ఇక ఒలింపిక్స్‌కు వెళ్లను గాక వెళ్లను!

23 Dec, 2016 10:44 IST|Sakshi
ఇక ఒలింపిక్స్‌కు వెళ్లను గాక వెళ్లను!
రియో ఒలింపిక్స్ ముగిసి ఇన్నాళ్లయినా ఇంకా దాని చుట్టూ అలముకున్న వివాదాలు మాత్రం ఎడతెగకుండా వస్తూనే ఉన్నాయి. రియో ఒలింపిక్స్‌కు సంబంధించి ఇవ్వాల్సిన రూ. 30 లక్షలు ఇంతవరకు ఇవ్వకపోవడంతో భారత ఒలింపిక్ సంఘం మీద, క్రీడా మంత్రిత్వశాఖ మీద భారత అగ్రశ్రేణి గోల్ఫర్ ఎస్ఎస్‌పి చౌరాసియా మండిపడ్డాడు. అసలు ఈసారి ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం కూడా అనుమానమే అన్నాడు. అతడితో పాటు పాల్గొన్న మరో గోల్ఫర్ అనిర్బన్ లాహిరికి కూడా క్రీడా శాఖ నుంచి రావాల్సిన మొత్తం ఇంకా రాలేదు. రియో ఒలింపిక్స సమయంలో భారత ఒలింపిక్ సంఘం అధికారులు తమను సర్వెంట్లలా చూశారని చౌరాసియా ఆగ్రహంవ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 16 టైటిళ్లు గెలుచుకున్న లాహిరికి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, తనకు మాత్రం ఎలాగోలా ఇప్పటికి రూ. 5.5 లక్షలు ఇచ్చారని చౌరాసియా చెప్పాడు. 
 
తమకు రూ. 30 లక్షలు ఇస్తామని వాళ్లు చెప్పిన లేఖ కూడా తనవద్ద ఉందని, కానీ రియో గేమ్స్ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 15 లక్షలకు తగ్గించినట్లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రియోలో అసలు సరైన ఏర్పాట్లన్నవే లేవని, కనీసం వాహనం కూడా లేదని అన్నాడు. తాను చలికి వణికిపోతున్నా, ఒకపక్క వర్షం పడుతున్నా కనీసం తమకు రెయిన్‌కోట్లు గానీ, గొడుగులు గానీ కూడా ఏర్పాటుచేయలేదన్నాడు. వాళ్లేదో యజమానులలా, తమను నౌకర్లలా చూశారని చెప్పాడు. వాహనం కోసం తమను నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉంచేశారని, లాహిరి తన సొంత వాహనంలో వచ్చాడని అన్నాడు. ఈసారి ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామన్నాడు.
మరిన్ని వార్తలు