'ఫైనల్‌' నీదా... నాదా?

22 May, 2018 00:35 IST|Sakshi

చెన్నై, హైదరాబాద్‌ మధ్య  నేడు తొలి క్వాలిఫయర్‌

గెలిచిన జట్టు ఫైనల్‌కు

ఓడిన జట్టుకు మరో అవకాశం

రాత్రి 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... లీగ్‌కు ముందే నాయకుడు దూరమై డీలా... కొత్త సారథి ఎలా నడిపిస్తాడోనని ఆందోళన... అంతంతమాత్రం బ్యాటింగ్‌     లైనప్‌పై బెంగ... బౌలర్ల సామర్థ్యంపై భారంవేసి బరిలో దిగింది..! చెన్నై సూపర్‌కింగ్స్‌... రెండేళ్ల నిషేధం వీడి పునరాగమనం... ‘సీనియర్ల’ జట్టంటూ వ్యంగ్యాస్త్రాలు... ఒక్క మ్యాచ్‌కే దూరమైన సొంత మైదానం... వెయ్యేనుగుల బలమైన కెప్టెన్‌పైనే భరోసా ఉంచింది!  

ముంబై: ఐపీఎల్‌–11 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్, సూపర్‌ కింగ్స్‌ రెండింటి పయనంపై అనుమానాలు, అనిశ్చితి. అయితే, వాటిని లీగ్‌ ప్రారంభం నుంచే పటాపంచలు చేస్తూ రెండు జట్లు పోటీకి ఎదురొడ్డాయి. కఠిన పరిస్థితులను తట్టుకుని టాప్‌–2లో నిలిచాయి. స్వల్ప స్కోర్లే చేసినా కట్టుదిట్టంగా బంతులేసే భీకర బౌలింగ్‌ దళం హైదరాబాద్‌ను గెలిపించగా, ఎంతటి భారీ లక్ష్యాన్నైనా కొట్టిపడేసే దుర్బేధ్యమైన బ్యాటింగ్‌ బలగం చెన్నైని ముందుకు నడిపించింది. మంగళవారం ముంబైలోని వాంఖెడేలో జరగనున్న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ను బంతికి, బ్యాట్‌కు మధ్య సిసలైన సమరంగా పేర్కొనవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్‌ రూపంలో ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకునేందుకు మరో అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాలేమిటి? బలహీనతలేమిటి? అని విశ్లేషిస్తే...! 

దుమ్మురేపే బ్యాటింగ్‌ దన్నుగా... 
బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు, బౌలింగ్‌ ఆల్‌రౌండర్లతో ఆడుతున్నది పదకొండు మందా..? లేక పదముగ్గురా? అన్నట్లుంటుంది చెన్నైను చూస్తే. ఆదివారం పంజాబ్‌పై మ్యాచ్‌లో పేసర్‌ దీపక్‌ చహర్‌ ఇన్నింగ్సే ఇందుకో ఉదాహరణ. జట్టుగానే అత్యంత పటిష్ఠం అనుకుంటే... దానికి కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని వ్యూహాలు తోడైతే తిరుగేముంటుంది? ఓపెనర్లు వాట్సన్, అంబటి రాయుడు తిరుగులేని ఫామ్‌లో ఉండగా, రైనా సరైన సమయంలో జోరందుకున్నాడు. బిల్లింగ్స్, ధోని, బ్రేవోలతో మిడిలార్డర్‌ నిండుగా కనిపిస్తోంది. జడేజా, హర్భజన్‌ల స్పిన్, చహర్, శార్దుల్‌ ఠాకూర్, ఇన్‌గిడిల పేస్‌ను తట్టుకోవడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. అయితే, బ్యాట్స్‌మన్‌గా డు ప్లెసిస్, బిల్లింగ్స్‌లో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఈ ఒక్కటి తప్ప మిగతా పేర్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. దీనికి తగ్గట్లే క్వాలిఫయర్స్‌కు సన్నాహకమా? అన్నట్లు చివరి లీగ్‌ మ్యాచ్‌లో వనరులన్నింటినీ పరీక్షించుకుని సంసిద్ధమైంది సూపర్‌ కింగ్స్‌. బలాబలాల రీత్యా సమంగా కనిపిస్తున్నా, పెద్దగా లోపాలు లేనందున చెన్నై వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది.  

కట్టిపడేసే బౌలింగ్‌ తోడుగా... 
జట్టుగా అంత బలంగా కనిపించకున్నా, మైదానంలో అనూహ్య ప్రదర్శనతో నెగ్గుకొచ్చింది సన్‌రైజర్స్‌. మిగతా జట్లు ప్లే ఆఫ్స్‌ చేరేందుకే ఆపసోపాలు పడుతుంటే... చివరి మూడు లీగ్‌ మ్యాచ్‌లలో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి అర్హత సాధించడం హైదరాబాద్‌ సత్తాను చాటుతోంది. ఈ ఘనతంతా బ్యాటింగ్‌లో చుక్కల్లో చంద్రుడిలా నిలిచిన కెప్టెన్‌ విలియమ్సన్‌కు, బౌలింగ్‌లో ప్రత్యర్థులను కట్టిపడేసిన పేసర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్‌ కౌల్, సందీప్‌ శర్మ, స్పిన్నర్లు రషీద్‌ ఖాన్, షకీబ్‌ హసన్‌లదే. అద్భుత ఇన్నింగ్స్‌లతో తనలోని మరో కోణాన్ని చూపిన విలియమ్సన్‌కు... బ్యాటింగ్‌ కంటే జట్టు బౌలింగ్‌ వనరులే పెద్ద బలం. అయితే, అన్ని రంగాల్లోనూ రాణిస్తేనే చెన్నైలాంటి ప్రత్యర్థిని ఓడించగలదు. కీలక మ్యాచ్‌ కాబట్టి శిఖర్‌ ధావన్‌కు తోడుగా హేల్స్‌ను ఓపెనింగ్‌కు పంపే అవకాశం ఉంది. మిడిలార్డర్‌ మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తోంది. మనీశ్‌పాండే నుంచి మెరుపుల్లేకపోగా, యూసుఫ్‌ పఠాన్‌ ఫామ్‌ సరేసరి అన్నట్లుంది. దీంతో భారమంతా టాప్‌ ఆర్డర్‌దే అవుతోంది. షకీబ్‌ లోటును కొంత తీరుస్తున్నా అది అన్నిసార్లు కుదరదు. వికెట్‌ కీపర్‌ గోస్వామిని మిడిలార్డర్‌లో దింపితే ప్రయోజనం ఉండొచ్చు. చివరి మూడు మ్యాచ్‌ల వైఫల్యాలను సరిదిద్దుకుంటే భువీ ఆధ్వర్యంలోని బౌలింగ్‌ బృందం ప్రత్యర్థికి కొరకరాని కొయ్య కావడం ఖాయం. 

తుది జట్లు (అంచనా) 
చెన్నై: ధోని (కెప్టెన్‌), రైనా, రాయుడు, వాట్సన్, బిల్లింగ్స్‌/డు ప్లెసిస్, బ్రేవో, జడేజా, హర్భజన్, చహర్, శార్దుల్, ఇన్‌గిడి. 
హైదరాబాద్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), ధావన్, హేల్స్‌/బ్రాత్‌వైట్, మనీశ్‌ పాండే, గోస్వామి, యూసుఫ్‌ పఠాన్, షకీబ్, రషీద్‌ ఖాన్, భువనేశ్వర్, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌. 

►ఐపీఎల్‌–11లో 4 శతకాలు నమోదైతే మూడు సన్‌రైజర్స్‌పైనే వచ్చాయి. ఇందులో రెండు చెన్నై ఓపెనర్లు వాట్సన్, రాయుడు చేసినవే. 
►అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో విలియమ్సన్‌ (661) రెండో స్థానంలో ఉండగా, అతడిని అందుకునే అవకాశం రాయుడి (586)కి మాత్రమే ఉంది. 
►రెండు జట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ (17) కాగా, రషీద్‌ ఖాన్‌ (16) తర్వాత ఉన్నాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ (14) ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 
►  పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు లీగ్‌ విజేత కావడం రెండుసార్లు మాత్రమే జరిగింది. 2008లో రాజస్తాన్, 2017లో ముంబై ఈ ఘనత సాధించాయి. 
►ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్‌పై చెన్నైదే గెలుపు. రాయుడు (79, 100 నాటౌట్‌) రెండుసార్లూ మెరిశాడు.   

మరిన్ని వార్తలు