స్ఫూర్తి శాశ్వతం

29 Jul, 2016 00:12 IST|Sakshi
స్ఫూర్తి శాశ్వతం

నాలుగేళ్లకు ఒక సారి ఒలింపిక్స్ వేదిక మారుతుంది... ఆటగాళ్లు మారతారు... పతక విజేతలు, రికార్డుల జాబితా కూడా మారుతుంది... అయితే ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ అనగానే కొన్ని అంశాలు మాత్రం మనల్ని ప్రతీ సారి అలా పలకరిస్తూ ఉంటాయి. ఐదు వలయాల జెండా, ఒలింపిక్ జ్యోతి, మెరుపులా మెరిసే పతకాలు... అలా అభిమానుల మనసులో ముద్రించుకుపోతాయి. వీటిలో ప్రతీదానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. ఈ క్రీడలకు ఉన్నంత చరిత్ర వాటికీ ఉంది. ఒలింపిక్ క్రీడల స్ఫూర్తిని, ఘనతను గుర్తు చేసే లోగో, జ్యోతి, పతకాలు ఈ క్రీడల చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.

 

ఒలింపిక్ జెండా (లోగో)
ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు పియర్రీ డి  కూబర్టీన్ స్వయంగా 1912లో ఈ ఐదు రింగుల లోగోను డిజైన్ చేశారు. ఇందులో ఒకదానితో ఒకటి కలిసిపోయి కనిపించే ఐదు రంగులు ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నలుపు ప్రపంచంలోని ఐదు ఖండాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. 1912 స్టాక్‌హోం ఒలింపిక్స్‌లో తొలిసారి ఐదు ఖండాలకు చెందిన దేశాలు పాల్గొన్న తర్వాత వచ్చిన ఆలోచన ఇది. నేపథ్యంలో ఉండే తెలుపు కూడా కలిపి చూస్తే... అన్ని దేశాల జాతీయ జెండాలలో కనిపించే రంగులతో లోగోను తాను రూపొందించినట్లు కూబర్టీన్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఒలింపిక్స్ అనగానే ప్రతీ ఒక్కరి మనసులో ఈ ఐదు వలయాలు మెదలడం ఖాయం. వివిధ దేశాల జాతీయ పతకాలకు ఉన్న స్థాయి, విలువ, గౌరవం ఈ లోగోతో కూడిన ఒలింపిక్ జెండాకు కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రారంభోత్సవ వేడుకల నుంచి ముగింపు ఉత్సవం వరకు దీనిని ప్రదర్శించి తర్వాతి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోయే నగర మేయర్‌కు దీనిని అందించడం ఒక సాంప్రదాయంగా మారింది.

 

ఒలింపిక్ జ్యోతి (టార్చ్)
ఏథెన్స్‌లో ఒలింపిక్స్ జ్యోతి వెలిగించడం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా టార్చ్ రిలే జరగడం... ఇలా ప్రస్తుతం కొనసాగుతున్న సాంప్రదాయం 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మొదలైంది. అయితే 1928లోనే ఒలింపిక్ స్టేడియం వద్ద తొలిసారి క్రీడలు జరిగినన్నీ రోజులు జ్యోతిని మండించారు. అగ్నిని దేవుడిగా భావించే గ్రీకులు ఆటలు నిర్వహించిన సమయంలో దీనిని జ్వలింపజేయడంతో తర్వాత అదే సాంప్రదాయంగా మారింది. ప్రస్తుత పద్ధతి ప్రకారం... క్రీడలకు వంద రోజుల ముందు తొలి ఒలింపిక్స్ జరిగిన ఒలింపియా గ్రామంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో సూర్య కిరణాల సహాయంతో (పారాబోలిక్ మిర్రర్ మెథడ్)తో ఒలింపిక్ జ్యోతిని మండిస్తారు. దానిని ముందుగా సమీపంలోని గ్రీస్ నగరానికి తీసుకెళతారు. అక్కడినుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఒలింపిక్ జ్యోతి పయనమవుతుంది. మంట ఏ దశలోనూ ఆరిపోకుండా ప్రత్యేకంగా తయారు చేసిన టార్చ్ ద్వారా ఈ పరుగు కొనసాగుతుంది. తుదకు నిర్వహణ వేదిక వద్దకు చేరిన అనంతరం ఈ టార్చ్ సహాయంతో జ్యోతిని మండిస్తారు. అది ఒలింపిక్స్ జరిగినన్ని రోజులు వెలుగుతుంది.

