అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వాళ్లకే ట్రోఫీ 

12 May, 2019 06:00 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతుందనుకున్న ఐపీఎల్‌ క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌ ఏకపక్షంగా ముగిసింది. కీలక మ్యాచ్‌ల్లో అనుభవం ఎంత ముఖ్యమనేది ధోని బృందం నిరూపించింది. ఢిల్లీ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ను చెన్నై బౌలర్లు కట్టడి చేసిన తీరు అద్భుతం. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు వేస్తూ ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో చెన్నై బౌలర్లు సఫలమయ్యారు. చివర్లో ఇషాంత్‌ శర్మ ఆడిన రెండు స్ట్రెయిట్‌ డ్రైవ్‌ షాట్‌లు ఆకట్టుకున్నాయి. బౌలర్లపై ఎదురుదాడి చేస్తే పరుగులు వచ్చే అవకాశం ఉండేదని ఇషాంత్‌ నిరూపించాడు. అయితే ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లో తగినంత అనుభవం లేకపోవడం దెబ్బతీసింది. తమ పొరపాట్లను సరిదిద్దుకొని ఢిల్లీ జట్టు మరింత నిలకడగా ఆడితే రాబోయే ఏళ్లలో ఆ జట్టు ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశముంది.  జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్లపై నమ్మకం ఉంచితే వారు కీలక సమయాల్లో తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తారని ఫైనలిస్ట్‌లు చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ ద్వారా రుజువైంది.

రెండు జట్లలోని ఆటగాళ్లను పరిశీలిస్తే ప్రతి ఒక్కరిలో మ్యాచ్‌ గతిని మలుపుతిప్పే సామర్థ్యం పుష్కలంగా కనిపిస్తుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మూడుసార్లు అలవోకగా ఓడించిన ముంబై ఇండియన్స్‌ ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే లీగ్‌ మ్యాచ్‌లతో పోలిస్తే ఫైనల్‌ విభిన్నం. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ, కీలకదశలో తప్పిదాలు చేయకుండా ఆడిన జట్టునే విజయం వరిస్తుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు మూడుసార్లు చొప్పున ఐపీఎల్‌ టైటిల్స్‌ సాధించాయి. పది సీజన్‌లలో ఎనిమిదిసార్లు చెన్నై ఫైనల్‌ చేరగా... ముంబై ఐదుసార్లు టైటిల్‌ పోరులో తలపడింది. నైపుణ్యం పరంగా రెండు జట్లలోనూ మేటి ఆటగాళ్లకు కొదువలేదు కాబట్టి తుది పోరు హోరాహోరీగా జరగడం ఖాయం. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వాళ్ల చేతికే ట్రోఫీ చిక్కుతుందనడంలో సందేహం లేదు.   

మరిన్ని వార్తలు