‘అలా చేసి ఐపీఎల్‌ జరిపితే ప్రశ్నలు తప్పవు’

6 Jul, 2020 17:19 IST|Sakshi

కరాచీ: ఈ సీజన్‌ అక్టోబర్‌-నవంబర్‌ విండోలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడి అదే సమయంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) జరిగితే అది అనేక అనుమానాలకు తావిస్తోందని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ స్పష్టం చేశాడు. కరోనా వైరస్‌ ​కారణంగా క్రికెటర్లను రిస్క్‌లోకి నెట్టడం ఇష్టం లేక టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేసేందుకు ఐసీసీ  యోచిస్తోంది. కాగా, వరల్డ్‌కప్‌ వాయిదా పడితే ఐపీఎల్‌కు లైన్‌ క్లియర్‌ అవుతుందని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఇలా చేస్తే అనేక ప్రశ్నలకు ఉత్పన్నమవుతాయని ఇంజీ పేర్కొన్నాడు. ‘ బీసీసీఐ చాలా బలమైన క్రికెట్‌ బోర్డు. ఐసీసీలో బీసీసీఐదే కీలక పాత్ర.  కరోనా వైరస్‌ కారణంగా మేము టీ20 వరల్డ్‌కప్‌ జరపలేమని ఆస్ట్రేలియా చేతులెత్తేస్తే అది ఆమోదయోగ్యమే. అదే సమయంలో వేరే మిగతా ఈవెంట్లు జరిగితే ప్రశ్నల వర్షం తప్పదు. (‘సచిన్‌ నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌.. రెండు సమాధానాలు’)

ఒకవేళ వరల్డ్‌కప్‌ను వాయిదా వేసి ఆ ప్లేస్‌లో ఐపీఎల్‌ జరిగితే దీన్ని ఏమని అర్ధం చేసుకోవాలి. ఐపీఎల్‌ జరపడానికి అన్ని అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ జరపడానికి బీసీసీఐ కసరత్తులు ముమ్మరం చేసింది. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ జరపాలని చూస్తోంది. ఫ్రాంచైజీలు,  బ్రాడ్‌ కాస్టర్స్‌, స్పాన్సర్స్‌, ఇతర స్టేక్‌ హోల్డర్లు అంతా ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తున్నారు’ అని ఇంజీ తెలిపాడు.

కరోనా దెబ్బకు ఆగిపోయిన ఐపీఎల్‌ను మళ్లీ నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇది కాస్త కార్యరూపం దాలిస్తే భారత అభిమానులకే కాదు యావత్‌ క్రికెట్‌ ప్రియులకు వినోదం పంచుతుంది. మ్యాచ్‌లు గానీ జరిగితే టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. కోవిడ్‌–19 విలయంతో మార్చి, ఏప్రిల్‌లలో జరగాల్సిన ఈ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది. సందేహాలతో ఊగిసలాడుతున్న లీగ్‌పై ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తేల్చిచెప్పారు. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ పోటీలు నిర్వహించేందుకైనా సిద్ధమేనని గంగూలీ సంకేతమిచ్చాడు. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్నామని  గత నెలలోనే స్పష్టం చేశాడు. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’)

మరిన్ని వార్తలు