సాగర తీరాన సమరం

24 Feb, 2019 00:06 IST|Sakshi

నేడు విశాఖపట్నంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టి20 మ్యాచ్‌ 

ఉత్సాహంగా ఇరు జట్లు

టీమిండియా బౌలర్లపై ప్రత్యేక దృష్టి

‘టి20 మ్యాచ్‌లకంటే మరో రెండు వన్డేలే ఉంటే బాగుండేది’ భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. కోహ్లి మాత్రమే కాదు ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానుల అభిప్రాయం సైతం బహుశా ఇదే కావచ్చు. సరిగ్గా వన్డే వరల్డ్‌ కప్‌కు సిద్ధమవుతున్న తరుణంలో టి20 మ్యాచ్‌లు ఆడటం జట్టుకు పెద్దగా ప్రయోజనకరం కాకపోయినా పర్యటన సంప్రదాయాల్లో భాగంగా పొట్టి ఫార్మాట్‌ కూడా ఆడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారత్, ఆస్ట్రేలియా ధనాధన్‌ క్రికెట్‌లో తలపడబోతున్నాయి. తుది ఫలితం ఎలా ఉన్నా స్టార్‌ ఆటగాళ్లతో కూడిన ఇరు జట్లు ప్రేక్షకులకు మాత్రం మాంచి వినోదం పంచడం ఖాయమనిపిస్తోంది.   

వైజాగ్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవలే ఇరు జట్ల మధ్య జరిగిన టి20 సిరీస్‌ సమంగా ముగిసింది. దానికి కొనసాగింపుగానా అన్నట్లు ఇప్పుడు మన దేశంలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్‌లో ఇటీవల న్యూజిలాండ్‌లో మన టీమ్‌ ఓడగా... మరోవైపు బిగ్‌బాష్‌ లీగ్‌ ద్వారా కంగారూ జట్టులో కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. వన్డేలను వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోనున్న రెండు జట్లు అంతకుముందు టి20ల్లో ఎలా చెలరేగుతాయో చూడాలి.  

కోహ్లి, బుమ్రా రాకతో... 
కివీస్‌తో సిరీస్‌కు దూరమైన కెప్టెన్‌ కోహ్లి, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి బరిలోకి దిగుతుండటంతో భారత జట్టు మరింత పటిష్టంగా మారింది. సొంతగడ్డపై అనుకూలత, బ్యాటింగ్‌ పిచ్‌ బలంతో మన లైనప్‌ భారీ స్కోరు చేసేందుకు మంచి అవకాశం ఉంది. ఎంతో కాలంగా భారత్‌ జయాపజయాలను ప్రభావితం చేస్తున్న టాప్‌–3 చెలరేగితే 20 ఓవర్లలో ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్‌కు పెద్దగా పని ఉండదు. విశాఖలో ఘనమైన రికార్డులు ఉన్న కోహ్లి, రోహిత్‌ల నుంచి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చు. నాలుగు అంతర్జాతీయ టి20 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన రోహిత్‌ శర్మ స్వదేశంలో మరోసారి అలాంటి లక్ష్యానికి గురి పెట్టినా ఆశ్చర్యం లేదు. న్యూజిలాండ్‌తో చివరి టి20 మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడి ఆకట్టుకున్న విజయ్‌ శంకర్‌ లోయర్‌ ఆర్డర్‌కు మారతాడు. వన్డేల్లో చోటు కోల్పోయినా... టి20ల్లో రెగ్యులర్‌గా మారిన దినేశ్‌ కార్తీక్‌పై మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచుతుందా లేక ఏరికోరి ఎంపిక చేసుకున్న కేఎల్‌ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తుందా చూడాలి. ఈ రెండు టి20 మ్యాచ్‌లలోనూ చెలరేగితే దినేశ్‌ కార్తీక్‌ వన్డే అవకాశాలు మెరుగుపడతాయేమో. ప్రాక్టీస్‌ సెషన్‌లో ధోని దాదాపు ప్రతీ బంతిని మైదానం దాటించేలా భారీ షాట్లు ఆడాడు. అటు పేస్, ఇటు స్పిన్‌ పిచ్‌లపై కూడా హిట్టింగ్‌కే ప్రాధాన్యతనిస్తూ చెలరేగిపోయాడు. బుమ్రాతో పాటు ఉమేశ్‌ యాదవ్‌ కొత్త బంతిని పంచుకుంటాడు. గాయంతో సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా దూరం కావడం భారత్‌కు కొంత ప్రతికూలాంశం. స్పిన్‌ భారం యజువేంద్ర చహల్‌పైనే ఉంది. అతని లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో సొంతగడ్డపైనే తీవ్రంగా ఇబ్బంది పడిన ఆసీస్‌ ఈసారి ఎలా ఎదుర్కొంటుందనేది సందేహమే. కుల్దీప్‌కు విశ్రాంతినివ్వడంతో టీమ్‌లోకి తొలిసారి ఎంపికైన మరో లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండేకు తుది జట్టులో అంత తొందరగా అవకాశం లభించకపోవచ్చు.  ఇటీవల రాణించడంతో మార్కండేకు చాన్స్‌ వచ్చిందని, అయితే అతని వల్ల తమ వరల్డ్‌ కప్‌ ఆలోచనల్లో ఉన్న జట్టు కూర్పులో ఎలాంటి తేడా రాదని విరాట్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు.  

కొత్త ఆటగాళ్లు రాణిస్తారా... 
ఆస్ట్రేలియా జట్టులో ఇప్పుడు చూడదగ్గ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతను మార్కస్‌ స్టొయినిస్‌.  సాధారణంగా ప్రత్యర్థి జట్టు క్రికెటర్‌ గురించి ప్రశంసించని విరాట్‌ కోహ్లి... అతడిని ఆకాశానికెత్తాడు. ఇటీవల ఆల్‌రౌండర్‌గా స్టొయినిస్‌ ఆట చాలా బాగుండటమే దానికి కారణం. మరోవైపు బిగ్‌బాష్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌’గా నిలిచిన డార్సీ షార్ట్‌పైనా ఆసీస్‌ మంచి అంచనాలు పెట్టుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై ప్రదర్శన భారత్‌కు వచ్చేసరికి పునరావృతం అవుతుందని గ్యారంటీ ఏమీ లేదు. సొంతగడ్డపైనే కంగారూలు వర్షం కారణంగా సిరీస్‌ చేజార్చుకోకుండా బయటపడ్డారు. కాబట్టి ప్రముఖంగా వినిపిస్తున్న ఆటగాళ్లు కూడా ఏమేరకు రాణిస్తారనే చెప్పలేం. అయితే ఫించ్, మ్యాక్స్‌వెల్, లిన్‌ల దూకుడైన ఆటతో పాటు కమిన్స్, కూల్టర్‌ నీల్, రిచర్డ్సన్‌ల ఐపీఎల్‌ అనుభవం కచ్చితంగా ఆ జట్టుకు ఉపకరిస్తుంది. తొలి మ్యాచ్‌ గెలిస్తే ఆసీస్‌ ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుంది. కానీ, భారత్‌ అలాంటి అవకాశం ఇస్తుందా అనేది ఆసక్తికరం. ప్రాక్టీస్‌ సందర్భంగా స్పిన్‌ను ఆడే విషయంలో ఆసీస్‌ ఆటగాళ్ళకు మాజీ స్టార్‌ మాథ్యూ హేడెన్‌ సూచనలివ్వడం కనిపించింది.  

వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం రికార్డు 
2012లో ఇక్కడి వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరగాల్సిన తొలి టి20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి సైతం పడకుండానే పూర్తిగా రద్దయింది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2016 ఫిబ్రవరి 14న జరిగిన టి20 మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్లతో శ్రీలంకను చిత్తు చేసింది. అశ్విన్‌ 8 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడంతో లంక 82 పరుగులకే కుప్పకూలగా... భారత్‌ 13.5 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

వరల్డ్‌ కప్‌ సన్నాహాలకు ఈ సిరీస్‌కు కొంత తేడా ఉంటుందనేది వాస్తవం. వరల్డ్‌ కప్‌ జట్టులో ఉండేవారు టి20 క్రికెట్‌ వల్ల ఎక్కువగా ప్రభావితం కావద్దు. ఈ ఫార్మాట్‌లో ఉండే కొన్ని అవలక్షణాలు వన్డేలకు అంటకుండా వారే జాగ్రత్త పడాలి. వరల్డ్‌ కప్‌కు ముందు ఐపీఎల్‌ ఆడుతుండటం శారీరకంగా కూడా తీవ్ర శ్రమతో కూడుకున్నది. అయితే తమ శరీర సామర్థ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి అతిగా శ్రమించి వరల్డ్‌ కప్‌లో భారత్‌కు ఆడేటప్పుడు కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు.   పుల్వామాలో అమరులైన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ సమయంలో మాది ఒకటే మాట. పాక్‌తో మ్యాచ్‌ ఆడే విషయంలో దేశం ఏం కోరుకుంటుందో, బీసీసీఐ ఏం నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి ఉండాలనేది మా ప్రధాన అభిప్రాయం. అయితే ఈ అంశంలో చివరకు ప్రభుత్వం, బోర్డు తీసుకునే నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం.      
– కోహ్లి, భారత కెప్టెన్‌  

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ధావన్, దినేశ్‌ కార్తీక్‌ /లోకేశ్‌ రాహుల్, ధోని, రిషభ్‌ పంత్, విజయ్‌ శంకర్, కృనాల్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్, యజువేంద్ర చహల్, బుమ్రా. 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), హ్యాండ్స్‌కోంబ్,  షార్ట్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, టర్నర్, క్యారీ, కూల్టర్‌ నీల్, కమిన్స్, జంపా, రిచర్డ్సన్‌.

పిచ్, వాతావరణం
సహజంగానే టి20 ఫార్మాట్‌కు తగినట్లుగా వైజాగ్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుందని, భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్యురేటర్‌ నాగమల్లయ్య చెప్పారు. వాతావరణ సమస్య లేదు. వైజాగ్‌లో బాగా ఎండలు ఉన్నాయి. మ్యాచ్‌ రోజు కూడా ఇదే కొనసాగవచ్చు. 

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో  ప్రత్యక్ష ప్రసారం 
 

మరిన్ని వార్తలు