షరపోవా సులభంగా..

28 May, 2015 00:40 IST|Sakshi
షరపోవా సులభంగా..

మూడో రౌండ్‌లోకి రష్యా స్టార్
మూడో సీడ్ హలెప్‌కు మిర్యానా షాక్
ఫెడరర్, నిషికోరి ముందంజ
ఫ్రెంచ్ ఓపెన్‌

 
 పారిస్ : గతేడాది విజేత షరపోవా మరో అలవోక విజయంతో ముందుకు దూసుకెళ్లగా... నిరుటి రన్నరప్ సిమోనా హలెప్ మాత్రం అనూహ్య ఓటమితో ఇంటిముఖం పట్టింది. ఫలితంగా సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రోజు మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా భావించిన సిమోనా హలెప్‌కు వెటరన్ క్రీడాకారిణి మిర్యానా లూసిచ్ బరోని (క్రొయేషియా) షాక్ ఇచ్చింది. వరుస సెట్‌లలో 7-5, 6-1తో ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.

గతేడాది యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ హలెప్‌ను బోల్తా కొట్టించిన 33 ఏళ్ల మిర్యానా అదే ఫలితాన్ని ఫ్రెంచ్ ఓపెన్‌లో పునరావృతం చేసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌లో కీలకదశలో మిర్యానా భారీ సర్వీస్‌లు, శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో విజృంభించింది. ఏకపక్షంగా జరిగిన రెండో సెట్‌లో మిర్యానా 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అతికష్టమ్మీద ఒక గేమ్ నెగ్గిన హలెప్ ఆ తర్వాత ఓటమిని తప్పించుకోలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో మిర్యానా 29 విన్నర్స్ కొట్టగా, హలెప్ కేవలం ఐదింటితో సరిపెట్టుకుంది.

 తన దేశానికే చెందిన వితాలియా దియత్‌చెంకోతో జరిగిన రెండో రౌండ్‌లో షరపోవా ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు వితాలియా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్ 24 విన్నర్స్ కొట్టి, కేవలం ఎనిమిది అనవసర తప్పిదాలు చేసింది. తదుపరి రౌండ్‌లో సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)తో షరపోవా ఆడుతుంది. గతేడాది వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్లో తలపడగా, మూడు సెట్‌లలో షరపోవాను విజయం వరించింది. రెండో రౌండ్‌లో సమంతా స్టోసుర్ 6-0, 6-1తో అమందైన్ హెసి (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో 29వ సీడ్ అలీజా కార్నె (ఫ్రాన్స్) 6-2, 7-5తో డల్గెరు (రుమేనియా)పై, 13వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-0తో కురుమి నారా (జపాన్)పై నెగ్గారు.

 పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్‌లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-2, 7-6 (7/1), 6-3తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై, నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-7 (7/9), 6-3, 6-3తో స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 7-5, 6-4, 6-4తో బెలూచి (బ్రెజిల్)పై నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-4, 5-7, 6-3తో లాజోవిచ్ (సెర్బియా)పై, 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 7-5, 6-2, 6-3తో క్లిజాన్ (స్లొవేకియా)పై, 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 6-1, 6-1తో డూడీ సెలా (ఇజ్రాయెల్)పై గెలిచారు. 24వ సీడ్ గుల్బిస్ (లాత్వియా) 3-6, 6-3, 5-7, 3-6తో మహుట్ (ఫ్రాన్స్) చేతిలో, 28వ సీడ్ ఫాగ్‌నిని (ఇటలీ) 1-6, 3-6, 5-7తో పెయిర్ (ఫ్రాన్స్) చేతిలో, 19వ సీడ్ అగుట్ (స్పెయిన్) 4-6, 2-6, 2-6తో లూకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయారు.

మరిన్ని వార్తలు