మెరిశారు మురిపించారు

26 Dec, 2016 23:57 IST|Sakshi
మెరిశారు మురిపించారు

అంతర్జాతీయ క్రీడాంగణంలో ఈ ఏడాదీ ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. రియో ఒలింపిక్స్‌ అందరి దృష్టిని ఆకర్షించగా... విశ్వక్రీడల వేదికపై అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ పలువురు స్టార్‌ క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిశారు. అభిమానులను మురిపించారు. కొత్త ప్రత్యర్థులు వచ్చినా... కొత్త తారలు తెరపైకి వచ్చినా తమ ఉనికిని చాటుకుంటూ వారందరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అథ్లెటిక్స్‌లో ఉసేన్‌ బోల్ట్, స్విమ్మింగ్‌లో మైకేల్‌ ఫెల్ప్స్, టెన్నిస్‌లో సెరెనా విలియమ్స్‌... ఇలా పేరున్న వారందరూ ఈ ఏడాదిలో తమ అద్భుత ఆటతీరుతో అలరించారు. – సాక్షి క్రీడావిభాగం

ఎదురులేని బోల్ట్‌
సమకాలీన అథ్లెటిక్స్‌లో తనకు ఎదురులేదని జమైకా స్టార్‌ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ మరోసారి నిరూపించుకున్నాడు. రియో ఒలింపిక్స్‌ వేదికగా బోల్ట్‌ మూడు స్వర్ణాలు సాధించి ఔరా అనిపించాడు. బీజింగ్, లండన్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో మాదిరిగానే రియోలోనూ బోల్ట్‌ 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి వరుసగా మూడోసారి ‘ట్రిపుల్‌’ సాధించాడు. ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో అవే విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా బోల్ట్‌ రికార్డు నెలకొల్పాడు. కొత్తగా ప్రపంచ రికార్డులు సాధించకపోయినా అతనికి తన ప్రత్యర్థుల నుంచి కనీస పోటీ ఎదురుకాకపోవడం విశేషం. వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ తర్వాత వీడ్కోలు పలుకుతానని ఈ జమైకా స్టార్‌ ప్రకటించాడు.

‘బంగారు చేప’ వీడ్కోలు...
ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధిస్తేనే కెరీర్‌ ధన్యమైపోయిందని భావించే క్రీడాకారులు ఎందరో ఉన్నారు. కానీ అమెరికా స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ మాత్రం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం ఇంత సులువా అని తన అద్వితీయ ప్రతిభతో అబ్బురపరిచాడు. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రియో ఒలింపిక్స్‌కు సిద్ధమైన ఫెల్ప్స్‌ ఐదు స్వర్ణాలు, ఒక రజతం సాధించి తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలికాడు. ఈ ప్రదర్శనతో 31 ఏళ్ల ఫెల్ప్స్‌ ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఫెల్ప్స్‌ 23 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలు గెలిచి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

‘డ్రాగన్‌’ జోరుకు బ్రేక్‌...
బ్యాడ్మింటన్‌లో ఈ ఏడాది చైనా జోరుకు చెక్‌ పడింది. చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌... డెన్మార్క్‌ ప్లేయర్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ‘వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌’లో మహిళల, పురుషుల సింగిల్స్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. సీజన్‌లోని మొత్తం 12 సూపర్‌ సిరీస్‌ టోర్నీలలో పురుషుల సింగిల్స్‌లో మూడు... మహిళల సింగిల్స్‌లో రెండు టైటిల్స్‌ మాత్రమే చైనా క్రీడాకారులకు దక్కాయి. చైనా దిగ్గజం లిన్‌ డాన్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని ఆశించిన లిన్‌ డాన్‌ రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో అక్సెల్‌సన్‌ చేతిలో ఓడిపోయాడు. మహిళల ప్రపంచ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) ఒక్క సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించకపోయినా రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సంపాదించింది.

రోస్‌బర్గ్‌... రయ్‌ రయ్‌...
ఫార్ములావన్‌ (ఎఫ్‌1)లో ఈసారీ మెర్సిడెస్‌ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే డిఫెండింగ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ను వెనక్కినెట్టి మెర్సిడెస్‌కే చెందిన నికో రోస్‌బర్గ్‌ విశ్వవిజేతగా నిలిచాడు. సీజన్‌లోని 21 రేసుల్లో రోస్‌బర్గ్‌ తొమ్మిది రేసుల్లో గెలిచి, మరో ఏడు రేసుల్లో టాప్‌–3లో నిలిచి మొత్తం 385 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. 10 రేసుల్లో గెలిచినప్పటికీ హామిల్టన్‌ (380 పాయింట్లు) మిగతా రేసుల్లో ఆశించిన రీతిలో రాణించకపోవడంతో చివరకు రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 1982లో రోస్‌బర్గ్‌ తండ్రి కేకె రోస్‌బర్గ్‌ ఎఫ్‌1 చాంపియన్‌గా నిలువగా... 34 ఏళ్ల తర్వాత అతని తనయుడు నికో అదే ఫలితాన్ని సాధించడం విశేషం.

యూరోలో పోర్చు‘గోల్‌’...
ప్రొఫెషనల్‌ లీగ్స్‌లో మెరుపులు మెరిపించే క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తన జాతీయ జట్టు పోర్చుగల్‌ను తొలిసారి ‘యూరో’ చాంపియన్‌గా నిలబెట్టాడు. పారిస్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్లో పోర్చుగల్‌ 1–0 గోల్‌ తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్‌ జట్టుపై సంచలన విజయం సాధించింది. గాయం కారణంగా ఫైనల్‌ ఆరంభంలోనే రొనాల్డో మైదానం వీడినప్పటికీ... మిగతా పోర్చుగల్‌ ఆటగాళ్లందరూ పట్టుదలతో పోరాడి ఫ్రాన్స్‌ను నిర్ణీత సమయం వరకు నిలువరించారు. అదనపు సమయంలోని 109వ నిమిషంలో ఎడెర్‌ అద్భుత గోల్‌ చేసి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని పోర్చుగల్‌ కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీకి ఈ ఏడాది నిరాశనే మిగిల్చింది.

‘కోపా అమెరికా కప్‌’ ఫైనల్లో మెస్సీ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 2–4తో డిఫెండింగ్‌ చాంపియన్‌ చిలీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. షూటౌట్‌లో తొలి షాట్‌ తీసుకున్న మెస్సీ గురి తప్పడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఈ ఫలితం తర్వాత మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జాతీయ జట్టు ప్రయోజనాలదృష్ట్యా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఇక ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌)లో లీస్టర్‌సిటీ జట్టు విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. స్పెయిన్‌కు చెందిన రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌తోపాటు ప్రపంచకప్‌ క్లబ్‌ టైటిల్‌ను గెల్చుకుంది.

స్టెఫీ సరసన సెరెనా
ఈ ఏడాది పురుషుల, మహిళల టెన్నిస్‌లో సంచలన ఫలితాలు వచ్చాయి. జర్మనీకి చెందిన ఎంజెలిక్‌ కెర్బర్‌... బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే వరుసగా మహిళల, పురుషుల విభాగాల్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. కెర్బర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సాధించగా... స్పెయిన్‌ యువతార గార్బిన్‌ ముగురుజా ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను దక్కించుకుంది. ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్‌ వింబుల్డన్‌ టోర్నీలో విజేతగా నిలిచి ఓపెన్‌ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన స్టెఫీ గ్రాఫ్‌ (జర్మనీ) రికార్డును సమం చేసింది. పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే రెండోసారి వింబుల్డన్‌ టైటిల్‌ను సొంతం చేసుకోగా... స్విట్జర్లాండ్‌ స్టార్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా అవతరించాడు. నొవాక్‌ జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సాధించాడు. అయితే సీజన్‌ చివర్లో తడబడిన ఈ సెర్బియా స్టార్‌ తన ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను ఆండీ ముర్రేకు కోల్పోయాడు.

‘కింగ్‌’ కార్ల్‌సన్‌...
అన్ని అవాంతరాలను అధిగమిస్తూ రియో ఒలింపిక్స్‌ను బ్రెజిల్‌ విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగిన ఈ క్రీడల్లో 205 దేశాల నుంచి 11 వేలకుపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. అమెరికా 46 స్వర్ణాలు, 37 రజతాలు, 38 కాంస్యాలతో కలిపి మొత్తం 121 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్‌ 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి 67 పతకాలు నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. చైనా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రీడల్లో మొత్తం 27 కొత్త ప్రపంచ రికార్డులు... 91 ఒలింపిక్‌ రికార్డులు నమోదయ్యాయి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా