దాయాదుల ధమాకా పోరు

15 Oct, 2017 01:13 IST|Sakshi

ఆసియా కప్‌ హాకీలో నేడు భారత్, పాకిస్తాన్‌ సమరం

ఢాకా: అద్భుత విజయాలతో దూసుకెళుతున్న భారత జట్టు నేడు అసలు సిసలు పోరుకు సిద్ధమవుతోంది. ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భాగంగా తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా లీగ్‌ సమరానికి సై అంటోంది. ఆట ఏదైనా పాక్‌తో మ్యాచ్‌ అంటేనే అభిమానుల జోష్‌ వేరేలా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం పూల్‌ ‘ఎ’ ప్రారంభ మ్యాచ్‌లో జపాన్‌ను 5–1తో, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7–0తో ఘనవిజయాలను అందుకుంది. తద్వారా ఆరు పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఈ విజయాలతో భారత్‌ ఇప్పటికే సూపర్‌–4 దశకు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌నూ నెగ్గి లీగ్‌ దశను అజేయంగా ముగించాలని కోరుకుంటోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత జట్టుకు ఇప్పటిదాకా ఈ టోర్నీలో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకాలేదు. అన్ని విభాగాల్లో అత్యంత నైపుణ్యంతో దాడికి దిగి భారీ గోల్స్‌ను రాబట్టింది. కొన్ని అద్భుత ఫీల్డ్‌ గోల్స్‌తోనూ ఆకట్టుకోగలిగింది.

అయితే పెనాల్టీ కార్నర్‌ (పీసీ) అవకాశాలను మాత్రం తగిన రీతిలో సొమ్ముచేసుకోలేకపోతోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అయితే ఏకంగా 13 పీసీలు వచ్చినా వాటిల్లో రెండింటిని మాత్రమే గోల్‌గా మలిచింది. అటు ఇటీవలే రోలంట్‌ ఓల్ట్‌మన్స్‌ స్థానంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కోచ్‌ జోయెర్డ్‌ మరీన్‌కు కూడా నేటి మ్యాచ్‌ కీలకంగానే మారింది. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత జట్టు అదే ఊపులో పాక్‌ను కూడా మట్టికరిపించాలనే కసితో ఉంది. అయితే మ్యాచ్‌లో ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు పాక్‌ జట్టుకు ఈ టోర్నీలో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7–0తో చిత్తు చేసినా.. జపాన్‌పై మాత్రం 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుత పాక్‌ జట్టు అంత ప్రమాదకరంగా లేకపోయినా తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించగల నైపుణ్యం ఉంది. 14వ ర్యాంకులో కొనసాగుతున్న పాక్‌ జట్టులో తాజాగా సీనియర్‌ ఆటగాళ్లను తిరిగి చేర్చుకుని అద్భుతాలను ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే వారికి సూపర్‌–4 అవకాశాలు సన్నగిల్లుతాయి.

169  ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య 169 మ్యాచ్‌లు జరి గాయి. భారత్‌ 57 మ్యాచ్‌లో గెలుపొందగా... పాకిస్తాన్‌ 82 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగతా 30 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.  

మరిన్ని వార్తలు