తండ్రి గ్లౌవ్స్‌... తనయుడి పంచ్‌

14 Apr, 2018 01:29 IST|Sakshi

గోల్డ్‌కోస్ట్‌: అమెచ్యూర్‌ బాక్సర్‌ అయిన తండ్రి కెరీర్‌ చేయి విరగడంతో అర్ధాంతరంగా ముగిసింది. కానీ... తనయుడి కెరీర్‌ ఆరంభంలోనే సూపర్‌ హిట్టయింది. కెనడాకు చెందిన 20 ఏళ్ల థామస్‌ బ్లుమెన్‌ఫీల్డ్‌కు నాన్న బాబ్‌ అంటే ప్రాణం. ఆయన్నే ఫాలో అయ్యేవాడు. తన తండ్రి బాక్సింగ్‌ గ్లౌవ్స్‌కు ఇచ్చే విలువేంటో తెలుసుకున్న థామస్‌ అవే బాక్సింగ్‌ గ్లౌవ్స్‌ (తండ్రి గ్లౌవ్స్‌ను తను 8 ఏళ్ల వయస్సప్పుడు దాచిపెట్టుకున్నాడు)తో ఇప్పుడు గోల్డ్‌కోస్ట్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.

లైట్‌ వెల్టర్‌ వెయిట్‌లో ఫైనల్‌ చేరిన అతను ఇప్పుడు స్వర్ణం వేటలో ఉన్నాడు. ఆసీస్‌లో కొడుకు వెన్నంటే లేకపోయినప్పటికీ బాబ్‌ టీవీల్లో తనయుడి విజయాన్ని తనివితీరా ఆస్వాదించి ఉంటారు. తన విజయంపై థామస్‌ మాట్లాడుతూ ‘నాకు బాక్సింగ్‌ కంటే నాన్నంటేనే ఇష్టం. ఆయన బాక్సింగ్‌ కాకుండా టెన్నిస్, టేబుల్‌ టెన్నిస్‌ ఏది ఆడినా నేను దాన్నే అనుసరించేవాణ్ని’ అని అన్నాడు.   

మరిన్ని వార్తలు