ఇవి చాలా కాస్ట్ గురూ!

2 Sep, 2015 11:17 IST|Sakshi
ఇవి చాలా కాస్ట్ గురూ!

 ఆటలు శరీరానికి, మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
 కానీ కొన్ని ఆటలు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తాయి.
 ఆడీఆడీ.. అలసిపోవటం వల్ల కాదు.
 ఆ ఆటల శిక్షణకు.. రిస్క్‌కు.. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు పెట్టే ఖర్చును చూసి.. ఖాళీ అయ్యే జేబును చూసి..!
 అలాంటివి కూడా ఉన్నాయా? అనేకదా మీ సందేహం! ఉన్నాయండోయ్. అవేంటో తెలుసుకుందాం.

 
ఈక్వెస్ట్రియన్
గుర్రంపై కూర్చొని స్వారీచేసే ఆట ఇది. అంటే మన గుర్రపు పందేల్లాగా. కాస్ట్‌లియస్ట్ స్పోర్ట్‌గా పేరుగాంచింది. ఈ ఆటలో పాల్గొనేందుకు గుర్రాలకు శిక్షణ ఇవ్వటం, వాటిని మేపటం, ఒక చోట నుంచి మరొక చోటుకు తరలించటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఒక్కొక్క గుర్రం ధర సుమారుగా రెండు లక్షల డాలర్లు ఉంటుందంట! అందుకే అతి కొద్ది మంది మాత్రేమ ఈ ఆటలో శిక్షణ తీసుకుంటారు.
 
 హాట్ ఎయిర్ బెలూన్ రేసింగ్
యూరప్, అమెరకాల్లో హాట్ ఎయిర్ బెలూన్ రేసింగ్ చాలా ప్రసిద్ధి చెందిన ఆట. అక్కడ నిర్వహించే హాట్ ఎయిర్ బెలూన్ పండుగల్లో కూడా వందలాది బెలూన్స్‌ను ఎగరవేసి ఫెస్టివల్స్‌ను ఘనంగా జరుపుకుంటారు. ఒక గంట హట్ ఎయిర్ బెలూన్ రెయిడ్‌కు గంటకు సుమారు మూడు వందల డాలర్లు చెల్లించాలట. ఒక హాట్ ఎయిర్ బెలూన్ ఖరీదు సుమారుగా 20వేల డాలర్లు ఉంటుంది. దీనిని నడిపేందుకు అవసరమైన శిక్షణకు 1250 నుంచి 3000 డాలర్ల వరకు ఉంటుంది.
 
స్కైజంపింగ్

స్కైజంపింగ్ గేమ్ ఖరీదైనది, ప్రమాదకరమైనది. ఈ ఆటకు కావాల్సిన పరికరాలు 2500 డాలర్లు ఉంటాయి. ఈ ఆటకు తర్ఫీదు పొందేందుకు సంవత్సరానికి లక్ష డాలర్ల వరకు ఖర్చవుతాయి. పెద్దపెద్ద స్పాన్సరు ఉంటే గాని ఈ ఆటకు సరైన శిక్షణ తీసుకోవటం వీలు పడదు. ప్రమాదకరమైంది కాబట్టి బీమా కూడా చెల్లించాల్సి ఉంటుంది.  
 
 సెయిలింగ్
ఖరీదైన ఆటల్లో సెయిలింగ్ కూడా ఒకటి. శిక్షణకు చాలా ఖర్చవుతుంది. సెయిలింగ్‌కు ఉపయోగించే ఒక బోటు ఖరీదు సుమారుగా 100 మిలియన్ డాలర్లు ఉంటుందట. అంతే కాకుండా అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేసిన బోటు కేవలం ఆట జరిగినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. మిగిలిన సమయాల్లో వినియోగపడదు. బోటుకు మరమ్మత్తులు, ఇతర ఖర్చులతో దీన్ని నిర్వహణ ఖర్చు బోలెండత అవుతుంది. కార్పొరేట్ స్పాన్సర్లు ఉంటేనే ఈ ఆటలో శిక్షణ తీసుకోవటం సాధ్యపడుతుంది.
 
బాబ్‌స్లెడ్డింగ్
ఎఫ్ వన్ రేసింగ్‌లాగా ఇది కూడా చాలా ఖరీదైన ఆట. ఈ ఆట శిక్షణకు, వివిధ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు కార్పొరేట్ స్పాన్సర్లు అవసరం. ఒక్కొక్క బాబ్‌స్లెడ్ ఖరీదు సుమారు 25,000 వేల డాలర్ల వరకు ఉంటుంది. ఒక బాబ్‌స్లెడ్ రన్‌ను నిర్వహించాలంటే మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఇది జట్టుగా ఆడాల్సిన క్రీడ. నలుగురు కలసి ఆడుతారు. కాబట్టి ఖర్చు నాలుగు రెట్లు అవుతుంది.
 
 ఫార్ములా 1 రేసింగ్
విదేశాల్లో బాగా క్రేజ్ ఉన్న ఆటల్లో ఫార్ములా వన్ రేసింగ్ ఒకటి. మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ లభిస్తోంది. ఫార్ములా వన్ రేసింగ్‌కు ఉపయోగించే కారు ఖరీదు చాలా ఎక్కువ. మామూలు వాహనాలకు ఉపయోగించే టైర్లకు బదులు ప్రత్యేకమైన టైర్లు ఈ రేస్ కార్లకు ఉపయోగిస్తారు. ఒక సారి రేస్‌లో పాల్గొనాలంటే ఒక క్రీడాకారుడు సుమారు రెండు లక్షల డాలర్లు  చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు ఈ ఆటలో పాల్గొనే క్రీడాకారులకు స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తుంటాయి. అందుకే ఈ ఆటను ఆడటం కంటే చూడటమే సో బెటరు!
 
 పోలో
ఖరీదైన ఆటల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆటకు మంచి శ్రేష్టమైన గుర్రం అవసరం. దానికి శిక్షణ ఇచ్చేందుకు, చూసుకునేందుకు కూడా మనుషులు కావాలి. వారికి జీతాలు ఇవ్వాలి. ఇలా ఎటు చూసినా ఈ ఆట వల్ల ఖర్చు తడిసి మోపుడవుతుంది. టోర్నమెంట్‌లో పాల్గొనాలంటే కూడా పెద్దమొత్తంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ ఆటకు కూడా స్పాన్సర్లు లేకుంటే శిక్షణ తీసుకోవటం, పెద్దపెద్ద టోర్నమెంట్లలో పాల్గొనటం కత్తిమీద సామే.
 
 వింగ్‌సూటింగ్
 ప్రత్యేకంగా తయారుచేసిన ఒకరకమైనసూట్‌ను ధరించి గాల్లో ఎగిరే క్రీడే.. వింగ్‌సూటింగ్. ఈ వింగ్‌సూట్ ఖరీదు 2,500 డాలర్లు ఉంటుంది. ఒక సంవత్సరానికి అద్దెకు తీసుకుంటే 30 వేల డాలర్ల ఖర్చవుతుంది.  శిక్షణ తీసుకోవాలంటే ఒక విమానాన్ని అద్దెకు తీసుకోవాలి. పెలైట్‌కు డబ్బు చెల్లించాలి. స్కైడైవింగ్ ఎలా చేయాలో నిపుణుల ద్వారా ప్రత్యేక తర్ఫీదు పొందాలి. వారికి కూడా ఫీజు చెల్లించాలి. ఇలా..ఈ ఆట శిక్షణకు చాలా ఖర్చవుతుంది. ఇది ప్రమాదకరమైన క్రీడ కాబట్టి కచ్చితంగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు