ఈ జట్టు ఇంకా దూసుకెళ్తుంది

7 Aug, 2017 02:23 IST|Sakshi

వరుస టెస్టుల్లో 600 పైచిలుకు పరుగులు చేసిన భారత జట్టుకు ఎదురీదడం అంత సులభం కాదు. రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్‌ కావడంతో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. అయితే ఫాలోఆన్‌లో కరుణరత్నే, కుశాల్‌ మెండిస్‌లు పోరాడారు. ఇది పరాజయాన్ని ఆలస్యం చేస్తుందే తప్ప ఓటమిని దూరం చేయదని వారిద్దరికి బాగా తెలుసు. ఇక్కడ వాతావరణం తప్ప ఇంకేదీ లంకను ఆదుకోలేదు. నిజానికి ఈ ఇద్దరూ బాగా ఆడారు. ఓపెనర్‌ కరుణరత్నే చక్కని స్ట్రోక్స్‌తో అలరించాడు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్లను చక్కగా ఎదుర్కొన్నాడు. ఇక మెండిస్‌ కూడా అంతే. గతేడాది ఇతను ఆస్ట్రేలియాపై 176 పరుగులు బాదిన ప్రదర్శనను మర్చిపోలేం. ఈ టెస్టులో అతను స్వీప్‌ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆడుతున్నంత సేపు స్పిన్నర్లపై పట్టు కనబరిచాడు. డ్రైవ్, కట్‌ ఇలా చక్కని షాట్లు అతని బ్యాట్‌ నుంచి జాలువారాయి.

మెండిస్‌ నిష్క్రమణ తర్వాత కరుణరత్నే, మాథ్యూస్‌ల భాగస్వామ్యం కూడా లంక ఇన్నింగ్స్‌ను కాసేపు నడిపించింది. అయితే భారీ ఆధిక్యం దృష్ట్యా భారత శిబిరాన్ని ఇదేమంత కలవరపర్చలేదు. స్వల్ప విరామంలో జడేజా కరుణరత్నేతో పాటు మాథ్యూస్‌ను బోల్తాకొట్టించడంతో ఇక లంక పతనం ఊపందుకుంది. ఎడం చేతి బ్యాట్స్‌మెన్‌పై రౌండ్‌ ద వికెట్‌ బౌలింగ్‌తో జడేజా ఫలితాలు రాబట్టాడు. ఈ మ్యాచ్‌ కూడా నాలుగు రోజుల్లోనే ముగియడానికి స్పిన్నర్లే కారణం. బౌలింగ్, బ్యాటింగ్, పుష్కలమైన ఆల్‌రౌండ్‌ నైపుణ్యమున్న ఈ జట్టు (భారత్‌) ఇక ముందు కూడా మరిన్ని విజయాలు సాధిస్తుంది. 
సునీల్‌ గావస్కర్‌

మరిన్ని వార్తలు