దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌

15 Jan, 2019 01:46 IST|Sakshi

మూడో టెస్టులోనూ ఓడిన పాక్‌

జొహన్నెస్‌బర్గ్‌: బౌలర్లు మరోసారి విజృంభించడంతో పాకిస్తాన్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 381 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 65.4 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 153/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 120 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా పేసర్‌ ఒలివియర్‌ వరుస బంతుల్లో బాబర్‌ ఆజమ్‌ (29 బంతుల్లో 21; 5 ఫోర్లు), కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (0)లను ఔట్‌ చేసి పాకిస్తాన్‌ను దెబ్బ తీశాడు.

క్రీజులో నిలదొక్కుకున్న అసద్‌ షఫీఖ్‌ (71 బంతుల్లో 65; 11 ఫోర్లు)ను ఫిలాండర్‌ ఔట్‌ చేయడంతో పాక్‌ కోలుకోలేకపోయింది. షాదాబ్‌ ఖాన్‌ (47 నాటౌట్‌; 7 ఫోర్లు), హసన్‌ అలీ (22; 2 ఫోర్లు, సిక్స్‌) కాస్త పోరాడినా దక్షిణాఫ్రికా విజయాన్ని ఆలస్యం చేశారే తప్ప పాక్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఒలివియర్, రబడ మూడేసి వికెట్లు తీశారు. సిరీస్‌ మొత్తంలో 24 వికెట్లు తీసిన ఒలివియర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం... రెండో ఇన్సింగ్స్‌లో సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డి కాక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించాయి.   

మరిన్ని వార్తలు