‘జ్యోతి’ వీక్షణకు భారీగా ఆహూతులు

23 Mar, 2020 05:43 IST|Sakshi

కరోనాను లెక్క చేయని జపనీయులు  

సెండాయ్‌ (జపాన్‌): కరోనా వైరస్‌ భయబ్రాంతులకు గురిచేస్తున్నప్పటికీ చరిత్రాత్మక ‘ఒలింపిక్‌ జ్యోతి’కి జపాన్‌ వాసులు బ్రహ్మరథం పట్టారు. ఈనెల 26 నుంచి రిలే జరుగనున్నప్పటికీ అంతకుముందే జ్యోతిని చూసేందుకు అభిమానులు అమితాసక్తి కనబరిచారు. మియాగిలోని సెండాయ్‌ స్టేషన్‌లో వీక్షణకు ఉంచిన ‘జ్యోతి’ని చూసేందుకు శనివారం ఈశాన్య జపాన్‌ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారాంతం కావడంతో 50 వేల మందికి పైగా ‘జ్యోతి’ని చూసేందుకు గంటల తరబడి ‘క్యూ’లో నిలబడ్డారు.

కరోనా నేపథ్యంలో మాస్క్‌లతో వచ్చిన అభిమానులు ఒలింపిక్‌ జ్యోతితో ఫొటోలు తీసుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ‘ఒలింపిక్‌ జ్యోతిని ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. దీనికోసం నేను మూడు గంటలకు పైగా లైన్‌లో నిలబడ్డాను’ అని 70 ఏళ్ల మహిళ ఒకరు స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. మరోవైపు పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులను చూసి నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంపులు గుంపులుగా పోగైతే జ్యోతి వీక్షణ కార్యక్రమాన్ని రద్దు చేస్తామని ప్రజలని హెచ్చరించారు. ఈనెల 26న ఫుకుషిమాలోని జె. విలేజ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నుంచి ఒలింపిక్స్‌ జ్యోతి రిలే కార్యక్రమం జరుగుతుంది. రిలే జరుగనున్న దారుల్లో గుమిగూడ వద్దంటూ ఇప్పటికే ప్రజల్ని నిర్వాహకులు కోరారు. 

మరిన్ని వార్తలు