‘బంగ్లాదేశ్‌ తర్వాత మా టార్గెట్‌ భారత్‌!’

7 Jan, 2020 10:46 IST|Sakshi

సిడ్నీ: స్వదేశంలో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లను ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్‌ చేయండంపై టెస్టు సారథి టిమ్‌ పైన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆసీస్‌ ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో 296 పాయింటలతో టీమిండియా(360) తరువాతి స్థానంలో ఉంది. అయితే మ్యాచ్‌ అనంతరం టిమ్‌ పైన్‌ మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో టీమిండియతో జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తన్నుట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా భారత్‌-ఆసీస్‌ సిరీస్‌ అంటేనే అటు ఆటగాళ్లకు ఇటు అభిమానులకు నోరూరించే సిరీస్‌ అని అభివర్ణించాడు.

‘పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం తమ తదుపరి లక్ష్యం బంగ్లాదేశ్‌ ఆతర్వాత టీమిండియా. రెండు టెస్టుల సిరీస్‌ కోసం జూన్‌లో బంగ్లాదేశ్‌కు వెళుతున్నాం. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి టీమిండియా సిరీస్‌పై దృష్టి పెడతాం. గత టెస్టు సిరీస్‌లో మాపై టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. అయితే అప్పటి ఆసీస్‌ జట్టు పరిస్థితులు వేరు. ప్రస్తుత పరిస్థితులు వేరు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్నాం. వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌లతో బ్యాటింగ్‌ దుర్బేద్యంగా ఉంది.  పేస్‌, స్పిన్‌తో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టే బౌలర్లు ఆసీస్‌ జట్టులో ఉన్నారు. 

దీంతో టీమిండియా-ఆసీస్‌ల మధ్య జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా ఈ సిరీస్‌ ఇరు జట్లుకు కీలకం. ఎవరు గెలిస్తే వారికి లాభం చేకూరుతుంది. అయితే టీమిండియాపై టెస్టు సిరీస్‌ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్‌ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్‌ ఆరాటపడుతుతున్నారు. అందుకే టీమిండియాతో సిరీస్‌ మా ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కు నోరూరుతోంది. ఈ సిరీస్‌ కోసం మేమందరం వేచిచూస్తున్నా’ అని ఆసీస్‌ టెస్టు సారథి టిమ్‌ పైన్‌ పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా 2-0తో కైవసం చేసుకుంది. 

ఇక టీమిండియా కూడా గతేడాది వరుస విజయాలతో జోరుమీదుంది. టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా ఈ ఏడాది ఆరంభంలో టీ20లపై దృష్టి పెట్టిన టీమిండియా.. వరల్డ్‌కప్‌ ముగిశాక టెస్టులపై ఫోకస్‌ పెట్టనుంది. వరుసగా టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు ఇంకా చాలా సమయమే ఉన్నా ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ అభిమానులు టీమిండియా-ఆసీస్‌ సిరీస్‌కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఎక్కువగా చర్చించుకుంటున్నారు. దీంతో ఆ సిరీస్‌ విజేత ఎవరో వేచి చూడాలి.

చదవండి: 
అతడు ప్రపంచంలోనే చెత్త కీపర్‌! 
కోహ్లి కోసం పరుగెడతాం

>
మరిన్ని వార్తలు