ఆఖరి పోరుకు రె'ఢీ'!

7 Nov, 2017 00:40 IST|Sakshi

నేడు భారత్, న్యూజిలాండ్‌ చివరి టి20

గెలిస్తే సిరీస్‌ సొంతం

ఒత్తిడిలో కోహ్లి సేన

మ్యాచ్‌కు వాన గండం

భారత్, న్యూజిలాండ్‌ పోరు ఆఖరి అంకానికి చేరుకుంది. తొలి వన్డేలో అనూహ్యంగాఓడి ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో భారత్‌ సిరీస్‌ సొంతం చేసుకోగలిగింది. అదే జోరు తొలి టి20లో కొనసాగినా... గత మ్యాచ్‌లో మాత్రం కివీస్‌ విశ్వరూపం చూపించింది.ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలనిఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. భారత గడ్డపై రాక రాక వచ్చిన సిరీస్‌ గెలుపు అవకాశాన్ని పోగొట్టుకోరాదని న్యూజిలాండ్‌ భావిస్తుండగా, సొంతగడ్డపై అవమానం ఎదుర్కోరాదని కృత నిశ్చయంతో ఉన్న విరాట్‌ బృందంపైనే ఒత్తిడి అధికంగా ఉంది.   

తిరువనంతపురం: దాదాపు మూడు దశాబ్దాల క్రితం త్రివేండ్రం పేరుతో అంతర్జాతీయ వన్డేకు ఆతిథ్యం ఇచ్చిన నగరంలో మళ్లీ ఇన్నాళ్లకు క్రికెట్‌ సందడి వచ్చింది. ఇక్కడ నూతనంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో నేడు భారత్, న్యూజిలాండ్‌ మధ్య చివరిదైన మూడో టి20 మ్యాచ్‌ జరగనుంది. సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్న స్థితిలో ఈ మ్యాచ్‌ ఫలితం సిరీస్‌ విజేతను కూడా నిర్ణయిస్తుంది. అందుకే భారత్‌లో కివీస్‌ పరిమిత ఓవర్ల పర్యటనకు ముగింపు ఇస్తున్న ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. 1988లో ఇదే నగరంలోని మరో స్టేడియంలో జరిగిన నాటి మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న రవిశాస్త్రి ఇప్పుడు కోచ్‌గా, అప్పుడు ఇంకా పుట్టని విరాట్‌ కోహ్లి ఇప్పుడు కెప్టెన్‌గా టీమిండియా కొత్త వ్యూహాలకు సిద్ధమవుతుండగా... తమ ఆటగాళ్లు గత మ్యాచ్‌ తరహాలో దూకుడును కొనసాగించాలని విలియమ్సన్‌ కోరుకుంటున్నాడు.
 
కుల్దీప్‌కు చాన్స్‌!
సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత్‌కు న్యూజిలాండ్‌ ఎంత ప్రమాదకారినో రెండో మ్యాచ్‌లో గానీ అర్థం కాలేదు. దాదాపు 200 పరుగుల స్కోరుతో ఆ జట్టు విసిరిన సవాల్‌ను భారత్‌ అధిగమించలేకపోయింది. కోహ్లి పోరాటాన్ని మినహాయిస్తే అక్కడ జట్టు బ్యాటింగ్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. నిజానికి కోహ్లి ఐదుగురు బౌలర్ల వ్యూహం కారణంగా ఆ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మన్‌ తగ్గిన లోటు కనిపించింది. ఈ సారి దానిని టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి. సిరీస్‌ గెలవాలంటే కోహ్లి ఒక్కడే కాకుండా ఓపెనర్లిద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్‌కు మరో అవకాశం ఖాయం. ధోని బ్యాటింగ్‌ తీరుపైనే కాకుండా అతని బ్యాటింగ్‌ స్థానంపై కూడా తీవ్ర చర్చ మొదలైన నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి. అయితే పాండ్యా బ్యాటింగ్‌ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియాతో చివరి వన్డే తర్వాత అతని మెరుపులు అసలు కనిపించలేదు. అయితే కెప్టెన్‌ కోహ్లి విశ్వాసం చూరగొన్న అతను ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో కివీస్‌ పరుగులు సాధించినా... ముగ్గురు ప్రధాన బౌలర్లు బుమ్రా, భువీ, చహల్‌ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. కేవలం అక్షర్, కొత్త ఆటగాడు సిరాజ్‌లపై మాత్రమే ప్రతాపం చూపించి ప్రత్యర్థి భారీ స్కోరు చేయగలిగింది. కాబట్టి బౌలింగ్‌ విషయంలో ఆందోళన అనవసరం. బ్యాటింగ్‌ పిచ్‌పై దురదృష్టవశాత్తూ రాణించలేకపోయిన సిరాజ్‌కు మరో అవకాశం ఇస్తారా లేక కివీస్‌ను ఇబ్బంది పెట్టేందుకు చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ను తీసుకుంటారా చూడాలి.

మార్పుల్లేకుండానే...
సిరీస్‌ తొలి పోరులో చిత్తుగా ఓడిన తర్వాత రాజ్‌కోట్‌లో దక్కిన విజయం న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్యాటింగ్‌ బలంతో భారీ స్కోరు చేయగలిగితే ఆ తర్వాత భారత జట్టులోని స్టార్‌ ఆటగాళ్లను కూడా ఒత్తిడిలో చిత్తు చేయవచ్చనే విశ్వాసం వారికి కలిగింది. బౌల్ట్‌ మినహా చెప్పుకోదగ్గ బౌలర్‌ లేకపోయినా... కివీస్‌ గత మ్యాచ్‌లో పట్టు చేజారకుండా చేయగలిగింది. స్పిన్నర్లు సోధి, సాన్‌ట్నర్‌ కూడా ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన ఇస్తుండటం కూడా ఆ జట్టుకు బలంగా మారింది. ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని న్యూజిలాండ్‌ ఆశిస్తోంది. సెంచరీ హీరో మున్రోతో పాటు మరో హిట్టింగ్‌ ఓపెనర్‌ గప్టిల్‌ మళ్లీ చెలరేగితే కివీస్‌కు తిరుగుండదు. విలియమ్సన్, బ్రూస్‌లతో జట్టు బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తుంటే ‘జూనియర్‌ మెకల్లమ్‌’గా గుర్తింపు తెచ్చుకున్న కీపర్‌ ఫిలిప్స్‌ ఈ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే భారత్‌లో అడుగు పెట్టిన దగ్గరి నుంచి ప్రభావం చూపలేకపోయిన ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ జట్టును తీవ్రంగా నిరాశ పర్చాడు. ఐపీఎల్‌ అనుభవం కూడా ఉన్న గ్రాండ్‌హోమ్‌ ఎప్పుడైనా చెలరేగుతాడనే నమ్మకంతో ఉన్న మేనేజ్‌మెంట్‌ ఈ మ్యాచ్‌లో కూడా మరో అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా గత మ్యాచ్‌ వ్యూహాన్నే సమర్థంగా అమలు చేసి ఫలితం సాధించాలనుకుంటున్న కివీస్‌ను భారత్‌ తక్కువగా అంచనా వేస్తే కష్టం.  

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, అయ్యర్, పాండ్యా, ధోని, అక్షర్, భువనేశ్వర్, బుమ్రా, చహల్, సిరాజ్‌/కుల్దీప్‌.
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, బ్రూస్, ఫిలిప్స్, గ్రాండ్‌హోమ్, నికోల్స్, సాన్‌ట్నర్, బౌల్ట్, మిల్నే, సోధి.

పిచ్, వాతావరణం  
కొత్తగా కట్టిన స్టేడియం, కొత్త పిచ్‌ కావడంతో వికెట్‌ స్పందించే తీరుపై ఇంకా స్పష్టత లేదు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన వార్మప్‌ మ్యాచ్‌లోనైతే భారీగా పరుగులు వచ్చాయి. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. సోమవారం కూడా ఇక్కడ భారీగా వర్షం కురిసింది. డ్రైనేజీ వ్యవస్థ చాలా బాగుందని చెబుతున్నా... ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆటకు అంతరాయం కలగడం మాత్రం ఖాయం.  

ధోని బ్యాటింగ్‌ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అతనో దిగ్గజం. తాను ఏం చేస్తున్నాడో తనకు చాలా బాగా తెలుసు. బుమ్రాతో కలిసి బౌలింగ్‌ చేస్తుంటే సహచరుడిగా నాలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. చివరి ఓవర్లలో అతను పరుగులు నిరోధిస్తే, నేను కూడా అదే చేయగలను. మ్యాచ్‌ ఆరంభానికి ముందు మేమిద్దరం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్, పిచ్‌లాంటి అన్ని అంశాలను చర్చించుకుంటాం. – భువనేశ్వర్, భారత బౌలర్‌

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు