‘బుమ్రా నో బాల్‌ కొంపముంచింది’

29 Jun, 2020 12:57 IST|Sakshi

పాక్‌తో మ్యాచ్‌పై భువీ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ:  సుమారు మూడేళ్ల క్రితం పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ గురించి టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన నో బాల్‌ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నాడు. పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఫకార్‌ జమాన్‌కు బుమ్రా వేసిన నో బాల్‌ మొత్తం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసిందన్నాడు. బుమ్రా బౌలింగ్‌ ఆరంభంలోనే ఫకార్‌ ఇచ్చిన క్యాచ్‌ను ధోని అందుకున్నా అది నో బాల్‌ కావడం కొంపముంచిందన్నాడు.  ఆ తర్వాత మ్యాచ్‌ మొత్తం వన్‌ సైడ్‌ వార్‌లా మారిపోవడంతో పాక్‌ టైటిల్‌ను గెలిచిందన్నాడు.  ‘2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఏకపక్ష పోరులా మారిపోయింది. జట్టంతా సమష్టిగా విఫలం చెందడం ఒక ఎత్తు అయితే, బుమ్రా వేసిన నో బాల్‌ మరొక ఎత్తు.  (30 నిమిషాల కామెంటరీ అనుకుంటే..)

నో బాల్‌తో బతికి బయటపడ్డ ఫకార్‌ 114 పరుగులు చేసి పాక్‌ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ఆ తర్వాత మేము బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాం. పాక్‌ 338 పరుగులు చేస్తే, మేము 158 పరుగులకే ఆలౌటై 180 పరుగుల తేడాతో భారీ ఓటమి చెందాం’ అని భువీ తెలిపాడు. అయితే ఓవరాల్‌గా గత కొన్నేళ్లుగా భారత ప్రదర్శన ఎంతో మెరుగైందనే విషయాన్ని భువీ తెలిపాడు. ‘2013లో చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత మూడు నుంచి నాలుగు ఐసీసీ టోర్నీలు జరిగితే అందులో రెండు నుంచి మూడు సార్లు సెమీస్‌,ఫైనల్స్‌కు చేరాం.  2015లో ఆసీస్‌తో సెమీస్‌లో ఓడిపోయాం. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో ఓటమి. 2019 వరల్డ్‌కప్‌లో కూడా బ్యాడ్‌లక్‌ వెంటాడింది. మా టాపార్డర్‌ విఫలం కావడంతో సాధారణ స్కోరును కూడా సాధించలేక సెమీస్‌  నుంచే నిష్క్రమించాం’ అని భువీ పేర్కొన్నాడు.(రోహిత్‌ను వరల్డ్‌కప్‌లోకి తీసుకోలేకపోవడమే..)

మరిన్ని వార్తలు