ్యాటింగ్  ప్రమోషన్ లో ఓపెనర్ గావచ్చిన క్రిస్‌ లిన్‌ (41 బంతుల్లో 93 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊచకోతకు కెప్టెన్‌ గంభీర్‌ (48 బంతుల్లో 76 నాటౌట్‌; 12 ఫోర్లు) సొగసైన ఇన్నింగ్స్ తోడవడంతో సొంత మైదానంలో లయన్స్ ఘోరంగా విఫలమైంది.  క్రిస్ లిన్, గంభీర్‌ తమ విజృంభణతో కేకేఆర్ కు ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లిన్‌కు దక్కింది. వీరి విధ్వంసాన్ని రైనా బృందం ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. వీరి ధాటికి లయన్స్ బౌలర్లు కులకర్ణి 2.5 ఓవర్లలో 40 పరుగులు, మన్ ప్రీత్ గోని రెండు ఓవర్లలో 32 పరుగులు, డ్వేన్ స్మిత్ ఒక్క ఓవర్ వేసి 23 సమర్పించుకున్నారు.

మరిన్ని వార్తలు