‘హర్మన్‌.. నీ కెప్టెన్సీని సమీక్షించుకో’

9 Mar, 2020 12:00 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరినా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మెగా టోర్నీ అంతా కలిపి ఆమె 30 పరుగులు మాత్రమే చేశారు. లీగ్‌ దశలో 28 పరుగులు చేసిన హర్మన్‌.. ఆసీస్‌తో జరిగిన తుది పోరులో 2 పరుగులకే నిష్క్రమించారు. దాంతో పాటు మిగతా భారత బ్యాటర్స్‌ కూడా విఫలం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. అయితే భారత్‌ ఫైనల్‌కు చేరడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, టీమిండియా కెప్టెన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తదితరులు ప్రశంసలు కురిపిస్తుంటే,  భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ శాంతా రంగస్వామి మాత్రం విమర్శలు కురిపించారు. ప్రధానంగా హర్మన్‌ నాయకత్వాన్ని ఆమె వేలెత్తి చూపారు. ఇక హర్మన్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని పరోక్షంగా హెచ్చరించారు. లీడర్‌గా కంటే బ్యాటర్‌గా నిరూపించుకోవడమే ఇప్పుడు హర్మన్‌కు చాలా అవసరమన్నారు. (మన వనిత... పరాజిత)

‘ ఇది నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఎంతో పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కల్గిన భారత జట్టు పేలవంగా టోర్నీ ముగించడం బాధించింది. స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌లు విశేషమైన టాలెంట్‌ ఉన్న క్రీడాకారిణులు. వారు ఈ టోర్నీ మొత్తం విఫలమయ్యారు. ప్రధానంగా హర్మన్‌ ఫెయిల్యూర్‌ కావడమైతే నిలకడగా జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వేదా కృష్ణమూర్తి కూడా రాణించలేదు. హర్మన్‌ తన కెప్టెన్సీపై సమీక్షించుకోవాలి. కెప్టెన్సీ ఎప్పుడు తప్పుకోవాలో ఆమెకు తెలుసు. హర్మన్‌ ఎంతో పరిణితి చెందిన క్రికెటర్‌. ఇప్పుడు హర్మన్‌ కెప్టెన్‌ కంటే కూడా బ్యాటింగ్‌లో నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది’ అని శాంతా రంగస్వామి పేర్కొన్నారు. 

ఇక భారత మాజీ వుమెన్స్‌ క్రికెటర్‌ డయానా ఎడ్జుల్లీ.. ఫైనల్లో భారత క్రీడాకారిణుల ప్రదర్శనపై విమర్శలు గుర్పించారు. ఎవరికి వారు ఆత్మపరిశోధన చేసుకోవాలంటూ సూచించారు. మరొకవైపు భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ తుషాన్‌ ఆర్ధో కూడా విమర్శలు చేశారు. తానియా భాటియాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై మండిపడ్డారు. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ)

మరిన్ని వార్తలు