18 ఏళ్ల ‘బెంచ్’ మార్క్

26 Mar, 2016 13:53 IST|Sakshi
18 ఏళ్ల ‘బెంచ్’ మార్క్

అరుదైన ఘనత సాధించిన హర్భజన్
తుది జట్టులో చోటు కోసం ఇంకా పోరాటం

 
ఆటలో, మాటలో పదును... సంప్రదాయ స్పిన్‌తో సవాల్ విసరగలడు, అవసరమైతే దూస్రాతో దెబ్బ తీయగలడు... 18 సంవత్సరాలుగా భారత క్రికెట్‌లో హర్భజన్ సింగ్ అంతర్భాగం. ఎప్పుడో నూనూగు మీసాల యవ్వనంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అతను ఈతరంలో సచిన్, కుంబ్లేల తర్వాత ఎక్కువ కాలం కొనసాగిన భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే ఇంత అనుభవం  తర్వాతా అతను తుది జట్టులో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి.
 
 
మొహాలీనుంచి సాక్షి క్రీడా ప్రతినిధి
ఐదేళ్ల క్రితం మొహాలీలో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన హర్భజన్ రెండు కీలక వికెట్లు తీశాడు. నాడు కూడా జట్టులో అశ్విన్ ఉన్నా... భజ్జీదే ప్రధాన పాత్ర కాగా, జూనియర్‌గా అశ్విన్ కొన్ని మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. కానీ కాలం మారింది. అశ్విన్ లేకుండా భారత్ ఆడే పరిస్థితి లేకపోవడంతో... పునరాగమనం తర్వాత భజ్జీకి ఒక్కటంటే ఒక్క టి20 మ్యాచ్ దక్కింది. ఒకప్పుడు జట్టు విజయాలను శాసించిన క్రికెటర్ ఇప్పుడు తనదైన అవకాశం కోసం చూస్తున్నాడు. శుక్రవారంతో అంతర్జాతీయ కెరీర్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న హర్భజన్ ఇంకా బెంచీకే పరిమితమవుతున్నాడు.

 ఆట ముగిసిందా..?: 2000కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించి ఇంకా రిటైర్ కాని ఆరుగురు ఆటగాళ్ళలో హర్భజన్ ఒకడు. అయితే మిగతావారితో పోలిస్తే మూడు ఫార్మాట్‌లలోనూ రాణించిన ఘనత ఒక్క భజ్జీకే సొంతం. 400కు పైగా టెస్టు వికెట్లు తీయడంతో పాటు టి20, వన్డే ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన జట్టులో అతను భాగస్వామి.

అయితే అలాంటి బౌలర్ తన చాన్స్ కోసం ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం భారత జట్టు పురోగతి చూస్తుంటే తుది జట్టులో మార్పు కష్టంగానే కనిపిస్తోంది. అశ్విన్ ఉండగా, ఇప్పుడు రైనా కూడా బౌలింగ్ చేస్తుండటంతో ఇక భజ్జీకి స్థానం దక్కడం అసాధ్యంగా మారింది. సొంత మైదానంలో అతను మరోసారి బరిలోకి దిగాలని కోరుకుంటున్న స్థానిక అభిమానులకు నిరాశ తప్పకపోవచ్చు.

బిజినెస్‌లో బిజీగా...: క్రికెట్ కెరీర్ చరమాంకంలో హర్భజన్ ఒక్కసారిగా బిజీగా మారిపోయాడు. నిజానికి పునరాగమనంపై అతను కూడా పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లు లేదు. అందుకే ఆ విరామ సమయంలోనే తన కొత్త వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. భజ్జీ స్పోర్ట్స్ పేరుతో క్రీడా సామగ్రి, దుస్తుల వ్యాపారంలో అతని బిజినెస్ దూసుకుపోతోంది. పంజాబ్‌తో పాటు యూపీ, బెంగాల్ రంజీ జట్లకు కూడా ఈ సంస్థ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. హర్భజన్‌సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ పేరుతో అతను ప్రారంభించిన అకాడమీలపై ఇటీవల ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాడు. తక్కువ వ్యవధిలో ఏడు చోట్ల ఈ అకాడమీలు మొదలు కావడం విశేషం. తన సన్నిహితులతో కలిసి అతను చండీగఢ్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. అయితే చాలా కాలంగా బెంచీకే పరిమితమవుతూ వస్తున్న హర్భజన్ మరొక్కసారి క్రికెటర్‌గా తనదైన ముద్ర వేయగలిగే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాడు.

>
మరిన్ని వార్తలు