ఆ రికార్డు సాధించాలనుకున్నా: అయ్యర్‌

11 Nov, 2019 14:12 IST|Sakshi

నాగ్‌పూర్‌: బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో భారత ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ పరుగుల మోత మోగించిన సంగతి తెలిసిందే. 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి భారత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సహకరించాడు.  అయితే ఆఫిఫ్‌ హుస్సేన్‌ వేసిన 15 ఓవర్‌లో అయ్యర్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించడం మ్యాచ్‌కే హైలైట్‌. ఆ ఓవర్‌ తొలి బంతిని లాంగాన్‌ మీదుగా బౌండరీ దాటించినఅయ్యర్‌.. రెండో బంతిని నేరుగా సిక్స్‌ సాధించాడు. ఇక మూడో బంతిని మళ్లీ లాంగాన్‌ దిశగా సిక్స్‌ కొట్టాడు. దాంతో వరుసగా ఆరు సిక్సర్లు సాధిస్తాడా అనే అనుమానం అభిమానుల్లో కల్గింది.

అయితే అయ్యర్‌ కూడా ఆరు సిక్సర్లు కొట్టాలనే అనుకున్నాడట. ఈ విషయాన్ని భారత స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌.. ‘చహల్‌ టీవీ’ పేరుతో నిర్వహించే టాక్‌ షోలో చెప్పుకొచ్చాడు. తొలి మూడు సిక్సర్లు కొట్టిన తర్వాత ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్ల ఘనతను సాధించాలనే అనుకున్నానని, కానీ అది సాధ్యం కాలేదన్నాడు. కాకపోతే మ్యాచ్‌లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు.

కాగా,  ఈ మ్యాచ్‌కు ముందు తాము ఒత్తిడిలో ఉన్న విషయాన్ని విలేకర్ల సమావేశంలో అయ్యర్‌ ఒప్పుకున్నాడు.‘ టీ20ల్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. మూడో టీ20కి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో బంగ్లా ఆకట్టుకుంది. దాంతో కాస్త ఆందోళన ఉంది. అయితే ఆటగాళ్లు అందరితో రోహిత్‌ శర్మ పెప్‌ టాక్‌ నిర్వహించిన తర్వాత మాలో ఒక ఉత్సాహం వచ్చింది. అదే విజయానికి బాటలు వేసింది’ అని అయ్యర్‌ అన్నాడు. బంగ్లాదేశ్‌ లక్ష్య ఛేదనలో దూసుకుపోతున్న సమయంలో శివం దూబే, దీపక్‌ చహర్‌లు మంచి బ్రేక్‌ ఇచ్చారన్నాడు. ఓవరాల్‌ మ్యాచ్‌కు వారిద్దరి బౌలింగే టర్నింగ్‌ పాయింట్‌గా అయ్యర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు