యూఎస్‌ ఓపెన్‌ వేదికలో మార్పు? 

28 Apr, 2020 01:47 IST|Sakshi

న్యూయార్క్‌: టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూయార్క్‌లోని ‘యూఎస్‌టీఏ బిల్లీ జీన్‌ కింగ్‌ నేషనల్‌ టెన్నిస్‌ సెంటర్‌’లోని ఆర్థర్‌ యాష్‌ స్టేడియం యూఎస్‌ ఓపెన్‌కు ఆతిథ్యం ఇస్తుండగా... ఈసారి వేదికను కాలిఫోర్నియాకు తరలించాలనే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. ప్రస్తుతం యూఎస్‌టీఏ సెంటర్‌ను 450 పడకలతో కూడిన తాత్కాలిక కోవిడ్‌–19 ఆసుపత్రిగా మార్చారు. ఇందులో 25,000 మందికి ప్రతిరోజూ భోజనం అందిస్తున్నారు. దీంతో కాలిఫోర్నియాలోని ‘ఇండియన్‌ వెల్స్‌ టెన్నిస్‌ గార్డెన్‌’లో యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పానిష్‌ పత్రిక ‘మార్కా’ పేర్కొంది. అమెరికా రెండో అత్యున్నత టెన్నిస్‌ టోర్నీ ‘బీఎన్‌పీ పరిబా ఓపెన్‌’ ప్రతీ ఏడాది ఇదే వేదికపై జరుగుతుంది. ఇందులో 29 హార్డ్‌ కోర్టులు ఉండగా... సెంటర్‌ కోర్టులో 16,100 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించే వెసులుబాటు ఉంది.

మరిన్ని వార్తలు