‘తొలి ప్రేమ’ పుట్టిన వేళా విశేషం..

25 Jun, 2020 00:04 IST|Sakshi

భారత్‌ తొలి ప్రపంచకప్‌ టైటిల్‌కు నేటితో 37 ఏళ్లు

దేశంలో క్రికెట్‌ వెలిగేందుకు కారణమైన క్షణం

జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా మొదటి గెలుపు ఇచ్చే కిక్కే వేరప్పా! మన గురించి మనం చెప్పుకుంటే ఇలాంటి భావన చాలా మందిలో సాధారణమే. సరిగ్గా ఇలాంటిదే భారత క్రికెట్‌కు కూడా వర్తింపజేస్తే ఆ తొలి గెలుపు విలువేమిటో మనకు తెలుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే 1983 వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ను భారత్‌ గెలవడం అలాంటి అపూర్వ ఘట్టమే. రోజుకు 1500 రూపాయల మ్యాచ్‌ ఫీజుల నుంచి కోట్లాది రూపాయల కనకవర్షం కురిపించే స్థాయికి క్రికెట్‌ చేరిందంటే అది ఈ గెలుపు చలవే. భారత క్రికెట్‌ గతిని మార్చేసిన ఈ ఘనతకు నేటితో 37 ఏళ్లు.

క్రికెట్‌లో విశ్వ విజేతగా నిలిచే సమయానికి భారత్‌లో హాకీదే హవా. అప్పటికే ఒకసారి ప్రపంచకప్‌ గెలవగా... 1980 మాస్కో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణంతో ఏకంగా ఎనిమిది పసిడి పతకాల రికార్డు మన ఖాతాలో ఉంది. అలాంటి సమయంలో వచ్చిన కపిల్‌దేవ్‌ బృందం సాధించిన వరల్డ్‌కప్‌ విజయం దేశంలో క్రికెట్‌కు కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఈ ఆట పంచిన వినోదం దేశంలో అద్భుతాలను సృష్టించింది. వరల్డ్‌కప్‌ తర్వాత ఒకవైపు క్రికెట్‌ ఉజ్వలంగా వెలుగుతూ ఉవ్వెత్తున దూసుకుపోగా.... దానికి వ్యతిరేక దిశలో హాకీ పతనం కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత భారత్‌లో తిరుగులేని ఆటగా, ఒక మతంగా క్రికెట్‌ మారిపోయింది.

అంచనాలు లేకుండా... 
1975లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో భారత్‌ 3 మ్యాచ్‌లలో ఒకటే, అదీ ఎవరూ పట్టించుకోని ఈస్ట్‌ ఆఫ్రికాపై గెలిచింది. 1979లో రెండో ప్రపంచకప్‌లో ఆ విజయం కూడా దక్కకుండా సున్నాకు సున్నా మార్కులే వచ్చాయి. పైగా వరల్డ్‌కప్‌లు మినహాయించి అప్పటి వరకు కేవలం 10 వన్డే సిరీస్‌లే ఆడిన భారత్‌ సొంతగడ్డపై 2 మాత్రమే గెలిచి, మిగతా 8 ఓడింది. ఇలాంటి  నేపథ్యంతో బరిలోకి దిగిన 1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్‌ బృందంపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ చివరకు అందరి లెక్కలను తలకిందులు చేస్తూ తుదిపోరుకు భారత్‌ అర్హత సాధించింది. లీగ్‌ దశలో గ్రూప్‌లోని మిగిలిన 3 జట్లతో రెండేసిసార్లు భారత్‌ తలపడింది. వెస్టిండీస్‌పై 34 పరుగులతో గెలుపు... 66 పరుగులతో ఓటమి; ఆస్ట్రేలియాపై 162 పరుగులతో ఓటమి... 118 పరుగులతో విజయం; జింబాబ్వేపై 5 వికెట్లతో... 31 పరుగులతో విజయాలు భారత్‌ ఖాతాలో చేరాయి. 4 మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌ చేరిన మన టీమ్‌ సెమీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టును 6 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్‌ చేరింది.  

అద్భుతం ఆవిష్కృతం... 
జూన్‌ 25, 1983... ఫైనల్‌కు వెళ్లినా, అప్పటికే లీగ్‌లో ఓడించినా సరే... దుర్బేధ్యమైన లైనప్‌ ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌తో గెలుపు అంత సులువు కాదని అందరికీ తెలుసు. పైగా ముందుగా బ్యాటింగ్‌ చేసి 183 పరుగులకే కుప్పకూలడంతో ఇక ఆశలు లేకపోయాయి. కానీ కపిల్‌ డెవిల్స్‌ మాత్రం తమపై నమ్మకం కోల్పోలేదు. తమ సర్వశక్తులూ ఒడ్డి వెస్టిండీస్‌ జట్టును 140 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 43 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన క్షణాన లార్డ్స్‌ మైదానం భారత అభిమానుల హోరుతో ఊగిపోయింది. ప్రపంచ క్రికెట్‌పై భారత్‌ ముద్ర పడిన ఆ క్షణం ఎప్పటికీ మరచిపోలేని మధుర ఘట్టంగా మిగిలిపోయింది. –సాక్షి క్రీడా విభాగం

మరిన్ని వార్తలు