ధనాధన్‌ దెబ్బ ఎవరిది?

7 Oct, 2017 04:15 IST|Sakshi

నేడు భారత్, ఆసీస్‌ తొలి టి20

ఉత్సాహంగా టీమిండియా

కొత్త ఆశలతో ఆస్ట్రేలియా

నెహ్రాకు చాన్స్‌!

ఏడాది ఆరంభంలో టెస్టు సిరీస్‌ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా 1–3తో పరాజయంపాలై వెనుదిరిగింది. ఆ పర్యటనకు కొనసాగింపులా పరిమిత ఓవర్ల కోసం మళ్లీ ఇక్కడికి వచ్చి ఇప్పటికే వన్డేల్లో చిత్తుగా ఓడింది. భారత్‌ తమ ఆధిపత్యం నిలబెట్టుకుంటూ నంబర్‌వన్‌ స్థాయిలో చెలరేగింది. ఇక సీన్‌ మూడో ఫార్మాట్‌కు మారింది. టి20ల్లోనూ తమ సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉండగా... ఇక్కడైనా గెలిచి కాస్త పరువు కాపాడుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్‌కు ధోని సొంత మైదానం సిద్ధమైంది.  

రాంచీ: ఒకరు కాదు, ఇద్దరు కాదు... జట్టులో ఒకరితో మరొకరు పోటీ పడుతూ సత్తా చాటిన వేళ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్‌ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ టి20 సిరీస్‌ను గెలుచుకోవడంపై కూడా జట్టు దృష్టి పెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ జరిగే తొలి టి20లో భారత్, ఆసీస్‌తో తలపడుతుంది. కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో వన్డేల్లో కుదేలైన ఆసీస్‌... పొట్టి ఫార్మాట్‌లోనైనా రాత మార్చుకునే ప్రయత్నం లో ఉంది. ఇరు జట్ల మధ్య 2016 జనవరిలో ఆఖరిసారిగా టి20 సిరీస్‌ జరిగింది. ఆస్ట్రేలియా గడ్డపైనే జరిగిన ఈ పోరును భారత్‌ 3–0తో గెలుచుకోవడం ఈ ఫార్మాట్‌లో ప్రత్యర్థిపై మన ఆధిక్యాన్ని చూపిస్తోంది. తొలి టి20 మ్యాచ్‌కు  ముందు భారత జట్టు ప్రాక్టీస్‌ చేసేందుకు అవకాశం లేకపోయింది. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల శుక్రవారం సెషన్‌ రద్దయింది.  

రాహుల్‌ ఉంటాడా!  
కుటుంబ కారణాలతో వన్డేలకు దూరమైన శిఖర్‌ ధావన్‌ తిరిగి రావడం మినహా భారత వన్డే, టి20 జట్లలో పెద్దగా తేడా లేదు. మరో అవకాశం లేకుండా రోహిత్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మినహా తన స్థాయి ముద్ర చూపించలేకపోయిన కోహ్లి, ఈ ఫార్మాట్‌లో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి సారి భారత్‌ తలపడిన 2016 టి20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లోనే కోహ్లి తన కెరీర్‌లో అత్యుత్తమ టి20 ఇన్నింగ్స్‌ ఆడాడు. జాదవ్, ధోని కూడా తమ వంతు పాత్రకు సిద్ధం కాగా... వన్డే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ హార్దిక్‌ పాండ్యా తన కెరీర్‌కు ఊపునిచ్చిన ఫార్మాట్‌లో మళ్లీ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక్క నాలుగో స్థానం విషయంలోనే కాస్త సందేహం నెలకొంది. మనీశ్‌ పాండేను కొనసాగిస్తారా లేక అతని స్థానంలో లోకేశ్‌ రాహుల్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. ఆసీస్‌తో ఒక్క వన్డే కూడా ఆడని రాహుల్‌కు టి20ల్లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో బౌలర్‌గా తన సత్తా చాటి కోహ్లిలో నమ్మకాన్ని పెంచిన యజువేంద్ర చహల్‌కు తుది జట్టులో చోటు ఖాయం కాగా, మరో స్పిన్నర్‌ కోసం అక్షర్, కుల్దీప్‌ పోటీలో ఉన్నారు. వెటరన్‌ ఆశిష్‌ నెహ్రాను సిరీస్‌ కోసం ఎంపిక చేయడం అంటే అతనికి ఖాయంగా తుది జట్టులో చోటు ఉన్నట్లే. కాబట్టి అతని కోసం పేస్‌ విభాగంలో మాత్రం ఒకరు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది. బుమ్రా టి20 స్పెషలిస్ట్‌ కాబట్టి భువనేశ్వర్‌ తప్పుకోవాల్సి రావచ్చు. తన ఎంపికను సరైందిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత నెహ్రాపైనే ఉంది. అయితే తుది జట్టులో ఒకటి రెండు మార్పులు జరిగినా, జరగకపోయినా ప్రస్తుత భారత జట్టు మాత్రం అభేద్యంగా కనిపిస్తోంది. ఇదే జోరులో తొలి మ్యాచ్‌ కూడా గెలుచుకుంటే సిరీస్‌కు పట్టు చిక్కుతుంది.  

కొత్తగా నలుగురు!
వన్డేల్లో ఆడని నలుగురు కొత్త ఆటగాళ్లు ఆసీస్‌ టీమ్‌లోకి వచ్చారు. ఆల్‌రౌండర్లు డాన్‌ క్రిస్టియాన్, మొయిజెస్‌ హెన్రిక్స్, లెఫ్టార్మ్‌ పేసర్‌ జేసన్‌ బెహ్రన్‌డార్ఫ్, వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ జట్టులో ఉన్నారు. వార్నర్, ఫించ్, స్మిత్‌లపై అతిగా ఆధార పడటమే వన్డేల్లో ఆసీస్‌ పరాజయానికి కారణమైంది. ఇప్పుడు కూడా వార్నర్, ఫించ్‌ విధ్వంసకర ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించగలరు. అయితే కెప్టెన్‌ స్మిత్‌ ఫామ్‌ ఆ జట్టును ఆందోళనపరుస్తోంది. చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి అతని వరుస వైఫల్యా లు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం కెప్టెన్సీ మీద కూడా పడుతోంది. కనీసం ఇప్పుడైనా అతను రాణించాలని జట్టు కోరుకుంటోంది. వన్డేల్లో ఫెయిలై తుది జట్టులో స్థానం కోల్పోయిన మ్యాక్స్‌వెల్‌పై టి20ల్లోనైనా ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచుతుందో లేదో చూడాలి. అతని విధ్వంసకర బ్యాటింగ్‌ ఈ ఫార్మాట్‌లో పనికి రావచ్చు. మ్యాక్సీని కాదంటే అతని స్థానంలో ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌ వస్తాడు. వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన కూల్ట ర్‌నీల్‌తో పాటు మరో పేసర్‌ రిచర్డ్సన్‌ కూడా జట్టులో ఉంటాడు. మూడో పేసర్‌గా బెహ్రన్‌డార్ఫ్‌ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. లెగ్‌స్పిన్నర్‌ జంపా టి20ల్లో ప్రభావం చూపించగలడు. అతని స్థానంలో మరో సరైన ప్రత్యామ్నాయం కూడా ఆసీస్‌కు లేదు. ఈ ఫార్మాట్‌లో భారత్‌ చేతిలో చెత్త రికార్డు ఉన్న ఆస్ట్రేలియా దానిని మెరుగు పర్చుకోగలదా చూడాలి.

►9 భారత్, ఆస్ట్రేలియా మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్‌ 9 గెలిచి 4 ఓడింది.

►1 ఈ మైదానంలో గతంలో జరిగిన ఏకైక టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌ 69 పరుగులతో శ్రీలంకను చిత్తు చేసింది.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్, పాండే/రాహుల్, జాదవ్, ధోని, పాండ్యా, చహల్, బుమ్రా, కుల్దీప్‌/ అక్షర్, నెహ్రా/భువనేశ్వర్‌.
ఆస్ట్రేలియా: స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్, ఫించ్, హెడ్, మ్యాక్స్‌వెల్‌/హెన్రిక్స్, క్రిస్టియాన్, పైన్, కూల్టర్‌నీల్, జంపా, రిచర్డ్సన్, బెహ్రన్‌డార్ఫ్‌.


పిచ్, వాతావరణం
సాధారణ టి20 తరహా పిచ్‌. భారీ స్కోరుకు అవకాశం. అయితే రెండు రోజులుగా వర్షం వల్ల వికెట్‌పై తేమ ప్రభావం ఉండవచ్చు. రాంచీతో పాటు పరిసరాల్లో వానలు కురుస్తున్నాయి. శనివారం కూడా మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. 
► రాత్రి గం. 7 నుంచి   స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు