బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని ఉంది.. కానీ..!

11 May, 2016 12:29 IST|Sakshi
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని ఉంది.. కానీ..!

న్యూఢిల్లీ: తనపై ఇప్పటికీ ఒత్తిడి ఉందని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శశాంక్ మనోహర్ తెలిపారు. మరి కొంత కాలం బీసీసీఐ అత్యున్నత పదవిలో కొనసాగాలంటూ తనపై కొందరు పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ అంటున్నారు. శశాంక్ కు కూడా ఈ పదవిని అప్పుడే వదులుకోవడం ఇష్టం లేదని, అయితే ఐసీసీ తాజా నిబంధనల వల్ల ఇప్పుడే వైదొలగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నాగ్ పూర్ కు చెందిన లాయర్ వివరించారు. గత అక్టోబర్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగిన శశాంక్ మాట్లాడుతూ... బోర్డులో వీలైనన్ని మార్పులు తీసుకొచ్చాను, సాధ్యమైనంత వరకూ తన మార్క్ వర్క్ చేసి చూపించానని పేర్కొన్నారు.

గతంలో బీసీసీఐ చైర్మన్ గా ఒకసారి చేశాను. దాల్మియా మరణంతో మరోసారి తనకు ఉన్నత పదవి రావడంతో స్వీకరించాను. బోర్డు నాకు ఎంతో ఇచ్చింది. నేను కూడా ఎంతో కొంత బోర్డుకు, దేశానికి తిరిగి ఇచ్చేయాలని, సేవలు చేయాలని భావించానని రెండో సారి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు తన మనసులో ఉన్న ఆలోచనలు ఇవే' అంటూ శశాంక్ చెప్పుకొచ్చారు. ఐసీసీ తొలి ఇండిపెండెంట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఏర్పడటంతో ప్రస్తుత పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ బాధ్యతలు చేపట్టినట్లయితే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగుతారు.

ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ చేయాలంటే ఏ బోర్డులోనూ సభ్యుడిగి ఉండకూడదన్న నిబంధనలు అయనకు అడ్డంకిగా మారాయి. గత అక్టోబరులో జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణం తర్వాత ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎంపికైన మనోహర్... లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి బోర్డులో చర్చ సాగుతున్న కీలక సమయంలో తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మనోహర్ రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ పేర్లు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఐసీసీ చైర్మన్ ఎన్నికలు వచ్చే జూన్ నెలలో జరిగే అవకాశాలున్నాయి. ఇందుకు అన్ని విధాలుగా శశాంక్ మనోహర్ సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు