మా ఇద్దరి మధ్య చాలా పోటీ ఉంటుంది: సింధు

19 Jan, 2020 09:14 IST|Sakshi

సైనాతో తన అనుబంధంపై సింధు వ్యాఖ్య  

న్యూఢిల్లీ: గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో తన సీనియర్, భారత స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌కు తనకు మధ్య ఆట పరంగా చాలా పోటీ ఉంటుందని ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు తెలిపింది. తన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేసింది. ‘ఇండియా టుడే’ ఇన్‌స్పిరేషన్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సింధు పలు ఆసక్తికర అంశాలపై ముచ్చటించింది. ఇందులో భాగంగా గోపీ అకాడమీకి సింధు దూరమయ్యేందుకు ప్రయత్నిస్తుందంటూ గతేడాది వచ్చిన వార్తల్ని ఆమె ఖండించింది. బెంగళూరు నుంచి సైనా తిరిగి 2017లో గోపీ అకాడమీకి వచ్చిన తర్వాత ఇద్దరూ వేర్వేరు అకాడమీల్లో ప్రాక్టీస్‌ చేయడం ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది. 

దీని గురించి మాట్లాడుతూ ‘గోపీ సర్‌తో అంతా బాగుంది. ప్లేయర్‌గా నేను, కోచ్‌గా ఆయన ఆట కోసం 100 శాతం కృషి చేస్తాం. ఎలాగైనా భారత్‌కు పతకం అందించాలనేదే మా ఇద్దరి లక్ష్యం. అందుకే దానిపైనే దృష్టి సారిస్తాం’ అని సింధు పేర్కొంది. క్రీడాకారులుగా సైనాకు, తనకు మధ్య ఆటపరమైన శత్రుత్వం ఎప్పడూ ఉంటుందని చెప్పింది. ‘మా మధ్య ఎప్పుడూ చాలా పోటీ, శత్రుత్వం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరం ఆటగాళ్లమే కాబట్టి ఇలాగే ఉంటుంది. బరిలో దిగాక ఇద్దరం ఎవరి ఆలోచనలకు తగినట్లుగా వాళ్లం ఆడతాం. మా మధ్య పోటీ గోపీ సర్‌కు కొత్తలో కాస్త కష్టంగా అనిపించి ఉండొచ్చు. కానీ ఆయన కూడా మా పోటీని క్రీడా స్ఫూర్తితో తేలిగ్గా తీసుకొని ఉంటారు. మా ఇద్దరి ఆటతీరు భిన్నంగా ఉంటుంది. ఆమె ఆలోచనలకు తగినట్లుగా ఆమెతో.. నా ప్రవర్తనకు తగినట్లుగా నాతో గోపీ సర్‌ మాట్లాడతారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ ఆయన మా మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు రాలేదు. ఇద్దరు భారతీయులు ఫైనల్స్‌లో తలపడుతున్నారని ఆయన చాలా ఆనందించారు. ఒక కోచ్‌గా మా ఇద్దరిలో ఎవరూ గెలిచినా ఆయనకు అంతే సంతోషంగా ఉంటుంది’ అని సింధు తెలిపింది.  

మరిన్ని వార్తలు