మరో విజయం కోసం...

3 May, 2017 23:17 IST|Sakshi
మరో విజయం కోసం...

నేడు గుజరాత్‌తో తలపడనున్న ఢిల్లీ
ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే విజయం తప్పనిసరి
లయన్స్‌కు చావోరేవో


న్యూఢిల్లీ: వరుస పరాజయాలకు అడ్డుకట్టవేసి చివరి మ్యాచ్‌లో గెలుపుబాట పట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ గురువారం గుజరాత్‌ లయన్స్‌తో తలపడనుంది. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ప్రతీ మ్యాచ్‌ నెగ్గాల్సిన స్థితిలో ఉన్న ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో త్రుటిలో విజయాన్ని కోల్పోయిన గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని బరిలోకి దిగనుంది.

వరుస ఓటములకు చెక్‌...
ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి జోరు చూపించింది. ఆ తర్వాత నుంచి జట్టు ఆటతీరు తీసికట్టుగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్‌ వైఫల్యంతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. దీంతో కేవలం నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగుస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ జట్టుకు దూరమవడం ఎదురుదెబ్బగా పరిణమించింది.  మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆడిన ఢిల్లీ అనూహ్యంగా పుంజుకుంది. జట్టు బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో భారీ లక్ష్యాన్ని అలవోకగా  ఛేదించింది. కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ జట్టును ముందుడి నడిపాడు. సంజూ సామ్సన్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, కోరే అండర్సన్, క్రిస్‌ మోరిస్‌ తలో చేయి వేశారు. దీంతో ఆరు పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలోకి ఎగబాకింది. తాజా విజయంతో ఢిల్లీకి ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగయ్యాయి. నాకౌట్‌కు డేర్‌డెవిల్స్‌అర్హత సాధించాలంటే మిగతా ఐదు మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది.

అయితే వీటిలో నాలుగు మ్యాచ్‌లు సొంతగడ్డపై జరుగుతుండడం జట్టుకు సానుకూలాంశం. జట్టు బ్యాటింగ్‌ విషయానికొస్తే ఈ సీజన్‌లో సంజూ సామ్సన్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 34కిపైగా సగటుతో 313 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ కూడా ఉండడం విశేషం. తర్వాతి స్థానాల్లో శ్రేయస్‌ అయ్యర్‌ (190 పరుగులు), రిషబ్‌ పంత్‌ (184 పరుగులు) ఆకట్టుకున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో సత్తాచాటిన కరుణ్, అండర్సన్‌ అదే జోరును చూపించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక  క్రిస్‌ మోరిస్‌ ఆకట్టుకుంటున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు.  బ్యాట్‌తోను జోరు చూపిస్తూ సిసలైన అల్‌రౌండర్‌గా మోరిస్‌ మెరుగవుతున్నాడు.ప్యాట్‌ కమిన్స్‌ (9 వికెట్లు), అమిత్‌ మిశ్రా (8) ఫర్వాలేదనిపిస్తున్నారు. జయంత్‌ యాదవ్‌ మంచి ఎకానమీ రేటుతో ఆకట్టుకున్నా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు.  కగిసో రబడ, మహ్మద్‌ షమీ రాణించాల్సి ఉంది. చివరిమ్యాచ్‌లో అమిత్‌ మిశ్రా.. హైదరాబాద్‌ను కట్టడి చేయడంతో ప్రత్యర్థి 200 పరుగుల మార్కును చేరుకోలేకపోయింది.  ఈ సీజన్‌లో ఢిల్లీ–గుజరాత్‌ ఒక్కసారి కూడా తలపడలేదు. గత సీజన్‌లో రెండుసార్లు తలపడిన ఇరుజట్లు చెరోసారి విజయం సాధించాయి.

గుజరాత్‌ డీలా...
మరోవైపు గత సీజన్‌లో అద్భుత విజయాలతో ఆకట్టుకుని మూడోస్థానంలో నిలిచిన గుజరాత్‌ .. ఈసీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటివరకు పది మ్యాచ్‌లాడిన గుజరాత్‌ కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించగా.. ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఓవరాల్‌గా పట్టికలో ఏడోస్థానంలో కొనసాగుతోంది. అయినప్పటికీ గుజరాత్‌కు ప్లే ఆఫ్‌ అవకాశాలు ఉన్నాయి. మిగిలన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించడంతోపాటు మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలు కలిసి వచ్చినట్లయితే నాకౌట్‌పోరుకు అర్హత సాధించే అవకాశముంది.

ఈ క్రమంలో ఆ జట్టు ప్రతీ పోరును చావోరేవోలాగా భావించాల్సి ఉంటుంది. మరోవైపు ముంబై ఇండియన్స్, పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ల్లో కొద్ది తేడాలో విజయం కోల్పోయిన గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గాలని కసి మీద ఉంది. జట్టు బ్యాటింగ్‌ విషయానికొస్తే విధ్వంసక ఆటగాడు బ్రెండన్‌ మెకల్లమ్‌ (319 పరుగులు), కెప్టెన్‌ సురేశ్‌ రైనా(318 పరుగులు) జట్టు వెన్నెముకలా నిలిచారు. జట్టు తరఫును పరుగుల వరద పారిస్తున్నా కీలక దశలో సహచరుల నుంచి సహకారం అందడం లేదు. వీరితోపాటు దినేశ్‌ కార్తిక్‌ (221 పరుగులు), ఆరోన్‌ ఫించ్‌ (200 పరుగులు) సత్తాచాటుతున్నారు.

ఇషన్‌ కిషన్‌ ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, డ్వేన్‌ స్మిత్‌ బ్యాట్‌ ఝులిపించాల్సిన అవమసరముంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే కేరళ కుర్రాడు బాసిల్‌ థంప్సి 8 వికెట్లతో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు పుణేతోమ్యాచ్‌లో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ప్రదీప్‌ సాంగ్వాన్‌ రాణించాడు. తొలి ఓవర్‌లోనే కీలకమైన రెండు వికెట్లు తీసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. ఇదే తరహా ప్రదర్శన పునరావృతం చేయాలని జట్టు ఆశిస్తోంది.  అండ్రూ టై జట్టుకు దూరం కావడం ఎదురుదెబ్బగా పరిణమించింది. కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు తీసిన టైని భర్తీ చేసే పేసర్లు గుజరాత్‌కు లభించడం లేదు. శార్దుల్‌ ఠాకూర్, జడేజా, ఫాల్క్‌నర్‌ బంతితోనూ సత్తా చాటాల్సిన అవసరముంది. 

మరిన్ని వార్తలు