 

విశేషాలు...
రియో ఒలింపిక్స్ కోసం గ్రీస్‌లో 450 మంది, బ్రెజిల్‌లో 12 వేల మంది టార్చ్ బేరర్లుగా వ్యవహరించారు. ఎలాంటి వాతావరణంలోనూ, నీళ్లలో, మంచులో కూడా పాడు కాకుండా ఈ టార్చీలు ఉంటాయి. నిర్వాహక దేశం ఆలోచనల మేరకు ప్రతీ సారి టార్చ్ రూపంలో మార్పులు జరుగుతాయి. 1996, 2000 ఒలింపిక్స్ సందర్భంగా మంట లేకుండా కేవలం ఒలింపిక్ టార్చ్‌ను  రోదసిలోకి కూడా పంపించారు.

 

విశేషాలు...
ఐదు వలయాల లోగోతో కూడిన జెండాలను 1920 ఆంట్‌వెర్ప్ ఒలింపిక్స్‌లో తొలిసారి ఉపయోగించారు. అయితే ఈ క్రీడలు ముగిసిన తర్వాత పతాకం కనిపించకపోవడంతో కొత్తది తయారు చేసి తర్వాతి ఒలింపిక్స్‌లో వాడారు. 77 ఏళ్ల తర్వాత 1997లో హల్ హెగ్ ప్రీస్ట్ అనే స్విమ్మర్ తన దగ్గర ఆ జెండా ఉందంటూ తీసిచ్చాడు. నాటి ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అతను సరదాగా స్థంభం ఎక్కి తాను దానిని దొంగిలించినట్లు చెప్పుకొచ్చాడు. 1998 సియోల్ ఒలింపిక్స్‌నుంచి ప్రస్తుతం ఉన్న జెండాను క్రీడల సందర్భంగా ప్రదర్శిస్తున్నారు. మరింత వేగంగా, మరింత ఎత్తుకు, మరింత బలంగా... అనే ఒలింపిక్ స్ఫూర్తితో కలిపి జెండాలను ప్రదర్శించడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది.

 

ఒలింపిక్ పతకాలు
ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన తర్వాత మొదటి రెండు సార్లు స్వర్ణ పతకం లేదు. మొదటి స్థానంలో నిలిచినవారికి రజత పతకం దక్కేది. 1904నుంచి ప్రస్తుతం ఉన్న మూడు రకాల పతకాలను ప్రవేశ పెట్టారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌నుంచి అథ్లెట్ల మెడలో వీటిని వేసే పద్ధతి వచ్చింది. 1912 వరకు స్వర్ణ పతక విజేతలకు అసలైన బంగారంతో కూడిన పతకం ఇచ్చేవారు. నిర్వాహక దేశం ఆలోచనలను బట్టి కొన్ని సార్లు పతకాలలో స్వల్ప మార్పులు చేస్తున్నా... చాలా అంశాలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐఓసీ) కొన్ని ప్రమాణాలు నిర్దేశించింది. మెడల్‌లో ఒక వైపు క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న వేదిక వివరాలు, లోగో ఉంటాయి. మరో వైపు గ్రీకు దేవత నైకీ బొమ్మ ఉంటుంది. తొలి క్రీడలు జరిగిన పానాథోనికో స్టేడియం కూడా వెనుక కనిపిస్తుంది. నైకీ బొమ్మలో కొన్ని మార్పులు చేసి ప్రస్తుతం ఉన్నదానిని 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌నుంచి వాడుతున్నారు.

 

విశేషాలు...
ఒక్కో పతకం బరువు 500 గ్రా. లండన్ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఇది 100 గ్రాములు ఎక్కువ కావడం విశేషం. బంగారు పతకంలో 494 గ్రా. వెండి, 6 గ్రా. మాత్రమే అసలు బంగారం ఉంటుంది. రజత పతకంలో 92.5 శాతం అసలు వెండిని ఉపయోగిస్తారు. కాంస్య పతకంలో రాగి చాలా ఎక్కువగా (93.7 శాతం) ఉండి... టిన్, జింక్ కలిసి ఉంటాయి.ఏ క్రీడలో పతకం గెలిచారో దానిపై రాసి ఉంటుంది.    రియో ఒలింపిక్స్ కోసం బ్రెజిల్ మింట్‌లో తయారు చేసిన మొత్తం పతకాల సంఖ్య 5,130

 

>
మరిన్ని వార్తలు