తొలి దెబ్బ ఎవరిదో?

23 Nov, 2017 00:09 IST|Sakshi

నేటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ యాషెస్‌ తొలి టెస్టు

బ్రిస్బేన్‌లో ఎదురులేని ఆతిథ్య జట్టు

బ్రిస్బేన్‌: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఇద్దరు మేటి క్రికెటర్లయిన స్టీవ్‌ స్మిత్, జో రూట్‌ సారథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు ప్రతిష్టాత్మక ‘యాషెస్‌’ పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో గురువారం తొలి టెస్టు ఆరంభం కానుంది. 2015లో ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా ఈసారి సొంతగడ్డపై దానిని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో పేస్, బౌన్స్‌కు అనుకూలించే ‘గబ్బా’ పిచ్‌పై కంగారూల పేస్‌ త్రయం మిచెల్‌ స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్‌పైనే కెప్టెన్‌ స్మిత్‌ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అటు ఇంగ్లండ్‌ కూడా అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్, క్రిస్‌ వోక్స్‌లు ఆసీస్‌ భరతం పడతారని భావిస్తోంది. బ్రిస్బేన్‌లో ఆతిథ్య జట్టుకున్న రికార్డును తిరగరాయాలని వ్యూహాలు రూపొందిస్తోంది.  

అటు ఇద్దరు.. ఇటు ఇద్దరు!
కెప్టెన్‌ జో రూట్, మాజీ కెప్టెన్‌ కుక్, మొయిన్‌ అలీలే ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు బలం. అందుకే వీరిని లక్ష్యంగా చేసుకునే స్టార్క్‌ నేతృత్వంలోని ఆసీస్‌ పేస్‌ త్రయం దూకుడును ప్రదర్శించనుంది. ‘రూట్, కుక్‌లపైనే దృష్టి పెట్టాం. వీరిని తొందరగా అవుట్‌ చేస్తే ఆ తర్వాత ఇంగ్లండ్‌ పనిపట్టడం పెద్ద కష్టమేం కాదు’ అని స్టార్క్‌ పేర్కొన్నాడు. అటు ఇంగ్లండ్‌ కూడా కెప్టెన్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ల పైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అటు, కీలకమైన మ్యాచ్‌కు ముందు గాయాలు ఆస్ట్రేలియాను కలవరపెడుతున్నాయి. వార్నర్, షాన్‌ మార్‌‡్షలు ఇంకా చికిత్స పొందుతుండటం స్మిత్‌కు ఇబ్బందిగా మారింది.  

కుక్‌ అనుభవం కలిసొచ్చేనా?
ఇప్పటివరకు నాలుగు యాషెస్‌లు ఆడిన అనుభవమున్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కుక్‌పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఓపెనింగ్‌లో కుక్‌ కుదురుకుంటే మిడిలార్డర్‌లో రూట్, డేవిడ్‌ మలాన్, మొయిన్‌ అలీలు బ్యాటింగ్‌ ఆర్డర్‌కు స్థిరత్వం ఇవ్వగలరు. అండర్సన్, బ్రాడ్, వోక్స్‌ల త్రయం గబ్బా వికెట్‌ బౌన్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటుందని ఇంగ్లిష్‌ జట్టు భావిస్తోంది.  
జట్లు: ఆస్ట్రేలియా: స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్, బాన్‌క్రాఫ్ట్, ఖాజా, హ్యాండ్స్‌కోంబ్, షాన్‌ మార్‌‡్ష, పైన్, స్టార్క్, కమిన్స్, లయన్, హాజల్‌వుడ్‌. ఇంగ్లండ్‌: జో రూట్‌ (కెప్టెన్‌), కుక్, స్టోన్‌మాన్, విన్స్, మలాన్, అలీ, బెయిర్‌స్టో, వోక్స్, బ్రాడ్, అండర్సన్, జేక్‌ బాల్‌.

బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డుంది. 1988 నుంచి ఇక్కడ ఆడిన ఏ టెస్టులోనూ ఆసీస్‌ ఓడిపోలేదు. అటు ఇంగ్లండ్‌ కూడా 31 ఏళ్లుగా ఈ మైదానంలో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. 1986 తర్వాత ఇక్కడ ఆడిన 28 టెస్టుల్లో 21 నెగ్గిన ఆసీస్‌... 7 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది.  

మరిన్ని వార్తలు