భారీ హ్యాట్రిక్‌ శతకాలు.. డబుల్‌ సెంచరీ ఎప్పుడో?

13 Dec, 2019 12:52 IST|Sakshi

పెర్త్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ విధానం ప్రవేశపెట్టిన తర్వాత అలా ఆడిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆసీస్‌ క్రికెటర్‌ లబూషేన్‌ ఇప్పుడు ఆ జట్టుకు వెన‍్నుముకగా మారిపోయాడు.  లార్డ్స్‌ మైదానంలో యాషెస్‌ రెండో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ గాయపడటంతో లబూషేన్‌ కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్‌ సెంచరీతో మెరిసి ఆసీస్‌ను ఆదుకున్నాడు. దాంతో స్మిత్‌ జట్టులో ఉన్నప్పటికీ లబూషేన్‌ రెగ్యులర్‌ ఆటగాడు అయిపోయాడు. తనకు ఇచ్చిన వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు లబూషేన్‌. ఇటీవల పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల్లో భారీ శతకాలు సాధించి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయాలు సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. అదే జోరును కొనసాగిస్తూ న్యూజలాండ్‌తో పెర్త్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ భారీ శతకం నమోదు చేశాడు.

 240 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 1 సిక్స్‌తో  143 పరుగులు చేసి ఆసీస్‌ భారీ స్కోరు దిశగా సాగడానికి చక్కటి పునాది వేశాడు. 110 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లబూషేన్‌ మరో 33 పరుగులు జత చేసి పెవిలియన్‌ చేరాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా డబుల్‌ సెంచరీ చేస్తాడని భావించిన ఆసీస్‌ అభిమానులకు కాస్త నిరాశను మిగిలిచ్చాడు. పాకిస్తాన్‌ జరిగిన రెండు వరుస టెస్టుల్లో లబూషేన్‌ 162, 185 పరుగులు చేశాడు. దాంతో హ్యాట్రిక్‌ భారీ శతకాల్ని సునాయాసంగా చేస్తున్న లబూషేన్‌.. డబుల్‌ సెంచరీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  ఇప్పటివరకూ 12 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన లబూషేన్‌ హ్యాట్రిక్‌ శతకాల్ని ఖాతాలో వేసుకోవడం విశేషం.  ఓవరాల్‌గా తన టెస్టు కెరీర్‌లో రెండు సిక్సర్లు మాత్రమే సాధించడం అతని బ్యాటింగ్‌లో నిలకడకు అద్దం పడుతోంది. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరిగేది మూడు టెస్టుల సిరీస్‌ కాబట్టి కచ్చితంగా లబూషేన్‌ ఖాతాలో డబుల్‌ సెంచరీ ఉంటుందని ఆశిస్తున్నారు. కివీస్‌తో తొలి టెస్టులో భాగంగా రెండో రోజు లంచ్‌ విరామానికి ఆసీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు