ఎదురుందా మ‌న‌కు?

21 Nov, 2018 01:21 IST|Sakshi

నేడు ఆస్ట్రేలియాతో తొలి టి20 

12 మందితో జట్టును  ప్రకటించిన టీమిండియా

స్టార్స్‌ లేకుండానే బరిలోకి ఆసీస్‌

3–0తో టి20 సిరీస్‌ విజయం. అదీ విదేశీ గడ్డపై... మేటి ఆటగాళ్లున్న జట్టు మీద! ఈ ఘనతను టీమిండియా 2016లో    ఆస్ట్రేలియాలోనే సాధించింది. మళ్లీ అదే చోట... గతానికి మించిన బలంతో బరిలో దిగనుందిప్పుడు. మరోవైపు నాటి నుంచి ప్రదర్శన నానాటికీ దిగజారి... ప్రధాన ఆటగాళ్లు దూరమై... పరాజయాలతో కుదేలై... అప్పుడప్పుడు మాత్రమే గెలుస్తోంది కంగారూ జట్టు! రికార్డులు, బలాబలాలు, ప్రస్తుత ఫామ్‌... ఇలా అన్నింట్లో ప్రత్యర్థిపై ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది కోహ్లి సేన. కాస్తోకూస్తో కలిసొచ్చే సొంతగడ్డ అనుకూలత తప్ప ఏ అంశంలోనూ ఆశావహంగా లేదు ఫించ్‌ బృందం. ఈ నేపథ్యంలో సుదీర్ఘ పర్యటనను విజయంతో ప్రారంభించేందుకు భారత్‌కు ఇదే సరైన సమయం.  

బ్రిస్బేన్‌: అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా పర్యటనకు నేటితో తెరలేవనుంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో బుధవారం జరుగనున్న తొలి పోరులో భారత్‌... ఆసీస్‌ను ఢీ కొననుంది. ఇటీవలి కాలంలో మ్యాచ్‌కు ముందు రోజే జట్టును ప్రకటిస్తున్న టీమిండియా మరోసారి అదే పద్ధతి పాటించింది. ఓవైపు విరాట్‌ కోహ్లి సేన పూర్తిస్థాయి బలగంతో సంసిద్ధంగా ఉండగా, రాబోయే టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ఈ లెక్కన చూస్తే ఫించ్‌ నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు ఇది కఠిన పరీక్షే. 

ఆ ఒక్కరు ఎవరు
తుది జట్టుపై దాదాపు స్పష్టతతో ఉంది టీమిండియా. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ నుంచి తప్పుకొన్న కెప్టెన్‌ కోహ్లి తిరిగి రావడంతో మనీశ్‌ పాండేను తప్పించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, దినేశ్‌ కార్తీక్, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌లతో బ్యాటింగ్‌ దుర్బేధ్యంగా ఉంది. అయితే... ఇన్‌స్వింగర్లు, షార్ట్‌ బంతులతో రోహిత్‌ను పరీక్షించాలని ఆసీస్‌ భావిస్తోంది. ఈ సవాల్‌ను ‘హిట్‌మ్యాన్‌’ ఏ మేరకు ఛేదిస్తాడో చూడాలి. ధావన్‌తో కలిసి అతడు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చేవారి పని సులభం అవుతుంది. పిచ్‌ పరిస్థితులరీత్యా భువనేశ్వర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌ల పేస్‌ త్రయం బరిలో దిగడం ఖాయం. స్పిన్‌ ద్వయం ఎవరనేదే తేలాల్సి ఉంది. కృనాల్‌ పాండ్యాను ఆల్‌రౌండర్‌ కోటాలో పరిగణిస్తే, మిగిలిన ఒక్క బెర్తుకు కుల్దీప్, చహల్‌లలో ఒకరిని ఎంచుకోవాలి. వైవిధ్యంరీత్యా కుల్దీప్‌ వైపే మొగ్గు చూపొచ్చు. 

ఆసీస్‌... స్పిన్నర్‌ లేకుండానే? 
ఇటీవల టి20ల్లో ఏ జట్టూ ఎదుర్కోనన్ని పరాజయాలను చవిచూసింది ఆస్ట్రేలియా. ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓటమి పాలైంది. ఒక స్వరూపమే లేదన్నట్లుందా జట్టు. దీనికి తగ్గట్లు ఈ సిరీస్‌ నుంచి పేసర్లు మిషెల్‌ స్టార్క్, హాజిల్‌వుడ్, కమ్మిన్స్‌తో పాటు స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌కు విశ్రాంతినిచ్చింది. ఇక డీ ఆర్సీ షార్ట్, క్రిస్‌ లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్‌... వీరంతా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగలవారే అయినా ఒక్కరికీ నిలకడ లేదు. ఫించ్‌ మినహా ఎవరిపైనా భరోసా పెట్టుకోలేని పరిస్థితి. ఈ బ్యాటింగ్‌ లైనప్‌కు భారత బౌలింగ్‌ను ఎదుర్కొనడం సవాలే. ‘గబ్బా’ పిచ్‌ బౌన్స్‌ కారణంగా పేస్‌నే నమ్ము కుని స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ లేకుండానే ఆడనున్నట్లు కనిపిస్తోంది. మ్యాక్స్‌వెల్‌ మాత్రమే ఏకైక స్పిన్నర్‌. 

బుమ్రాకిది ప్రత్యేకం 

దాదాపు మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపైనే అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. మూడు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. అప్పటి నుం చి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదతడికి. తర్వాత వన్డే, టెస్టు జట్లలో కీలకమయ్యాడు. 

అహో!  ఆ సిరీస్‌.. 
2016 పర్యటనలో మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వంలోని భారత్‌ మూడు టి20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్‌ చేసింది. స్టార్‌ ఆటగాళ్లైన స్మిత్, వార్నర్, వాట్సన్‌లు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాపై టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. కోహ్లి 199 పరుగులతో మెరిశాడు. 

దూకుడు అనేది మైదానంలో పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థి కవ్వింపులతో మా ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందని అనిపిస్తే తగినట్లు ప్రతిస్పందిస్తాం. మేం మాత్రం ముందుగా అలాంటివి చేయం. అయినా, విజయం కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం అనేదే దూకుడంటే. నా దృష్టిలో జట్టు గెలుపు కోసం 120 శాతం శ్రమించడం కూడా ఇలాంటిదే. దీనిని బాడీ లాంగ్వేజ్‌లోనూ చూపొచ్చు.  
–భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 

కొంతకాలంగా భారత్‌ అన్ని ఫార్మాట్లలో బలంగా ఉంది. అయినా, వారి నుంచి మ్యాచ్‌లను లాగేసుకోగలం. ఈ సిరీస్‌ మా సత్తా చాటేందుకు వేదిక. పరిస్థితులరీత్యానే స్పిన్నర్లు లేకుండా ఆడుతున్నాం. అయినా, మాకు ఆగర్, జంపా రూపంలో ప్రత్యామ్నాయాలున్నాయి. మేం ఎప్పుడూ విజయాన్ని కోరకుంటాం. దూకుడుగా ఆడటం ఆస్ట్రేలియన్ల లక్షణం. దానికి ప్రజలు వేర్వేరు భాష్యాలు చెప్పుకొంటారు.  
–అరోన్‌ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్‌  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, దినేశ్‌ కార్తీక్, రిషభ్‌ పంత్, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్, చహల్‌/కుల్దీప్, బుమ్రా, ఖలీల్‌. 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, మెక్‌డెర్మట్, క్యారీ, కూల్టర్‌నీల్, ఆండ్రూ టై, బెహ్రెన్‌డార్ఫ్, స్టాన్‌లేక్‌. 

పిచ్, వాతావరణం 
గబ్బా పిచ్‌ అదనపు బౌన్స్‌కు పెట్టింది పేరు. బౌండరీలు పెద్దవి. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. 

మధ్యాహ్నం 
గం.1.20 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లలో ప్రత్యక్ష ప్రసారం   

మరిన్ని వార్తలు