ఆ సిక్స్ ఎప్పటికీ నిలిచే ఉంటుంది:గిల్ క్రిస్ట్

12 Dec, 2016 14:24 IST|Sakshi
ఆ సిక్స్ ఎప్పటికీ నిలిచే ఉంటుంది:గిల్ క్రిస్ట్

సిడ్నీ: మనకు ఆడమ్ గిల్ క్రిస్ట్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సిక్సర్లను అతి సునాయసంగా కొట్టగలిగే క్రికెటర్లలో గిల్ క్రిస్ట్ ఒకడు. ఈ ఆసీస్ దిగ్గజాన్ని భారత ట్వంటీ 20 మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కొట్టిన సిక్స్ ఎంతగానో ఆకట్టుకుందట.  శనివారం ఆరంభమైన మహిళల బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా సిడ్నీ థండర్స్ తరపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్(47 నాటౌట్;28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించింది.  బీబీఎల్ లో ఆడుతున్న తొలి మ్యాచ్లోనే హర్మన్ అలరించింది.  అయితే ఇక్కడ హర్మన్ కొట్టిన మూడు సిక్సర్లలో ఒక సిక్సర్ను మాత్రం గిల్ క్రిస్ట్ ప్రత్యేకంగా అభినందించాడు. ఆ మ్యాచ్కు వ్యాఖ్యాతగా ఉన్న గిల్లీ.. అది కచ్చితమైన క్రికెట్ షాట్ అంటూ కొనియాడాడు. ఆ షాట్ క్రికెట్లో ఎప్పటికీ నిలిచే ఉంటుందంటూ ప్రశంసించాడు.

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసి మెల్బోర్న్ స్టార్స్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 141 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిచింది మాత్రం హర్మన్ ప్రీత్ కౌరే కావడం విశేషం. హర్మన్ కొట్టిన సిక్సర్ను డబ్యూబీబీఎల్(మహిళల బిగ్ బాష్ లీగ్) యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.