షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌: జపాన్‌ ప్రధాని 

15 Mar, 2020 04:01 IST|Sakshi

టోక్యో: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ అన్ని జాగ్రత్తలతో టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జపాన్‌ ప్రధాని షింజో అబే స్పష్టం చేశారు. ఇటీవల టోక్యో మెగా ఈవెంట్‌ను వాయిదా వేయాలనే ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా స్పందించారు. షెడ్యూల్‌పై భరోసా కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విశ్వక్రీడల్ని వాయిదా వేయాలని సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జపాన్‌ ప్రధాని షింజో శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘మేం వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నాం. సంబంధిత వర్గాలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)తోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. అయితే టోక్యోలో మెగా ఈవెంట్‌ నిర్వహణలో ఎలాంటి మార్పుల్లేవు. షెడ్యూల్‌ ప్రకారం పోటీలను నిర్వహిస్తాం. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా... పక్కా ప్రణాళికతో, వైరస్‌ వ్యాప్తిని నిరోధించే జాగ్రత్తలతో ఒలింపిక్స్‌ను ఘనంగా నిర్వహిస్తాం. విశ్వక్రీడలు విజయవంతమయ్యేందుకు అమెరికాతో కలిసి సమన్వయంతో పనిచేస్తాం’ అని అన్నారు.

మరిన్ని వార్తలు