టైటాన్స్ గెలుపు

25 Sep, 2013 01:32 IST|Sakshi
టైటాన్స్ గెలుపు

మొహాలీ: బ్రిస్బేన్ హీట్స్‌కు మరో పరాభవం...తక్కువ పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఈ ఆస్ట్రేలియా జట్టు మళ్లీ చతికిల పడింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 4 పరుగుల తేడాతో బ్రిస్బేన్‌ను ఓడించి సీఎల్‌టి20లో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 18.5 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ కాగా...హీట్స్ 20 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది.
 
 చెలరేగిన గాలే
 ఓపెనర్ రుడాల్ఫ్ (1) తొందరగానే అవుటైనా, డేవిడ్స్ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), కున్ (27 బంతుల్లో 31; 6 ఫోర్లు) కలిసి టైటాన్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత డివిలియర్స్ (19 బంతుల్లో 28; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు. అయితే డివిలియర్స్ అనూహ్యంగా రనౌట్ కావడంతో జట్టు ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. 16 పరుగుల తేడాతో టైటాన్స్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. మ్యాథ్యూ గాలే (4/10) చెలరేగి టైటాన్స్‌ను దెబ్బ తీశాడు.
 
 రాణించిన లాంజ్
 స్వల్ప విజయలక్ష్యాన్ని కూడా బ్రిస్బేన్ హీట్స్ ఛేదించలేకపోయింది. కెప్టెన్ జేమ్స్ హోప్స్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. క్రిస్టియాన్ (24 బంతుల్లో 21; 1 సిక్స్), సబర్గ్ (7 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మర్చంట్ డి లాంజ్ (3/13), రిచర్డ్స్ (2/20) చక్కటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో హీట్స్ తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. విజయం కోసం చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా మెక్‌డెర్మట్ క్లీన్ బౌల్డ్ కావడంతో హీట్స్ ఓటమిపాలైంది.
 

మరిన్ని వార్తలు