నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

15 Sep, 2019 01:57 IST|Sakshi

నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

మ్యాచ్‌కు పొంచి ఉన్న వర్షం!

ప్రపంచ కప్‌ సెమీస్‌ నిష్క్రమణ నైరాశ్యం నుంచి బయటపడి... కరీబియన్‌ పర్యటనలో వెస్టిండీస్‌ను చీల్చిచెండాడిన టీమిండియా... స్వదేశంలో సుదీర్ఘ క్రికెట్‌ సీజన్‌కు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్‌తో దీనికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్‌లో సఫారీలను ఎదుర్కొననుంది. ఇటు– అటు కుర్రాళ్లు... మధ్యలో సీనియర్లు అన్నట్లుగా ఉంది రెండు జట్ల పరిస్థితి. వీరిలో బ్యాటింగ్‌లో మెరిసేదెవరో? బౌలింగ్‌లో తమదైన ముద్ర వేసేదెవరో?  

ధర్మశాల: ఒకప్పుడు భారత్‌–దక్షిణాఫ్రికా మధ్య టి 20 అంటే... ధోని ఎలా ముగిస్తాడు? డివిలియర్స్‌ ఎంత కొడతాడు? అని చర్చలు సాగేవి. కానీ, ఇప్పుడంతా కుర్రాళ్ల కాలం. ఇరు జట్ల చూపు 2020 టి20 ప్రపంచ కప్‌ సన్నద్ధత పైనే. ముఖ్యంగా దక్షిణాఫ్రికా కొత్త తరానికి అవకాశాలిచ్చి చూడాలనుకుంటోంది. కాస్తోకూస్తో అనుభవం ఉన్న ఆటగాళ్లను రాటుదేలేలా చేయడంపై భారత్‌ దృష్టిపెట్టింది. నేడు ధర్మశాల వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో కూర్పు భిన్నంగా కనిపించనుంది. బలాబలాల ప్రకారం చూస్తే టీమిండియా తిరుగులేని విధంగా కనిపిస్తోంది. అందుకుతగ్గట్లు రాణిస్తే గెలుపు ఖాయం కానుంది.

ధావనా? రాహులా?
ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ధావన్, రాహుల్‌లలో ఎవరు ప్రారంభిస్తారో చూడాలి. ఇద్దరి ఫామ్, పరిస్థితి ఒకేలా ఉన్నా... మొగ్గు ధావన్‌ వైపే ఉండొచ్చు. నంబర్‌ 4లో మనీశ్‌ పాండే దిగుతాడు. ఆ తర్వాత పంత్‌ వంతు. పాండ్యా సోదరులు, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో ఆల్‌ రౌండర్లకు కొదవలేదు. జడేజా స్థానంలో రాహుల్‌ చహర్‌ను తీసుకునే ఆలోచన కూడా ఉంది. యువ పేసర్లు దీపక్‌ చహర్, నవదీప్‌ సైనీలపై పెద్ద బాధ్యతే ఉంది. హార్దిక్‌ మూడో పేసర్‌ పాత్ర పోషిస్తాడు. బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే కెపె్టన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ చెలరేగితే మిగతా సంగతి పంత్, పాండ్యా చూసుకుంటారు.   

సఫారీల్లో మెరిసేదెవరో?
క్వింటన్‌ డికాక్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికాకు అనుభవ లేమి పెద్ద సమస్య. అసలే ఒత్తిడికి తట్టుకోలేని ఆ జట్టు ఇక ఇప్పుడెలా ఆడుతుందో చూడాలి. ఆ జట్టు ఆటగాళ్లంతా కలిసి 220 టి20లు ఆడితే... భారత టాప్‌ త్రయం రోహిత్‌–ధావన్‌–కోహ్లిలే 219 మ్యాచ్‌లు ఆడారు. సఫారీ జట్టు సభ్యులు కొందరు ముందే భారత్‌ వచ్చి బెంగళూరులో స్పిన్‌ శిబిరంలో పాల్గొన్నారు. బ్యాటింగ్‌లో డికాక్, వాన్‌ డెర్‌ డసెన్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడ్డ బవుమా పొట్టి ఫార్మాట్‌ అరంగేట్రం చేయనున్నాడు. బౌలింగ్‌లో పేసర్‌ రబడనే వారికి కీలకం. షంశీ, డాలా, నోర్జె వంటివారు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కు సమస్యాత్మకం కాకపోవచ్చు.

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్, ధావన్‌/రాహుల్, కోహ్లి (కెపె్టన్‌), మనీశ్, పంత్, హార్దిక్, కృనాల్, జడేజా/రాహుల్‌ చహర్, సుందర్, దీపక్‌ చహర్, సైనీ.

దక్షిణాఫ్రికా: డికాక్‌ (కెపె్టన్‌), రీజా హెన్‌డ్రిక్స్, బవుమా, డసెన్, మిల్లర్, ఫెలూక్వాయో, ప్రిటోరియస్, ఫొరి్టన్‌/నోర్జె, రబడ, డాలా, షంశీ.

పిచ్, వాతావరణం
మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. శనివారం మధ్యాహ్నం వాన పడటంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. సహజంగా బ్యాటింగ్‌ వికెట్‌. 2015లో ఇక్కడ ఇదే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శతకం బాదాడు. కానీ, భారత్‌ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా తేలిగ్గానే అందుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా